మున్సిపల్ లో బీజేపీ జెండా ఎగరాలి – బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘు
మెట్ పల్లి జనవరి 10 నేటి దాత్రి
ప్రస్తుతం జరగబోయే మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో మెట్ పల్లి మున్సిపల్ పైన బీజేపీ జెండా ఎగరేయాలని, ఇందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త సమిష్టిగా కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ చిట్నేని రఘు పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేష్ అధ్యక్షతన మున్సిపల్ ఎన్నికల సన్నహాక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ చిట్నేని రఘు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ఎన్నికల్లో మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని బీజేపీ సొంతం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క బీజేపీ అభ్యర్థిని గెలిపించుకోబోతున్నామని పేర్కొన్నారు. నిజామాబాద్ ఎంపీగా ధర్మపురి అరవింద్ గెలిచిన తర్వాత ఈ ప్రాంతంలో సుమారుగా 49 శాతానికి పైగా బీజేపీ ఓటు బ్యాంకు పెరగడం శుభ పరిణామం అన్నారు. గతంలో జరిగిన పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో పెరిగిన బీజేపీ ఓటు బ్యాంకు ప్రస్తుత ఎన్నికల్లో కలిసి వచ్చే అంశమని పేర్కొన్నారు. వార్డుల్లో పార్టీ టికెట్ ఎవరికీ ఇచ్చినా అభ్యర్థిని గెలిపించుకోవడానికి సాయశక్తుల కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి నాయకుడు, కార్యకర్త కలిసికట్టుగా కృషి చేస్తే ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించనుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు, అసెంబ్లీ కన్వీనర్ చెట్లపల్లి సుఖేందర్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్డేపల్లి శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షురాలు ఎర్ర లక్ష్మీ, జిల్లా కార్యదర్శి పీసు రాజేందర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దొనికెల నవీన్, పట్టణ ప్రధాన కార్యదర్శులు సుంకేట విజయ్, కుడుకల రఘు, అన్ని వార్డుల బీజేపీ అభ్యర్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
