ఓ వైపు తొమ్మిదిన్నరేళ్ల పాలన ఫలాలను వివరిస్తూ… మరో వైపు ప్రత్యర్థులపై ప్రధానంగా కాంగ్రెస్‌పై ఎదురుదాడి చేస్తూ.. సాగుతోంది.. గులాబీ పార్టీ ప్రచార శైలి. అభ్యర్థుల నుంచి అధినేత వరకూ… తాము చేసింది చెబుతూ.. చేయబోయేవి హామీ ఇస్తూ.. కాంగ్రెస్ ఏమీ చేయలేదంటూ దాడి చేస్తూ ప్రసంగిస్తున్నారు. ఢిల్లీ బానిసలు.. గుజరాత్ గులాంలు కావాలా.. పోరాడి రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ కావాలా అంటూ.. మరోసారి తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
కేసీఆర్ తన ప్రసంగాల్లో తొమ్మిదిన్నరేళ్లలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. తాను పర్యటిస్తున్న నియోజకవర్గంలో జరిగిన మార్పులను గుర్తు చేస్తున్నారు. ఆశీర్వదించి గెలిపించాలని కోరుతూనే మళ్లీ అధికారంలోకి వచ్చేది తామేనంటూ విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నారు. మళ్లీ గెలిపిస్తే… రానున్న కాలంలో సంక్షేమ పథకాల ప్రయోజనాలు పెంచడంతో పాటు.. బీమా అమలు చేస్తామని హామీలు ఇస్తున్నారు.
కేసీఆర్‌తో పాటు కేటీఆర్, హరీశ్‌రావు ప్రత్యర్థ పార్టీలపైనా విరుచుకు పడుతున్నారు. తాము చేసింది చెబుతూ.. చేయబోయేవి హామీ ఇస్తూనే కాంగ్రెస్, బీజేపీపై ఎదురుదాడి చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీపైనే ప్రధానంగా విమర్శలు ఎక్కుపెడుతున్నారు. కాంగ్రెస్ పొరపాటున నమ్మితే.. తెలంగాణ మళ్లీ అంధకారంలోకి వెళ్తోందని ప్రసంగాల్లో బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఆరోపిస్తున్నారు. గ్యారంటీల పేరుతో కర్ణాటకలో గెలిచి.. ఆరు నెలల్లోనే మోసం చేశారంటూ.. ఆ రాష్ట్ర పరిస్థితులను ప్రచారం చేస్తున్నారు.
మరోవైపు కేసీఆర్ నియోజకవర్గాల పర్యటనల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఈనెల 26న ముందుగా ప్రకటించిన నాగర్‌కర్నూలు బదులుగా వనపర్తిలో సభ నిర్వహిస్తారు. ఈనెల 27న గతంలో ప్రకటించిన స్టేషన్‌ఘన్‌పూర్ బదులుగా మహబూబాబాద్, వర్దన్నపేటలో కేసీఆర్ ప్రజాశీర్వాద సభల్లో పాల్గొంటారు. మిగతావన్నీ యథాతథంగా ఉంటాయి.