భానుడి భగభగ…జనం విలవిల
రోజురోజుకు భానుడి ప్రతాపం పెరుగుతోంది…భానుడి భగభగకు జనం విలవిలలాడుతున్నారు. వడదెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. రెండురోజుల వ్యవధిలో సుమారుగా 15మంది మృతిచెందారు. ఇదేవిధంగా భానుడు ప్రతాపం చూపితే ప్రజలు బయటకు రాకుండా ఇళ్లకే పరిమితమయ్యే పరిస్థితి నెలకొన్నది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతూ 45డిగ్రీలు దాటి 50డిగ్రీల ఉష్ణోగ్రతల వరకు వెళ్లొచ్చని, ప్రస్తుతం ఉన్న ఎండ తీవ్రతను బట్టి అంచనా వేయవచ్చు. ఈ ఉష్ణోగ్రతలకు ప్రజలు ఇంట్లో నుండి బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. అసలు మధ్యాహ్నం వేళల్లోనైతే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్న పరిస్థితి. రోజువారి పనుల్లో భాగంగా ప్రజలు తమ పనులను ఉదయం 11గంటలలోపే పూర్తి చేసుకుంటున్నారు. తిరిగి అత్యావసర పనుల నిమిత్తం సాయంత్రం 7 తరువాత మాత్రమే బయటకు వస్తున్న పరిస్థితి జిల్లాలో నెలకొంది.
జాగ్రత్తలు తీసుకోవాలి
పనికి వెళ్లే వారు ఉదయం, సాయంకాలం వేళల్లో తమ పనులను చూసుకోవాలని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. ఎండలో బయటకు వెళ్లేవారు తెల్లని కాటన్ వస్త్రాలను తలపాగాగా చేసుకుని వెంట తాగేందుకు నీటిని తీసుకువెళ్లాలని తెలిపారు. అదేవిధంగా ఒదులుగా ఉన్న కాటన్ వస్త్రాలను ధరించాలని, తలకు తప్పనిసరిగా చేతిరుమాలు చుట్టుకోవాలని, మధ్యాహ్నం వేళల్లో రోడ్లపై రాకుండానే మంచిదని హెచ్చరిస్తున్నారు.

 
         
         
        