
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల నేటి ధాత్రి
వీధి కుక్కల కారణంగా వ్యాప్తి చెందే రేబిస్ వ్యాధి పట్ల ప్రజలందరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం అంతర్జాతీయ రాబిస్ వ్యాధి దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రాథమిక పశువైద్య కేంద్రంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి శంకర్ తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రేబిస్ వ్యాధి పట్ల ప్రజలందరూ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. పెంపుడు జంతువులకు సమయానుసారంగా తప్పనిసరిగా రేబిస్ వ్యాక్సినేషన్ చేయించాలని, కుక్క కరిచినప్పుడు వెంటనే రేబిస్ వ్యాక్సినేషన్ తప్పనిసరిగా తీసుకోవాలని, ఆలస్యం చేస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. యానిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆదేశాల మేరకు మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల పరిధిలో రోజుకు 40 నుండి 50 వీధి కుక్కల వరకు సర్జరీ చేయడం జరుగుతుందని తెలిపారు. తద్వారా పునరుత్పత్తిని నియంత్రించవచ్చని, వీధి కుక్కల విషయంలో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలలో గల వీధి కుక్కల సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేసినట్లయితే తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో పెంపుడు జంతువులకు ఉ చిత రేబిస్ వ్యాధి నివారణ టీకాలను వేయించడం జరిగిందని, పెంపుడు జంతువుల యజమానులు వారి కుక్కలు, పిల్లుల వివరాలు మున్సిపాలిటీ / గ్రామపంచాయతీ కార్యాలయంలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని, ప్రతి సంవత్సరం సకాలంలో వ్యాధి నివారణ టీకాలు వేసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా పశు వైద్యాధికారి రేబిస్ వ్యాధి దినోత్సవం ప్రాముఖ్యత, వ్యాధి నివారణ మార్గాలను వివరించారు
ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, మంచిర్యాల పశు వైద్యాధికారి డా.శంకర లింగం, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు, పెంపుడు జంతువుల యజమానులు, జంతు ప్రేమికులు తదితరులు పాల్గొన్నారు.