"Goud Corporation Demand with 500 Crores in Warangal"
అన్న కర్మ రోజే తమ్ముడి మృతి.. ముగ్గురికి తలకొరివి పెట్టిన తండ్రి
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం : ఆగడ దరా శివా నీకు అమ్మతోడు… ఓ శివయ్యా, పార్వతిదేవి నీకు తోడుగా ఉంది. మా కుటుంబాన్ని రక్షించు అంటూ ఊరంతా కేతకి సంగమేశ్వర స్వామిని వేడుకున్నప్పటికీ, విధి ఆడిన వింత నాటకంలో గ్యాస్ లీక్ అయిన ఘటనలో తల్లితో పాటు ఇద్దరు కొడుకులు మృతి చెందిన విషాద ఘటన సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం ఏడాకులపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. తల్లి తర్వాత పెద్ద కొడుకు, అన్న దినకర్మ రోజున తమ్ముడు ఇలా పక్షం రోజులు గడవకముందే ముగ్గురు చనిపోవడం, ముగ్గురికి ఇంటి పెద్ద దిక్కైన తండ్రి తలకొరివి పెట్టడం గ్రామ ప్రజలు, బంధువులు, స్నేహితుల కళ్లను చెదిరిపోయేలా దుఃఖాన్ని మిగిల్చింది.
ఈనెల 6న సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం ఏడాకులపల్లిలో గ్యాస్ లీకైన ఘటనలో తల్లితోపాటు ఇద్దరి కొడుకులకు తీవ్ర గాయాలైన సంగతి తెలిసిందే. తల్లి శంకరమ్మ (65) మృత్యువుతో పోరాడుతూ.. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈనెల 8న మృతి చెందింది. తల్లి మరణం మరవకముందే ఆమె రెండవ కుమారుడు ప్రభు (38) పది రోజులుగా చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడి 15న మృతి చెందారు. అన్న దినకర్మ రోజు మరో వ్యక్తి విట్టల్ (30) మృత్యువుతో పోరాడుతూ.. పటాన్ చెరలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు సోమవారం ఉదయం మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.అయ్యో దేవుడా నా కొడుకులకు నేను తల కొరివి పెడుతున్నాను అంటూ తండ్రి బక్కన్న పుత్రశోకంతో కుమిలిపోతుంటే చూసినవారికి కన్నీటి దారలు ఆగలేదు. కొడుకులతోపాటు భార్య శంకరమ్మకు భర్త బక్కన్న తలకోరివి పెట్టాడు. ఇలా పక్షం రోజులు గడపక ముందే ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో గతంలోని కేసు నమోదయింది. ఇంత జరిగినా ఒక్కరంటే ఒక్కరు నాయకుడు గానీ, అధికారులు కానీ అటువైపు కన్నెత్తి చూడలేదని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.
