చినుకు పడితే అంధకారమే
ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు ఏజెన్సీ మండలాలలో బుధవారం సాయంత్రం 7.30గంటలకు వచ్చిన గాలి దుమారం వల్ల ఏర్పడిన విద్యుత్ అంతరాయాన్ని గురువారం వరకు విద్యుత్ అధికారులు పునరుద్దరించలేదు. గురువారం రాత్రి 11:30 గంటలు దాటినా విద్యుత్‌ను పునరుద్దరించకపోవడంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఒకపక్క ఉక్కపోత, ఎండ తీవ్రతతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు నెలకొన్నాయి. కరెంటు లేకపోవడంతో తాగడానికి నీరు లేదని కొంతమేర విద్యుత్ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. రాత్రి వచ్చిన దుమారానికి ఇప్పటివరకు విద్యుత్తును పునరుద్ధరించుకోవడంతో ఏజెన్సీ ప్రజలు నానాఅవస్థలు పడుతున్నామని అంటున్నారు. మారుమూల మండలాల్లో ఎవరు అడుగుతారులే, ఏ అధికారులు వస్తారులే అనే నిర్లక్ష్యంగా అధికారులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మండలకేంద్రాల పరిస్థితే ఇలాఉంటే గ్రామాలలో పరిస్థితిని ఊహించవచ్చని, సకాలంలో బిల్లులు చెల్లించకుంటే విద్యుత్ సరఫరా నిలిపివేసే అధికారులు ఇలాంటప్పుడు ఎందుకు వెంటనే స్పందించారని మండలవాసులు అరొపిస్తున్నారు. తక్షణమే విద్యుత్‌ని పునరుద్దరించి, వచ్చేది వర్షాకాలం కావడంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వెంకటాపురం, వాజేడు మండలాల ప్రజలు కోరుతున్నారు.