బానిసత్వం వద్దు.. బీసీల కులాల ఐక్యత ముద్దు.
“కుట్రలతో.. బీసీ కులాలు బలైపోతున్నాం.”
“బీసీ కులాల నాయకులారా.. ఇక మేల్కొనండి”
“బీసీలకు అన్యాయం జరిగితే.. ఊరుకునేది లేదు”
“బాలానగర్ లో.. బీసీ ఐక్యవేదిక ఏర్పాటు”
బాలానగర్ /నేటి ధాత్రి.
బీసీల హక్కుల సాధన, సామాజిక సాధికారత లక్ష్యంగా మండలంలో శుక్రవారం ‘బీసీ ఐక్యవేదిక’ కొలువుదీరింది. శుక్రవారం బాలానగర్ మండలంలోని ఓ ఫంక్షన్ హాల్ లో.. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన బీసీ నాయకులు రాజకీయ విభేదాలను పక్కన పెట్టి సామాజిక ప్రయోజనాల కోసం ఏకమయ్యారు. బీసీ కులాల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో సవాళ్లు, రాజకీయంగా దక్కాల్సిన ప్రాధాన్యతపై ఈ వేదిక పోరాడుతుందన్నారు. బీసీల ఐక్యతతోనే సామాజిక అభివృద్ధి సాధ్యమని వారు స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో మండల స్థాయిలో బీసీల సమస్యలపై నిరంతర చర్చలు జరపాలని, అవసరమైతే ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పలువురు నేతలు.. “రాజకీయాలు ఎన్నికల వరకేనని, బీసీల హక్కుల విషయంలో మనమంతా ఒక్కటే” అని స్పష్టం చేశారు. మండలంలోని ప్రతి బీసీ బిడ్డకు న్యాయం జరిగేలా చూడటమే ఈ ఐక్యవేదిక ప్రధాన విధి అని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బాలానగర్ మండలంలోని సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, మాజీ సర్పంచులు, మాజీ ఉపసర్పంచులు మాజీ ఎంపీటీసీలు, మాజీ వార్డు సభ్యులు పాల్గొన్నారు.
