బాలాజీ టెక్నో స్కూల్ నిర్వాకం
నర్సంపేట లక్నేపల్లిలోని బాలాజీ టెక్నో స్కూల్‌లో వేసవి సెలవుల్లో కూడా క్లాసులు నిర్వహిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు బుధవారం పాఠశాలలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఆర్జేడీ, ఇంచార్జి డీఈవో టీ.రాజీవ్, ఎంఈఓ దేవా తదితరులు పాల్గొన్నారు. బాలాజీ టెక్నో స్కూల్ యాజమాన్యం అధికారులు తనిఖీలు నిర్వహించేందుకు వస్తున్న విషయాన్ని తెలుసుకుని విద్యార్థులను దాచేశారు. తరగతి గదుల్లో విద్యార్థుల పుస్తకాలు లభ్యం కాగా, అందులో కొద్దిరోజులుగా తరగతులు నిర్వహిస్తున్నట్లు ఉపాధ్యాయుల సంతకాలు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. అంతకు ముందురోజు తరగతుల నిర్వహణపై వచ్చిన సమాచారంతో సీఆర్పీ శ్రీనివాస్ అక్కడికి వెళ్లి ఫొటోలు తీసి అధికారులకు చెప్పాడు. ఇంతలోనే బాలాజీ టెక్నో విద్యాసంస్థల అధినేత డాక్టర్ ఏ.రాజేంద్రప్రసాద్‌రెడ్డి చేరుకొని అతని వద్ద గల సెల్‌ఫోన్ లాక్కొని నానా దుర్భాషలు ఆడుతూ బెదిరించి వెళ్లగొట్టాడు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి వారి ఆదేశానుసారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. విధినిర్వహణకు అడ్డుపడి ఆధారాలు కలిగిన సెల్‌ఫోన్ లాక్కొన్నాడంటూ శ్రీనివాస్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. నిబంధనలకు విరుద్ధంగా సెలవుల్లో పాఠశాల నిర్వహించడంతోపాటు సీఆర్పీ శ్రీనివాస్‌పై దౌర్జన్యానికి దిగిన సంఘటనపై ఆర్జేడీ రాజీవ్ జిల్లా కలెక్టర్‌కు నివేదించారు.