నేడే సద్దుల బతుకమ్మ
మందమర్రి, నేటిధాత్రి:-
ప్రకృతిలో లభించే తీరొక్క పూలను వరుసలుగా పేర్చి,ప్రకృతినే దేవతగా భావించి, పూజించే పండుగ బతుకమ్మ పండుగ. ప్రపంచంలో మరెక్కడాలేని రీతిలో తెలంగాణకే ప్రత్యేకమైన రంగురంగుల పూల పండుగ బతుకమ్మ. బతుకమ్మ అంటే బతుకు దెరువును మెరుగు పరిచే అమ్మ అని అర్థం. ప్రకృతి నుంచి సేకరించిన పూలను తిరిగి ప్రకృతికే సమర్పించడం బతుకమ్మ పండుగ విశిష్టత. విభిన్నమైన పూలతో బతుకమ్మను చేసి, పూజించి, తెలంగాణ ఆడపడుచులు ఆనందోత్సాహాలతో,సంప్రదాయంగా, వేడుకగా జరుపుకునే పూలపండుగ బతుకమ్మ. తొమ్మిది రోజుల పాటు జాతరలా సాగే బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజల బతుకు తెరువును ఆవిష్కరిస్తుంది. ఆట పాటలతో సేద తీరుస్తూ, జీవన సంబరాన్ని ఆవిష్కరిస్తుంది. రాష్ట్రంలోని ఆడపడుచులు బతుకమ్మ పండుగను మహాలయ అమావాస్య నాడు ఎంగిలి పూల బతుకమ్మతో మొదలు పెట్టి, తొమ్మిది రోజులు వివిధ పేర్లతో, నైవేద్యాలతో బతుకమ్మకు కొలుస్తారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు.
ఎక్కువగా ప్రజలలో ప్రాచుర్యంలో ఉన్న కథానుసారం……
పూర్వం భట్టునరసింహ అనే రాజు కవిచోళ దేశాన్ని పాలించేవాడు.ఆయన చాలా ధర్మాత్ముడు, అతని భార్య సత్యవతి. ఒక యుధ్ధంలో రాజు తన బంధుమిత్రులను కోల్పోయి, తన భార్య సత్యవతితో అడవులకు వెళ్లిపోయాడు. అనంతరం ఆయన మహాలక్ష్మీదేవి గురించి ఘోర తపస్సు చేయగా, మహాలక్ష్మీదేవి కరుణించి, సాక్షాత్కరించి, ఏదైనా వరం కోరుకోమనగా, సంతానం లేక బాధపడుతున్న తమకు నీవే మా కుమార్తె గా జన్మించాలని వేడుకున్నాడు. కొంత కాలానికి సత్యవతి గర్భాన శ్రీమహాలక్ష్మీదేవి జన్మించిందని, ఆ బాలికను చూచి మునులు, ఋషులు ఎంతో సంతోషించి, ఆయురారోగ్యాలతో బాగా బతుకమ్మ అని దీవించారని చెప్పుకుంటారు. ఆనాటి నుండి ఆమెను బతుకమ్మ అని పిలవసాగారని, బతుకమ్మ జన్మించిన కొంత కాలానికే రాజు తిరిగి తన రాజ్యాన్ని సంపాదించి, రాజ్యమేలాడని, ఆ రాజ్య ప్రజలు సుఖశాంతులతో ఎంతో ఆనందంగా జీవించసాగారని, బతుకమ్మ పెరిగి పెద్దదై, యుక్త వయస్సు వచ్చాకా, శ్రీమహావిష్ణువే చక్రాంకుడు అనే రాజు వచ్చి, ఆమెను వివాహమాడాడని, ఆ దంపతులు ఎంతో కాలం సిరి సంపదలతో రాజ్య పరిపాలన చేశారని తెలంగాణ ప్రజలు కథగా చెప్పుకుంటుంటారు. తెలంగాణ ప్రజలు దసరా పండుగ సమయంలో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహిస్తారు. బతుకమ్మనే ఇక్కడి ప్రజలు బొడ్డమ్మగా, గౌరమ్మగా భావించి, పూజలు చేస్తారు. ఒక పళ్ళెంలో రంగు రంగు పూలతో గుండ్రంగా ఎత్తుగా బతుకమ్మ ను పేర్చి, పసుపు ముద్ద చేసి, ఆ ముద్దను గౌరమ్మగా భావించి, బతుకమ్మ పై పెట్టి, దేవుని ముందు ఉంచి, పూజలు చేసి, నైవేద్యాలు సమర్పించి, ఇరుగు పొరుగు స్త్రీలతో కలిసి వారు చేసిన బతుకమ్మలను ఒక్క చోటికి చేర్చి, అందరూ కలిసి లయబధ్ధమైన అడుగులు వేస్తూ, చప్పట్లు కొడుతూ బతుకమ్మల చుట్టూ లయ బద్దంగా పాడుతూ బతుకమ్మను ఆడతూ, అమ్మ వారిని కొలుస్తారు. తెలంగాణ సాంస్కృతిక జీవనా వైవిధ్యం ఇతర ప్రాంతాలకు భిన్నం. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా కేవలం తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే పరిమితమైన పండుగ బతుకమ్మ పండుగ. వర్షాకాలం ముగిసి, జల వనరులు సమృద్ధిగా నిండి,పూలు బాగా వికసించే కాలంలో బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. తంగేడు, గునుగు, కట్ల, గుమ్మడి, గన్నేరు, రుద్రాక్ష, బంతి, చేమంతి, బీర, కాకర వంటి పూలతో బతుకమ్మను అందంగా ముస్తాబు చేస్తారు. బతుకమ్మ పండుగ అన్ని రోజులు రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాలు పూలవనాలౌతాయి. బతుకమ్మ అంటే కేవలం ఆట మాత్రమే కాదు, పాట కూడా, పాట లేని పండుగను ఊహించలేం, బతుకమ్మ పాటలన్నీ తెలంగాణ బిడ్డల కష్టసుఖాలు కలబోతగా పేర్కొనవచ్చును. చరిత్ర, సంస్కృతుల మేలు కలయికగానూ బతుకమ్మ పండుగను పేర్కొంటారు. బతుకమ్మ పండుగ అంటేనే మహిళలకు ఒక సంబురం, చిన్ననాటి స్నేహితులంతా కలుస్తారన్న నమ్మకంతో ఆడపిల్లలు బతుకమ్మ పండుగకు తప్పకుండా తమ పుట్టింటికి వెళ్లడానికి ఆసక్తి చూపుతారు.
తొమ్మిది రోజులు వివిధ పేర్లతో బతుకమ్మ…
తొమ్మిది రోజులపాటు జరిగే బతుకమ్మ పండుగలో ఎనిమిది రోజులు బతుకమ్మకు వివిధ పేర్లతో, వివిధ రకాల నైవేద్యాలు సమర్పిస్తారు. మహాలయ అమావాస్య మొదటిరోజు బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మ గా కొలచి, బతుకమ్మకు నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యంగా పెడతారు. రెండవ రోజు బతుకమ్మను అటుకుల బతుకమ్మ గా కొలచి, సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు. మూడవ రోజు బతుకమ్మను ముద్దపప్పు బతుకమ్మ గా కొలచి, ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి నివేదిస్తారు. నాలుగో రోజు బతుకమ్మను నానే బియ్యం బతుకమ్మ గా కొలచి, నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఐదో రోజు బతుకమ్మను అట్ల బతుకమ్మ గా కొలుస్తు, అట్లు లేదా దోశలు నైవేద్యంగా సమర్పిస్తారు. ఆరవ రోజు అలిగిన బతుకమ్మ అని బతుకమ్మ సంబరాలు నిర్వహించరు. ఏడవ రోజు వేపకాయల బతుకమ్మగా కొలిచి, బియ్యం పిండిని బాగా వేయించి, వేపపండ్లుగా తయారుచేసి నైవేద్యంగా సమర్పిస్తారు. ఎనిమిదో రోజు బతుకమ్మ వెన్నముద్దల బతుకమ్మగా కొలచి, నువ్వులు, వెన్న లేదా నెయ్యి, బెల్లం కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు. తొమ్మిదో రోజు బతుకమ్మను సద్దుల బతుకమ్మగా కొలచి, పెరుగన్నం, చింతపండు పులిహోర, కొబ్బరన్నం, నువ్వులన్నం, బియ్యం, నువ్వులు, పల్లిలు, మక్కలు తదితర వాటితో సద్దులు తయారు చేసి ఐదురకాల నైవేద్యాలు అమ్మవారికి నివేదిస్తారు. తొమ్మిది రోజులపాటు బతుకమ్మ పూజించిన మహిళలు చివరి రోజైన సద్దుల బతుకమ్మ నాడు బతుకమ్మను చెరువులో నిమజ్జనం చేస్తారు. తీరొక్క పూలతో తయారు చేసిన బతుకమ్మపై ఉంచిన పసుపుతో తయారు చేసిన గౌరమ్మను మహిళలు తమ పుస్తెలకు అద్దుకుంటూ, ఇతర ముత్తైదువులతో పంచుకొని, తమ భర్తలకు ఆపదలు తొలగి, తమ మాంగళ్యం చల్లగా చూడలని అమ్మవారిని కోరుకుంటారు. అదేవిధంగా కొంతమంది రొట్టె, రవ్వ, బెల్లం లేదా చక్కెర తో కలిపి తయారు చేసిన మలీదను అందరికీ పంచితే శుభం జరుగుతుందని మలీదలు అందరికీ పంపిణీ చేస్తారు. ఎంగిలి పూల బతుకమ్మతో తెలంగాణ అంతటా బతుకమ్మ పండుగ మొదలవుతుంది. ప్రకృతితో మమేకమై ఆట పాటలతో, ఆనందోత్సాహాలతో బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. పండుగ నాటికే ప్రకృతి అంతా పూలవనంగా మారుతుంది. ప్రకృతిలో సేకరించిన పులను ప్రకృతికే సమర్పించడం అనే ఉద్దేశ్యంతో బతుకమ్మలను నీటిలో విడిచి పెడతారు. ఆదివారం సద్దుల బతుకమ్మ పండుగ.