నిబంధనల మేరకు అభ్యర్థులు ఎన్నికల ప్రచారం నిర్వహించాలి

జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా

ర్యాలీలు, సభల నిర్వహణకు ముందస్తు అనుమతి తప్పనిసరి

ఎన్నికల కోడ్ ఉల్లంఘనల పై సి విజల్ యాప్ ద్వారా ఫిర్యాదు

 

ఎన్నికల నిర్వహణ కోసం జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

భూపాలపల్లి నేటిధాత్రి

శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశం మందిరంలో కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి భవేష్ మిశ్రా, భూపాల్ పల్లి సాధారణ పరిశీలకులు అభయ్ నందన్ అభస్తా, ఎన్నికల వ్యయ పరిశీలకులు కౌశిక్ రాయ్, పోలీస్ పరిశీలకులు అమిత్ కుమార్ లతో కలిసి పోటీపడే అభ్యర్థులు, ఎన్నికల విధులు నిర్వహిస్తున్న వివిధ టీమ్ ల అధికారులతో ఎన్నికల నిర్వహణపై సమావేశం నిర్వహించారు.
కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి భవేష్ మిశ్రా మాట్లాడుతూ భూపాల్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఎన్నికల నిర్వహణ కోసం నామినేషన్ల స్వీకరణ పూర్తయిందని, 13న నామినేషన్ల స్క్రుటిని ఉంటుందని, నవంబర్ 15 వరకు ఉపసంహరణ గడువు ఉంటుందని అన్నారు.
భారత ఎన్నికల కమిషన్ 80 ఏళ్లు పై పడ్డ వృద్ధులకు, దివ్యాంగులకు ,కోవిడ్ పేషెంట్లకు ఇంటి వద్ద నుంచి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించిందని, దీనికోసం భూపాలపల్లి దాదాపు 144 మంది దరఖాస్తు చేసుకున్నారని, రిటర్నింగ్ అధికారి ద్వారా వీరి వివరాలు రాజకీయ పార్టీ ప్రతినిధులకు అందజేస్తామని తెలిపారు.
నవంబర్ 18న బ్యాలెట్ పేపర్ ముద్రణ జరుగుతుందని, అనంతరం రిటర్నింగ్ అధికారి సదరు ఓటర్ల ఇంటి నుంచి ఓటు హక్కు స్వీకరించేందుకు బృందాలను వీడియోగ్రఫీ తో కలిపి పంపుతారని, రాజకీయ పార్టీల ప్రతినిధులు సైతం హాజరు కావచ్చు అని కలెక్టర్ తెలిపారు.
భారత్ ఎన్నికల కమిషన్ 13 రకాల అత్యవసర సేవా విభాగంలో పనిచేసే వారికి పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు కల్పించిందని వీరి కోసం రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద ఒక తేదీని నిర్ణయించి, ఆరోజు పోస్టల్ ఓటింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, సదరు వివరాలు రిటర్నింగ్ అధికారి అందజేస్తారని తెలిపారు.
ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగులకు సైతం పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఉంటుందని, వీరి వివరాలను సైతం రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేస్తామని అన్నారు. ఎన్నికల పోటిలో 15 కంటే ఎక్కువ మంది అభ్యర్థులు పోటిలో ఉంటే అదనపు బ్యాలెట్ యూనిట్ అవసరమవుతుందని, మరో మారు ఈవిఎం ర్యాండమైజేషన్ చేయాల్సి ఉంటుందని తెలిపారు.
ఓటర్ స్లిప్పుల పంపిణీ పై ఎన్నికల కమిషన్ ప్రత్యేక దృష్టి సారించిందని, ప్రతి ఓటరుకు ఓటరు స్లిప్పు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఎన్నికల సమీపిస్తున్న సమయంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన విఐపి ప్రచారం కోసం హెలిపాడ్ వినియోగించుకోవడానికి 48 గంటల ముందు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు.
ఎన్నికల సమయాలలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఉండే ఫిర్యాదుల పరిష్కారానికి సి విజల్ యాప్ ను విస్తృతంగా వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు.సి విజల్ యాప్ ద్వారా వచ్చే ఫిర్యాదులకు 100 నిమిషాలో పరిష్కరించడం జరుగుతుందని అన్నారు.
ఎన్నికలలో విద్వేష ప్రసంగాలు, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన, అక్రమ డబ్బు మద్యం పంపిణీ, ఇతర ఉల్లంఘనలపై సి విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని, ఫిర్యాదుదారుని ఫోన్ నెంబర్ ఎవరికి తెలియదని, వివరాలు గోప్యంగా ఉంటాయని కలెక్టర్ పేర్కొన్నారు. 1950 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కూడా ఫిర్యాదులు నమోదు చేయవచ్చని అన్నారు.
భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఎన్నికల పర్యవేక్షించేందుకు ఎన్నికల సాధారణ పరిశీలకులు అభయ్ నందన్ అభస్తా ఫోన్ నెంబర్ 8977550382 , ఎన్నికల వ్యయ పరిశీలకులు కౌశిక్ రాయ్ ఫోన్ నెంబర్ 8977550383, పోలిస్ పరిశీలకులు అమిత్ కుమార్ ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ 8904828129ల నందు అందుబాటులో ఉంటారని, ఏమైనా సమస్యలు, ఫిర్యాదు ఉంటే తెలియజేయవచ్చని అన్నారు.
ఎన్నికల నిర్వహణ పర్యవేక్షణ కోసం సమీకృత కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, ఏదైనా సందేహాలు ఉంటే 08713293371 నెంబర్ నందు సంప్రదించాలని తెలిపారు. అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా ర్యాలీలు, సభల నిర్వహణకు ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని అన్నారు.
అభ్యర్థుల ఎన్నికల ఖర్చు వివరాలు జిల్లాలో నిర్దేశించిన రేట్ చార్ట్ ప్రకారం నమోదు చేయడం జరుగుతుందని, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సైతం అభ్యర్థుల ఖాతాలో నమోదు చేయడం జరుగుతుందని, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసే వీడియో, ఆడియో లకు ముందస్తు అనుమతి తీసుకోవాలని అన్నారు.
భూపాలపల్లి ఎన్నికల పరిశీలకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్య పండుగగా ఎన్నికలను పారదర్శకంగా పవిత్రంగా నిర్వహించాలని అన్నారు. ప్రతి అంశానికి సంబంధించి ఎన్నికల కమిషన్ నిర్దేశిత మార్గదర్శకాలు సూచించిందని, వాటిని తూచ తప్పకుండా పాటించాలని అన్నారు.
అనంతరం సమీకృత కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్, మీడియా సెంటర్/ మీడియా సర్టిఫికేషన్ మరియు మానిటరింగ్ కమిటీ లను, అంబేద్కర్ స్టేడియం లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూం లను పరిశీలించారు.
ఈ సమావేశంలో జనరల్ అబ్జర్వర్ అభయ నందన్ అబస్త, పోలీస్ అబ్జర్వర్ అమిత్ కుమార్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ కౌశిక్ రాయి జిల్లా ఎస్పీ కిరణ్ కరే అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అసిస్టెంట్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ పోటిలో ఉన్న అభ్యర్థులు, వివిధ టీం లోని అధికారులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *