
Congress Governance
కాంగ్రెసోళ్ళు ఉద్యోగాలు ఇస్తామని గద్దెనెక్కారు…
కాంగ్రెస్ కర్కశ పరిపాలనలో పథకాలకు ఎగనామం పెడుతున్నారు…
చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్..
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
10 ఏండ్ల బిఆర్ఎస్ పరిపాలనలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన కొనసాగించారని , ప్రస్తుత కాంగ్రెస్ పరిపాలన కర్కశ పరిపాలనగా కొనసాగుతోందని ,గడిచిన 20 నెలలుగా ఎలాంటి అభివృద్ధి పనులకు నియోజక వర్గం నోచుకోలేదని, ఏ ఒక్క హామీని నిలబెట్టుకోవడం లేదని చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. సోమవారం క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని బాల్క సుమన్ నివాసంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమీక్ష సమావేశంలో చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ రాజా రమేష్ తో కలిసి పాల్గొన్నారు.నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల, మున్సిపాలిటీల కార్యకర్తలు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడారు. పరిపాలన అప్పుడే మంచిగుండే మా పోరాటం మా గ్రామం నుండే అనే నినాదంతో నియోజకవర్గంలో విస్తృతస్థాయి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామని , అందులో భాగంగానే ఈ నెల 28 న చెన్నూర్, భీమారం, జైపూర్, రామకృష్ణాపూర్, మందమర్రి ఏరియాలలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

గడిచిన 20 నెలల కాలంలో కాంగ్రెస్ పరిపాలన అధ్వానంగా తయారయిందని, ఇక ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. నియోజకవర్గంలో నూతన ఫ్యాక్టరీలు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని ,యువతకు 45 వేల ఉద్యోగ అవకాశాలు సైతం కల్పించేందుకు కృషి చేస్తానని ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి గద్దెనెక్కారని ,పదవి వచ్చాక ఉద్యోగాల ఊసే లేదని, తన ఇంట్లో మాత్రం రెండు ఉద్యోగాలు వచ్చాయని విమర్శించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో బి ఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ముందుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు.చెన్నూర్ ప్రాంత కాంగ్రెస్ నాయకులు బాల్క సుమన్ సమక్షంలో పార్టీలో చేరారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గస్థాయి బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.