చెరువు మట్టి మాయమవుతోంది…!
వరంగల్ నగర శివారులో చెరువు మట్టి మాయమైపోతుంది. మట్టి మాఫియాలు రెచ్చిపోతుండడంతో లక్షల్లో వ్యాపారం గుట్టుగా సాగుతోంది. ఎలాంటి అనుమతులు లేకుండా నగరశివార్లలోని చెరువుల్లో మట్టిని అడ్డగోలుగా, ఇష్టారీతిన తవ్వుతున్నారు. చెరువు మధ్యలో జెసిబిలతో పెద్ద పెద్ద గోతులు తవ్వుతూ టిప్పర్ల కొద్ది మట్టిని దొంగచాటున తరలించుకుపోతున్నారు. మిషన్ కాకతీయ పేరుతో ఈ మట్టి దొంగరవాణకు కాంట్రాక్టర్లు తెగబడుతున్నారు.
దొంగచాటు రవాణా…
ఎలాంటి అనుమతులు లేకుండా నగర శివారులో దాదాపు 15మందికిపైగా కాంట్రాక్టర్లు చెరువుల్లో మట్టిని తవ్వి రవాణా చేస్తున్నారు. రాత్రివేళల్లో ఈ మట్టి తవ్వకాన్ని కొనసాగిస్తున్న వీరు చెరువులకు సమీప ప్రాంతంలోనే డంపింగ్ యార్డులను ఏర్పాటు చేసుకుని ఇక్కడ నుంచి ఇటుక బట్టీలకు మట్టిని రవాణా చేస్తున్నారు. ఒక టిప్పర్ లోడ్‌కు వేల రూపాయల్లో వసూలు చేస్తున్న మట్టి కాంట్రాక్టర్లు లక్షల్లో దండుకుంటున్నారు.
కళ్లు మూసుకున్న రెవెన్యూశాఖ
వరంగల్ అర్బన్ శివారులో అక్రమంగా మట్టి తవ్వకాలను కొనసాగిస్తూ దొంగచాటుగా రవాణా చేస్తున్న అధికారులు మాత్రం తమకేం తెలియనట్లు, పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. మట్టి అక్రమరవాణా గూర్చి ప్రశ్నిస్తే మట్టి తవ్వెటప్పుడు తమకు సమాచారం అందించండని గ్రామస్తులకు ఉచిత సలహా ఇస్తున్నట్లు తెలిసింది. రాత్రివేళల్లో తవ్వి డంప్ చేస్తున్నారని ఫిర్యాదు చేస్తే తవ్వే సమయంలో తప్ప, డంప్ చేసేటప్పుడు చర్యలు తీసుకునే అవకాశం లేదని స్థానిక విఆర్వోలు రూల్స్ వల్లె వేస్తున్నారట. రెవెన్యూ అధికారుల తతంగం అంతా చూస్తుంటే కాంట్రాక్టర్లు వీరిని ఎప్పుడో ప్రసన్నం చేసుకుని ఉంటారని నగరశివారు గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు.