కెమెరాలు బంద్..డిఐఈవో హస్తం ఉందా….?
– సీసీ కెమెరాలను నిలిపివేసిందెవరు..!
– కెమెరాల బంద్‌తో పలు అనుమానాలకు తెర
– డిఐఈవో ఏం చేస్తున్నట్టు
– ప్రశ్నిస్తున్న విద్యార్థి, ప్రజాసంఘాలు
వరంగల్ ఇంటర్మీడియట్ అర్బన్ కార్యాలయంలో సీసీ కెమెరాలను నిలిపివేశారని ‘నేటిధాత్రి’లో వెలువడిన కథనాన్ని చదివిన ప్రజలు, విద్యార్థి, ప్రజాసంఘాల నేతలంతా వరంగల్ అర్బన్‌జిల్లా ఇంటర్మీడియట్ కార్యాలయ అధికారుల తీరును ప్రశ్నిస్తున్నారు. అవినీతి లీలలు అలుముకున్నాయని గత ఐదు రోజులుగా వరుసగా ‘నేటిధాత్రి’లో కథనాలు వస్తున్న విషయం పాఠకులకు తెలిసిందే. ఈ నేపధ్యంలో సీసీ కెమెరాలను నిలిపివేసి ఈ తతంగమంతా చేసివుంటారన్న అనుమానం ఇప్పుడు జిల్లాలో దుమారం రేపుతున్నది.
-డిఐఈవో ఏం చేస్తున్నట్టు
కార్యాలయంలో సీసీ కెమెరాలు గత ఏప్రిల్ నెల నుండి నిలిపివేసిన విషయం డిఐఈవోకు తెలియకుండా వుంటుందా? కెమెరాలు పని చేస్తున్నాయా లేదా అని ఒక్కసారి కూడా కార్యాలయ సిబ్బందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం ఎందుకు చేయలేదు..తన చాంబర్‌లో టీవి మానిటర్‌ను నెలలో ఒక్కసారి కూడా ఎందుకు ఓపెన్ చేయలేదు..కావాలనే డిఐఈవో నిలిపివేశాడా..కార్యాలయంలోని ఉద్యోగులు నిలిపివేశారా? అన్న మిలియన్ డాలర్ల ప్రశ్న ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఆలోచన రేకెత్తిస్తున్నది. ఇంత జరుగుతున్నా డిఐఈవో అటు వైపు దృష్టి సారించకపోడంలో ఆంతర్యం ఏమిటని పలు విద్యార్థి, ప్రజాసంఘాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.
-కెమెరాల బంద్‌తో పలు అనుమానాలకు తెర
కార్యాలయంలో ఇంటర్మీడియట్ పరీక్షల పేపర్ వాల్యుయేషన్ అనంతరం లెక్కకు మించి బిల్లులు పెట్టి ప్రభుత్వ సొమ్మును అప్పనంగా కాజేశారని ‘నేటిధాత్రి’లో వెలువడిన కథనాలు ఇప్పుడు రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్నాయి. బిల్లులు తయారుచేసే సమయంలో తమ అవినీతి ఎవరికి చిక్కకుండా దొరకకుండా కెమెరాలను నిలిపివేసి వుంటారని ప్రజలు భావిస్తున్నారు. ప్రతి కాలేజీలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఉపన్యాసాలిచ్చే డిఐఈవో తన కార్యాలయంలో మాత్రం సీసీ కెమెరాలను ఎందుకు నిలిపివేశారో..ఎవరు నిలిపివేశారో సమాధానం చెప్పాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.