బీఆర్ఎస్ మేనిఫెస్టో కేసీఆర్ బీమా పేరుతో కొత్త స్కీమ్

విపక్షాల మైండ్ బ్లాక్…

తెలంగాణలో మూడోసారి కూడా అధికారం చేపట్టాలన్న లక్ష్యంతో ఉన్న బీఆర్ఎస్ పార్టీ.. అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా తన మేనిఫెస్టోను ప్రకటించింది. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ మేనిఫెస్టోను ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. గత ఎన్నికల్లో మాదిరి ఈ ఎన్నికల్లోనూ కేసీఆర్ ప్రజలపై వరాల వర్షం కురిపించారు. రైతు బంధు, దళిత బంధు, కల్యాణ లక్ష్మి వంటి ఇతర పథకాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు ఈ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలకు కేసీఆర్ మరో కొత్త హామీ ఇచ్చారు. రైతు బీమా తరహాలో.. తెల్ల రేషన్‌ కార్డుదారులకు… బీమా అమలు చేస్తామని.. సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఎల్‌ఐసీ ద్వారా ఈ ప్రక్రియను చేపట్టి… పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకుంటామని కేసీఆర్‌ భరోసా కల్పించారు.

బీఆర్ఎస్‌ పార్టీనే మళ్లీ అధికారంలో వస్తుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తెల్ల రేషన్‌ కార్డు ఉన్న కుటుంబాలకు కేసీఆర్‌ బీమా చేయిస్తామని.. 93 లక్షల కుటుంబాలకు కేసీఆర్‌ బీమా ద్వారా లబ్ధి చేకూరుతుందని తెలిపారు. కేసీఆర్‌ బీమా…ప్రతి ఇంటికి ధీమా అని అభివర్ణించారు. తెల్ల రేషన్‌ కార్డు ఉన్న కుటుంబాలకు సన్నబియ్యం అందిస్తామని.. ‘తెలంగాణ అన్నపూర్ణ’ పథకం ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తామని వెల్లడించారు. మరోవైపు దశల వారీగా ఆసరా పింఛన్ల మొత్తం పెంపు ఉంటుందని చెప్పారు. మొదటి ఏడాది రూ.3 వేలు పెంచి.. ఏటా రూ.5వందల చొప్పున రూ.5వేల వరకు పెంచుతామని వెల్లడించారు.

ఏటా 3 కోట్ల టన్నుల ధాన్యం పండిస్తున్నామని కేసీఆర్ తెలిపారు. వ్యవసాయరంగంలోతెలంగాణ దేశంలోనే అగ్రస్థానానికి చేరుకుందని చెప్పారు. తెలంగాణలో రైతుబంధు, రైతుబీమా పథకాలు తెచ్చామని వివరించారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు క్లిష్ట పరిస్థితులు ఉండేవన్న కేసీఆర్.. కరెంట్‌, నీటి సౌకర్యాలు ఉండేవి కావని అన్నారు. మేనిఫెస్టోలో చెప్పని వాటిని కూడా అమలు చేశామని.. కల్యాణలక్ష్మి పథకం ఎవరూ అడగకపోయినా అమలు చేశామని.. ఎన్నికల ప్రణాళికలో లేనివాటినీ అమలుచేసిన ఘనత బీఆర్ఎస్‌ పార్టీదేనని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *