యాదగిరిగుట్ట లో ఘనంగా బాబా సాహెబ్ జయంతి వేడుకలు
#ఘనమైన నివాళులర్పించిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య
యాదగిరిగుట్ట నేటి ధాత్రి:
యాదగిరిగుట్ట పట్టణంలోని బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అంబేద్కర్ విగ్రహానికి పులామాల వేసి ఘనంగా నివాళులర్పించారు..ఆ తర్వాత రోడ్డు భద్రత లో భాగంగా అవగహన కల్పించడం కోసం పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భంగా బీర్ల అయిలయ్య మాట్లాడుతూ..బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నాను. భారత రాజ్యాంగ రూపకర్తగా, సామాజిక న్యాయానికి మార్గదర్శిగా, అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు డాక్టర్ అంబేద్కర్.చిన్ననాటి నుంచి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ, విద్యను ఆయుధంగా తీసుకుని ప్రపంచ స్థాయి విద్యను అభ్యసించి, భారతదేశానికి గొప్ప దిశానిర్దేశం చేశారు.
ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించేలా రాజ్యాంగాన్ని రూపొందించడం ఆయన గొప్ప కృషి.సమాజంలో ఉన్న అసమానతలను తొలగించేందుకు, కులవ్యవస్థకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటం ఎన్నటికీ మరువలేనిది.
“విద్య పొందండి,సంఘటితమవండి, పోరాడండి” అనే ఆయన సందేశం నేటి యువతకు మార్గదర్శకం.
ప్రభుత్వం కూడా అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పేదలు, దళితులు, బీసీల అభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది. ప్రతి వర్గం అభివృద్ధి చెందేలా కృషి కొనసాగుతోంది.యువత అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని చదువులో ముందుండి, సమాజానికి ఉపయోగపడేలా ఎదగాలి. సమానత్వం, సోదరభావం, న్యాయం అనే విలువలను మన జీవితంలో ఆచరించాలి.చివరగా, మనమందరం కలిసి అంబేద్కర్ ఆశయాలను పాటిస్తూ సమానత్వ సమాజాన్ని నిర్మించేందుకు కట్టుబడి ఉండాలి అని తెలిపారు. ఈ క్రమంలో యాదగిరిగుట్ట పట్టణ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ భాస్కర్, ట్రాఫిక్ పోలీస్ సిఐలు, ఎస్ఐలు పోలీస్ అధికారులు, మున్సిపల్ చైర్మన్ వాణి భరత్ గౌడ్, బోడ రాధ సురేష్ నేత, కాంగ్రెస్ నాయకులు, పలు సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
