బ్యాంకు ఖాతాల ద్వారా వేతనాలు చెల్లించాలి
నర్సంపేట మున్సిపాలిటీలో నూతనంగా పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు బ్యాంకు ఖాతాల ద్వారా వేతనాలు చెల్లించాలని టిఆర్‌ఎస్‌కెవి జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు కోరారు. బుధవారం నర్సంపేట పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లుకు కార్మికుల వేతనాల కోసం వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా యువరాజు మాట్లాడుతూ బ్యాంకు ఖాతాలో వేతనాలు వేస్తూ కార్మికులందరికీ ప్రావిడెంట్ ఫండ్, ఇఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని అన్నారు. వారాంతపు సెలవు ఆదివారం రోజున పూర్తిగా సెలవు ఇవ్వాలని కోరారు. అందుకు సానుకూలంగా స్పందించిన కమిషనర్ కొద్దిరోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యుడు మాదాసి నర్సింగరావు, కార్మికులు బొల్లెపెల్లి రాంబాబు, చింతనూరి శివకుమార్, గోనెల నరేందర్, పొనకంటి శ్రీకాంత్, దాసరి ప్రశాంత్, కొంపెల్లి సురేష్, జన్ను శోభన్, బొటికె మధు తదితరులు పాల్గొన్నారు.