లంచావతారులు ఎపిసోడ్‌ 3

https://epaper.netidhatri.com/

`నాలుగు కాదు పది!?

`ప్రభుత్వం మారింది.. ధర పెరిగింది?

`ఇది అధికారులు చెబుతున్న మాట.

`నిజమో! కాదో ప్రభుత్వ పెద్దలే చెప్పాలి.

`చెప్పింది వినాల్సిందే..అడిగింది ఇవ్వాల్సిందే?

`శేరిలింగంపల్లి సర్కిల్‌ అధికారుల లో బరితెగింపు?

`ఇల్లు కట్టుకోవాలంటే భయపడి పోతున్న జనం.

`అడిగినంత ఇస్తేనే పర్మిషన్‌?

`అక్రమాల అడ్డుకట్ట పడదా?

`అధికారులను మార్చినా తీరు మారదా?

`ప్రభుత్వ పెద్దల పేరు చెప్పి చేసే దోపిడీ ఆగదా?

`గతమంతా వసూళ్ల కుప్ప! అనుకున్నారు.

`ఇప్పుడున్నవాళ్లు గతాన్ని మించిపోతున్నారు.

`నిర్మాణాలపై అవినీతి చీడ!

`ఇల్లు కట్టుకునే వారికి మంచి రోజులు రావా?

`శేరిలింగంపల్లిలో చర్యలుండవా?

హైదరాబాద్‌,నేటిధాత్రి:

హైదరాబాద్‌ లో ఇంటి స్ధలం సామాన్యుడు కొనుగోలు చేసే పరిస్ధితి లేదు. ఎంతో సంపన్నుడైతే తప్ప వందగజాలు కొనుక్కోలేడు. ఒక వేళ ఎప్పుడో ఓ పదేళ్ల క్రితం కొనుగోలు చేసుకున్న స్ధలం వున్నా, ఇప్పుడు ఇల్లు కట్టుకోలేడు…ఇది వాస్తవ పరిస్ధితి. సప్త సముద్రాలనైనా ఈదొచ్చేమో కాని, హైదరాబాద్‌లో ఇల్లు కట్టుకోలేం. అధికారుల నుంచి వేధింపులు తట్టుకోలేం. వారి చెల్లింపులు చెల్లించలేం. వారి చెల్లించే మొత్తంతో మరో ఇల్లు కట్టుకోవచ్చు. నిబంధనల ప్రకారమే ఇల్లుకట్టుకున్నా, ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజులన్నీ చెల్లించినా సరే ఇల్లు కట్టుకోవాలంటే అధికారుల చల్లని చూపు కావాలి. వారి దీవెనలు కావాలి. వారి అండ కావాలి. వారు చెప్పినట్లు మనం వినాలి. అంతే కాదు, వాళ్లకు రాత్రికి రాత్రి కలపడి మరో నాలుగు పెంచుకున్నామనంటే కూడా వెంటనే ఇవ్వాలి. లేకుంటే పిల్లర్లు పడినా సరే కూల్చేందుకు జేసిబిలు ఇంటి ముందుకు వచ్చేస్తాయి. బెదిరిస్తాయి. అవసరమైతే ఓ పిల్లర్‌ కూల్చిన తర్వాతే మాటలు వినినిపిస్తాయి. దాంతో ఆ నరకం కన్నా, ముందే అడిగినంత ఇస్తే సరిపోతుందనుకొని సర్ధుకుపోయేవారు కొందరు. ఈ ఇల్లు కట్టుకోవడం నావల్ల కాదని వదిలేసేవారు కొందరు. సొంతంటి కల నెవరేరక అధికారుల వేధింపులు తట్టుకోలేకు ఉసురు తీసుకునేవారు కూడా వున్నారు. ఇలాంటి పరిస్ధితుల్లో మానసిక ఒత్తిడిని భరించలేక, మానసిక సంఘర్షణను తట్టుకోలేక, అధికారులు అడిగింది ఇచ్చుకోలేక ప్రాణాలు వదిలిన వారు కూడా వున్నారు. అయినా అధికారులు చలించరు. ఎవరి ప్రాణాలు పోతే ఎవరికేమిటి? ఎవరితో వారికేమిటి? రాక్షసులు రక్తాలు తాగినట్లు జనం సొమ్మును పీడిరచుకు తినాల్సిందే. అదికారులు వాటాలు పంచుకొని కోట్లకు పడగలెత్తాల్సిందే. పొరపాటునో, గ్రహపాటునో పట్టుబడితే అదే సొమ్ముతో మళ్లీ కొలువులు తెచ్చుకోవాలి. పోగొట్టుదంతా మళ్లీ సంపాదించుకోవాలి. ఇదీ నేటి అధికారుల తీరు. హెచ్‌ఎండిఏలో బాలకృష్ణలే కాదు, జిహెచ్‌ఎంసిలో అలాంటి బాలకృష్ణలు ఎందరో వున్నారు. అయినా పట్టించుకున్న నాధుడు లేడు. వారిని అదుపులో పెట్టడం ఎవరి వల్ల కావడం లేదు. ఎందుకంటే యధా పాలక, తధా అధికారి అన్నట్లు సాగుతోంది.
ఒక్కసారి శేరిలింగంపల్లి సర్కిల్‌ బాగోతాలుల రాస్తే బారతాన్ని మించిన గ్రంధమౌతుంది.
జిహెచ్‌ఎంసి పరిధిలో ముఖ్యంగా హైదరాబాద్‌లో శేరిలింగంపల్లి సర్కిల్‌ ఒక హాట్‌ కేక్‌. అక్కడ పోస్టింగ్‌ అంటే మాటలు కాదు…మూటలు కావాలి. ఆ మూటలు మళ్లీ తిరిగి రావాలంటే అరాచాలు చేయాలి. వసూళ్ల జోలె పట్టుకొని బెదిరించాలి. సర్కిల్‌ కార్యాలయం మెట్లు ఎక్కిన వారు నిలువుదోపిడీ ఇచ్చుకోవాలి. పొరపాటును సర్కిల్‌ కార్యాలయంలో పని వుంటే మాత్రం ఏళ్ల తరబడి కష్టపడి సంపాదించుకున్న సొమ్మును ఒక్క పూటలో హరతి కర్పూరం చేసుకోవాలంటే మాత్రమే అక్కడికి వెళ్లాలి. వేసుకున్న బట్టలు తప్ప జేబులో అణాపైసా మిగలొద్దనుకుంటే అధికారుల వద్దకు వెళ్లాలి. అవును… ఈ విషయాన్ని సర్కిల్‌ పరిధిలో ఎవరిని అడిగినా చెబుతారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. ప్రజలు మార్పు కోరుకున్నారు. అది అధికారులకు బాగా కలివచ్చింది. గత ప్రభుత్వ హయాంలో అధికారులు జనాన్ని పీక్కుతింటున్నారని బరించలేక ప్రజలు మార్పు కోరుకున్నారు. మారిన ప్రభుత్వ పెద్దల పేరు చెప్పి అధికారుల నొక్కాల్సినంత నొక్కేందుకు లెక్కలు వేస్తున్నారు. సంచులు పట్టుకొని తిరుగుతున్నారు? అవును గత ప్రభుత్వ హయాంలో అంటే సరిగ్గా మూడు నెలల క్రితం సర్కిల్‌ పరిధిలో ఒక్క ఫ్లోర్‌కు కనీసం లక్ష ఇవ్వాలి. అంటే నాలుగు ఫ్లోర్‌లు వేసుకుంటే నాలుగు లక్షలు ఇవ్వాలి. ఇదీ సక్కిల్‌ అధికారుల కమీషన్‌ లెక్క. సామాన్యుడి దగ్గర నుంచి పెద్ద అప్పార్టుమెంట్లు నిర్మాణం చేసే బిల్లర్లదాకా ఇవ్వాల్సిందే. కాకపోతే జస్ట్‌ చేయింజ్‌..ఇప్పుడు లెక్క మారింది. గతంలో ఫ్లోర్‌కు ఒక లెక్క వుండేది. కాని ఇప్పుడు ఏకంగా పదికి చేరింది. నాలుగు ఫ్లోర్ల్‌కు రౌండ్‌ఫిగర్‌ పది చేసేశారు. ఎంత గింజుకున్నా, కాళ్లా వేళ్లా పడి బ్రతిమిలాడినా సరే వినిపించేకునే సమస్యే లేదు. గతంలో ఓ డిప్యూటీ కమీషనర్‌ ఇలా నాలుగు లెక్కలు చెబుతున్నాడని అందరూ వేలిత్తి చూపించారు. పిర్యాధుల మీద పిర్యాధులు చేశారు. దాంతో ప్రభుత్వం మారగానే కొత్త సిబ్బంది వచ్చారు. కాని ఏం లాభం. రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పలేదన్నట్లు, కొత్త వారు వచ్చి కొత్త లెక్కలు చెబుతున్నారు. గతానికి మరింత జోడిరచి పది చేసి రౌండ్‌ పిగర్‌ చేశారు. ఇప్పుడు జనం లోబోదిబో అంటున్నారు. ఎవరికి చెప్పుకోవాలో అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారు. గతంతో నాలుగు సమర్పించుకొని, నిర్మాణాలు ఇంకా పూర్తికాని బిల్డింగుల యజమానులు చుక్కలు చూస్తున్నారు. గతంలో నాలుగు సమర్పించుకొని, ఎల్లీ ఎల్లక భవనాలు పూర్తి చేసుకోక, వేచి చూస్తున్నవారికి మళ్లీ వాతలు పడుతున్నాయి. ఆ నాలుగుకు మరో ఆరు కలిపి ఇవ్వాలంటూ హుకూంలు జారీ చేస్తున్నారు. నేటిధాత్రికి ఎంతో మంది బాధితులు పిర్యాధులు చేస్తున్నారు.
ఇదంతా ప్రభుత్వ పెద్దలకు తెలిసే జరుగుతుందా?
లేక వారికి తెలయకుండా ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు అధికారులు ఇలా ప్రజలను వేదిస్తున్నారా? అన్నది ప్రభుత్వమే తేల్చాలి. ఎందుకంటే ఎవరు తప్పు చేసినా, అది పరక్షంగా, ప్రత్యక్షంగా ప్రభుత్వం మీదే ప్రభావం చూపుతుంది. అందువల్ల ప్రభుత్వ పెద్దలు ఈ విషయంపై దృష్టి పెట్టాలి. లేకుంటే ప్రభుత్వ పెద్దల పేర్లు చెప్పి శేరిలింగంపల్లి సర్కిల్‌లోని ఉన్నతాధికి దగ్గర నుంచి కింది స్ధాయి అదికారుల దాకా వాటాలు పంచుకుంటున్నారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. గతంలో పనిచేసిన పెద్ద మనిషి సీటు ఖాళీ చేస్తే ప్రజలకు పీడ పోతుందని అనుకున్నారు. కాని పెనం నుంచి పొయ్యిలో పడ్డామని ప్రజలు భావిస్తున్నారు. నిజానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అవినీతిని రూపు మాపాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఏళ్ల తరబడి సర్కిళ్లలో పాతుకుపోయిన అధికారులను మార్చారు. దాంతో ప్రజలకు మేలు కలుగుతుందని అనుకున్నారు. కాని అది కూడా అదికారులకు తమకు అనుకూలంగా మార్చుకుంటారని ఊహించలేదు. కాని ప్రజలకు అదికారుల తీరు అర్ధమైంది. వేధింపులు మొదలయ్యాయి. కొత్త ప్రభుత్వంలో అదికారుల తీరు మారుతుందని ఊహించారు. వాటిని నిజం చేయాల్సిన అవసరం పాలకులపై వుంది. తప్పు చేస్తున్నారని తెలిసినా కూడా ఉపేక్షిస్తే అదికారులు ప్రజలను మరింత వేధిస్తారు. రాష్ట్రంలో ప్రజా పాలన వచ్చింది. అందువల్ల ప్రజలకు మరింత మేలు జరగాలి. ఎందుకంటే అదికారుల మార్పు మాత్రమే జరుగుతోంది. వారికి శిక్ష పడడడం లేదు. లంచాలు తప్పని తెలిసినా యధేచ్చగా తీసుకుంటున్నారు. ఒక్కొ అధికారి వందల కోట్ల రూపాయలు సంపాదించడం అంటే అవినీతి ఏ రేంజ్‌లో పెరిగిపోయిందో అర్ధం చేసుకోవచ్చు. కొండ నాలుక మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్లు, పాత అధికారులను మారిస్తే, బాగు పడుతుందనుంటే, మరింత పెరిగిందే తప్ప, తగ్గలేదు. మరింత విచ్చలవిడి తనం పెరగకుండా చేయాలి. అధికారుల అవినీతికి ఇప్పటికైనా అడ్డుకట్ట పడాలి. లేకుంటే సామాన్యుడు బతకడం కష్టం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *