‘హైడ్రా’ చర్యలతో ప్రభుత్వానికి సవాళ్లు

పెద్దలు సరే…సామాన్యుల పరిస్థితేంటి?

 హైడ్రా లక్ష్యం మంచిదే…మార్గం కంటకమయం

 ధనిక దిగ్గజాలను ఎదుర్కోవడం పెను సవాలే

 నీతి..అవినీతి మధ్య పోరులో సమిధలు సామాన్యులే

 స్థానికులనుంచి పెరుగుతున్న మద్దతు

 స్వపక్ష, విపక్షాలనుంచి రేవంత్‌కు విమర్శలు

 భగవద్గీత స్ఫూర్తితో పనిచేస్తున్నా, బలీయవర్గాలను ఎదుర్కొనడం కత్తిమీద సామే

 హైడ్రా విజయంపై రేవంత్‌ ప్రతిష్ట ఆధారం

 ఇప్పటివరకు జరిగింది చాటంత! జరగాల్సింది కొండంత!!

ప్రస్తుతం హైదరాబాద్‌ మహానగరం అన్ని వైపులా అత్యంత వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగు ణంగా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ హైడ్రా పటిష్టంగా పనిచేయాలన్న లక్ష్యంతో చెరువులు, నాలాల ఆక్రమణలు తొలగించే బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాకు అప్పగించింది. ఆక్రమించిన ప్రభుత్వ స్థలాలను తిరిగి స్వాధీనం చేసుకోవడం, నాలాల అక్రమ ఆ క్రమణలను తొలగించడం ద్వారా వరద ముంపును తొలగించే లక్ష్యంతో ముందుకెళుతున్న హైడ్రాకు ముందుగా అనుకున్న విధంగానే సవాళ్లు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా అధికశాతం అక్రమ నిర్మాణాలు రాజకీయ పలుకుబడి కలిగిన ప్రముఖ వ్యక్తులవి కావడం మొదటి సమస్య కాగా, సామాన్యుల ఇళ్లను కూలగొట్టడం రెండోది. ఈ రెండు సమస్యలను అధిగమిస్తూ కఠినచర్యలతో ముందుకెళుతున్న హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ నాలాలు, చెరువుల ప్రాంతాల్లో నిర్మాణాలకు అనుమతులిచ్చిన ఉన్నతాధికార్లపై చర్యలకు ఉపక్రమించారు. ఇందులోభాగంగా ఆరుగురు అధికార్లపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని ఆయన నిర్ణయించడం ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటి వరకు పదిమంది ఆక్రమణదార్లు, నిర్మాణ సంస్థలపై కేసులు నమోదుచేశారు. అంతేకాదు హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లోని 13 చెరువుల్లో పూర్తిస్థాయి నీటిమట్టం కలిగిన బఫర్‌ జోన్లలో నిర్మాణాలను తొలగించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆయా నిర్మాణాల యజమానులకు నోటీసులు జారీచేసు ప్రక్రియ కూడా ప్రారంభం కావడం గమనార్హం. ఇదిలావుండగా హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌రోడ్డు పరిధిలోని నాలాలు, చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ బాధ్యతను కూడా హైడ్రాకు అప్పగించి, హైడ్రాకు మరిన్ని అధికారాలతో పాటు,సిబ్బందిని కూడా సమకూర్చాలన్న ప్రభుత్వ నిర్ణయం ముదావహం. ఇందులో భాగంగా అక్రమ ఆక్రమణలకు సంబంధించిన నోటీసులు ఇక ముందు కేవలం హైడ్రా మాత్రమే జారీచేసేవిధంగా విధివిధానాలను రూపొందించనున్నారు. ప్రస్తుతం హైడ్రా పరిధిలో 72 బృందాలు ఏర్పాటయ్యాయి. ఇంకా మరిన్ని బృందాలను ఏర్పాటు చేయనున్నారు. 

సామాన్యులే బాధితులు

ప్రభుత్వ ఉద్దేశం మంచిదే అయిప్పటికీ యిప్పటివరకు ప్రభుత్వం జరిపిన కూల్చివేతల్లో అధికశాతం మంది సామాన్యులే ఉన్నారు. తెలిసో తెలియకో ఇళ్లు నిర్మించుకొని కొన్ని దశాబ్దాలుగా జీవనం కొనసాగిస్తున్నవారు ఒకేసారి తమ ఇళ్లు కూలిపోతుంటే, ఎక్కడ తలదాచుకోవాలో తెలియని స్థితిలో వీధుల పాలయ్యే పరిస్థితి ఏర్పడిరది. ఇటువంటి బడుగు జీవులకు ప్రభుత్వం తగిన మార్గాలు చూపాలి. ధనవంతులఇళ్లను కూల్చివేసినా, వారికి మరోచోట సొంత ఇళ్లు వుంటాయి కనుక పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు. పేదలు, దిగువ మధ్యతరగతికి చెందిన ప్రజలు ఉన్న ఒక్క గూడును కోల్పోయి ఎక్కడికి వెళ్లాలి? కఠినంగా వ్యవహరించడంలో తప్పులేదు కానీ పేదల విషయంలో కాస్తంత కనికరం చూపి, వారికి ప్రత్యామ్నాయ వసతి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నది ఇక్కడ గుర్తుంచుకోవాలి. ప్రభుత్వం తీసుకునే చర్యలు మొత్తంమీద ఉత్తమ లక్ష్యాలను కలిగివున్నా తక్షణ బాధితులుగా మిగిలిపోయే బడుగులను పట్టించుకోకపోతే, వారికొక మా ర్గం చూపకపోతే ప్రభుత్వం చెడ్డపేరును మూటకట్టుకోక తప్పదు. ఆక్రమించుకున్న స్థలాల్లో నిర్మించిన విద్యాసంస్థలకు, విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా నోటీసులు జారీచేయడం లో తప్పులేదు. మరి అటువంటి ముందస్తు నోటీసులు సామాన్యులకు ఎందుకు జారీచేయడంలేదన్నది ప్రశ్న. ఒకవేళ ఆవిధంగా నోటీసులు ఇచ్చినా, వ్యవధి తక్కువగా వుండటం వల్ల వారు ఉన్నఫళంగా ఎక్కడికి వెళ్లగలరు? దీనికి తక్షణ పరిష్కారాన్ని ప్రభుత్వం ఆలోచించాలి. 

పెద్దలకు నోటీసులతో తిరకాసు

అక్రమ కట్టడాలపై పెద్దలకు ప్రభుత్వం నోటీసులు జారీచేయగానే, వారు కోర్టులను ఆశ్రయించి స్టే తెచ్చుకుంటున్నారు. ఫలితంగా ప్రభుత్వ లక్ష్యం నెరవేరకపోవడం మరో సమస్య. ఇటువంటి వారి ఇళ్లను ఎటువంటి నోటీసులు జారీచేయకుండా కూల్చివేసినా ఫరవాలేదు. పేదలకు నోటీసులు జారీచేయకుండా కూల్చివేతలు చేపట్టడం ఎంత తప్పో, ధనవంతులకు నోటీసులు జారీచేసి కూల్చివేయాలనుకోవడం కూడా అంతే తప్పు. చట్టం పేదలకు ‘చుట్టం’గా వ్యవహరించడంలేదన్న నగ్న సత్యాన్ని ప్రభుత్వం గుర్తించాలి. చట్టం సమానంగా వర్తింప జేయాలనుకున్నప్పుడు, బాధితులుగా మిగిలే నిరుపేదలను దృష్టిలో వుంచుకోవాల్సిన బాధ్యతను ప్రభుత్వం విస్మరించకూడదు. పర్యావరణ పరిరక్షణతో పాటు పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమం కూడా ఇక్కడ ప్రధానం. 

పూర్వ ఉద్యోగులపై చర్యలు సమంజసమా?

పరిపాలనా వ్యవస్థలో ఉద్యోగులు భాగం. పాలకులకు అనుగుణంగా పనిచేయడమే వారి విధి. ప్రభుత్వం నిజాయతీగా వ్యవహరిస్తే ఉద్యోగులు కూడా జాగ్రత్తగా పనిచేస్తారు. తమకు జీతం మాత్రమే ఆధారమన్న సంగతిని గుర్తుంచుకొని జాగ్రత్తగా మెలుగుతారు. అధికారంలోఉన్నవారు తమ అవినీతి లక్ష్యాలకోసం ఉద్యోగులను వాడుకుంటే, ఇక పాలనా వ్యవస్థపై ఎవరికీ నియంత్రణ లేకుండా పోతుంది. నిక్కచ్చిగా పనిచేసే ఉద్యోగి నిబంధనల ప్రకారమే ఒక పనికి అనుమతిని ఇస్తానని చెబితే, సదరు వ్యక్తి రాజకీయ నాయకుడి వద్దకు వెళ్లి అతని దన్నుతో పనిచేయించుకుంటాడు. ఇది ప్రస్తుత ప్రజాస్వామ్య వ్యవస్థలో నిత్యకృత్యమైంది. ఈ పరిస్థితుల్లో ఉద్యోగులు నిజాయతీగా వ్యవహరించరు. జీతం కంటే ఎన్నోరెట్ల అదనపు ఆదాయం కళ్లముందు కనిపిస్తున్నప్పుడు సుఖమయ జీవనం కోసం మరింత విచ్చలవిడి సం పాదనకు అర్రులు చాచడం లంచగొండితనం విశృంఖల స్థాయికి చేరుకోవడానికి కారణమవుతోంది. పాలకులు నిజాయతీగా వ్యవహరించనప్పుడు ఉద్యోగులు నిబద్ధంగా ఉంటారనుకోవడం అవివేకం. అక్రమంగా ఇళ్ల అనుమతులు మంజూరు చేశారంటూ గతంలో పనిచేసినఉద్యోగులపై చర్యలకు ఉపక్రమించడంలో సమంజసమెంతో ఆలోచించాలి? ఎందుకంటే వారిపై రాజకీయ నాయకుల ఒత్తిళ్లు ఆ స్థాయి లో పనిచేసి వుండవచ్చు లేదా ఇతరత్రా ప్రలోభాలకు లోనుచేసి వుండవచ్చు. ఇక్కడ చర్యలు ఎవరిపై తీసుకోవాలన్న ప్రశ్న ఉదయిస్తుంది.ఈ పాపం గత పాలకులదే నన్నది సుస్పష్టం. కేవలం ఉద్యోగి నిజాయతీగా వుండటం వల్ల ఫలితం వుండదు. అధికారంలో ఉన్నవారు నిజాయతీగా ఉన్నప్పుడు మాత్రమే సుపరిపాలన సాధ్యం. పైస్థాయిలో అవినీతి తాండవమాడుతున్నప్పుడు ఇటువంటి ఆక్రమ అనుమతులు, అవినీతి కార్యకలపాలు సర్వసాధారణమవుతాయి. విచిత్రమేమంటే ఈ నీతి, అవినీతి మధ్య జరిగే ఈ పోరాటంలో, సమిధలుగా మిగిలేదిమాత్రమే సామాన్యులు, బడుగువర్గాలే!

గుబులు పుట్టిస్తున్న చర్యలు

నిజం చెప్పాలంటే హైడ్రా చేపడుతున్న కఠిన చర్యలు ఇటు అధికార, విపక్ష నేతల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఇక హియయత్‌సాగర్‌, ఉస్మాన్‌ సాగర్‌ ప్రాంతాల్లో నిర్మించిన అక్రమ నిర్మాణాలు పేరుమోసిన వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకుల సంబంధీకులవి కావడం గమనా ర్హం. గత శనివారం మాదాపూర్‌లోని హైద్రాబాద్‌ సెంట్రల్‌ బిజినెస్‌ సెంటర్‌ (సీబీసీ)లోని అక్కినేని నాగార్జునకు చెందిన కన్వెన్షన్‌ సెంటర్‌ ను హైడ్రా సిబ్బంది కూల్చివేయడం ద్వారా ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదన్న గట్టి సంకేతాన్ని ప్రభుత్వం పంపినట్టయింది. చెరువు ను ఆక్రమించి ఈ నిర్మాణాన్ని చేపట్టారన్న ఆరోపణలున్నప్పటికీ, 2012నుంచి ప్రభుత్వం దీన్ని కూల్చివేయడానికి వెనుకాడిరది. స్థానికులుకూడా ఇది అక్రమ నిర్మాణమని చేస్తూ వస్తున్న ఆరోపణలు నిజం కావడంతో ఎట్టకేలకు ప్రభుత్వం దీన్ని కూల్చివేసింది. ఆగస్టు 26 వర కు ప్రభుత్వం 18 ప్రాంతాల్లో ఆక్రమణలను తొలగించడం ద్వారా 48 ఎకరాల భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంది. అక్కినేని నాగార్జున,మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు సోదరుడు, కావేరీ సీడ్స్‌ యజమాని భాస్కర్‌రావులకు చెందిన భూములు ఇందులో ఉన్నాయి. ఈ భూములు మాదాపూర్‌, లోటస్‌పాండ్‌, బంజారా హిల్స్‌, జూబిలీ హిల్స్‌ ప్రాంతాల్లో విస్తరించి వుండటం గమనార్హం. 

భగవద్గీత బోధనలకు అనుగుణంగా తానీ నిర్ణయం తీసుకున్నానని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చెబుతుండగా, కేవలం రాజకీయాలకోసమే రేవంత్‌ ఈవిధంగా వ్యవహరిస్తున్నారని బీఆర్‌ఎస్‌ ఆరోపిస్తోంది. ఇక బీజేపీ అయితే, ముఖ్యమంత్రి ఇన్ని కబుర్లు చెబుతున్నారు సరే, మజ్లిస్‌ పార్టీ నేతలైన ఒవైసీ సోదరులు సల్కమ్‌ చెరువును ఆక్రమించి నిర్మించిన ఫాతిమా ఒవైసీ కళాశాల భవనాలను కూల్చివేయాలని డి మాండ్‌ చేస్తోంది. ఇక ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ మాత్రం అసలు హైడ్రాకు చట్టబద్ధత ఎక్కడిదంటూ ప్రశ్నిస్తున్నారు. సీసీఎంబీ, జీహెచ్‌ ఎంసీలతో సహా పలు ప్రభుత్వ భవనాలను చెరువులను ఆక్రమించి కట్టినవే. నెక్లెస్‌ రోడ్డును ప్రభుత్వం తొలగిస్తుందా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక ఆయన సోదరుడు అక్బరుద్దీన్‌ ఒవైసీ ‘‘ఫాతిమా ఒవైసీ కాలేజీ 40వేల మంది విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తోం ది. నన్ను కాల్చేయండి కానీ నా కళాశాలను ముట్టుకోవద్దు’’ అంటున్నారు. కేవలం తాను చేస్తున్న మంచి పనిని చూసి ఓర్వలేక కొందరు ఇటువంటి పనులు చేస్తున్నారు. దయచేసి ఈ మంచిపనిని అడ్డుకోవద్దనేది ఆయన చేస్తున్న వాదన. 

సాధారణ ప్రజల మద్దతు

హైడ్రా కార్యక్రమాలకు స్థానికులనుంచి మద్దతు లభిస్తోంది. గత ఆదివారం గండిపేట్‌ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ‘‘మద్దతు ర్యాలీ’’ ని ర్వహించారు. సమీప కాలనీలకు చెందిన విద్యార్థులు, గేటెడ్‌ కమ్యూనిటీకి చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ ర్యాలీలో పాల్గనడం విశే షం. వీరంతా హైడ్రా చేపడుతున్న చర్యలకు మద్దతుగా ప్లకార్డులు ధరించి ఈ ర్యాలీలో పాల్గనడం విశేషం. ఇదేరోజున ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, హరేకృష్ణ హెరిటేజ్‌ హెరిటేజ్‌ టవర్‌ను ప్రారంభిస్తూ భగవద్గీతలో శ్రీకృష్ణుని బోధనల స్ఫూర్తే తనను ఈవిధమైన చర్యలు తీసు కోవడానికి ముందుకు నడిపిస్తున్నదన్నారు. వందల ఏళ్ల క్రితం నిజాం పాలకులు హైదరాబాద్‌ను ‘‘సరస్సుల నగరం’’గా తీర్చిదిద్దిన సంగతిని ఆయన గుర్తుచేశారు. నిజానికి ఈ చెరువులు సాధారణ ప్రజల దాహార్తిని తీర్చడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. కొందరు పెద్దలు, పలుకుబడి కలిగిన వ్యక్తులు ఈ చెరువు ప్రాంతాలను ఆక్రమించుకొని ఫామ్‌ హౌజ్‌లను నిర్మించడమే కాకుండా, వ్యర్థాలను తిరిగి ఈ చె రువుల్లోకే వదిలేస్తున్నారు. ముఖ్యంగా గండిపేట్‌, హిమయత్‌సాగర్‌ జలాల్లోకి ఈ వ్యర్థాలను వదలడంవల్ల నీరు మురికిమయంగా మారుతోంది. పాలకులుగా మనం ఇటువంటి చర్యలను ఉపేక్షించకూడదు. ఈ అక్రమ కట్టడాలపై జరిపే పోరాటంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని రేవంత్‌ కుండబద్దలు కొట్టడం, ఆయన దృఢవైఖరిని స్ఫష్టం చేస్తోంది. భావి తరాలకు మంచి చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. భగవద్గీతలో, అర్జునుడికి శ్రీకృష్ణుడు చేసిన జ్ఞానబోధ స్ఫూర్తితోనే ఎంతటి వారినైనా వదిలేది లేకుండా అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నామని ఆయన చెప్పారు. అయితే ఎంతోమంది సినీ, రాజకీయ, వ్యాపార వర్గాలకు చెందిన పలుకుబడి వర్గాలను ఎదుర్కొనడం ముఖ్యమంత్రికి పెను సవాలుగానే పరిణమించనుంది. ఎందుకంటే స్వపక్ష, విపక్ష నేతలతో పాటు ధనికవర్గం వ్యతిరేతకతను ఆయన ఎదుర్కొనక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. మరి ఎంతవరకు ఆయన కృతకృత్యత సాధిస్తారనేది వేచి చూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *