“Literary Workshop for Students”
విద్యార్థినీ విద్యార్థులకు సాహిత్యo పై అవగాహన కార్యక్రమం
రచయిత పెద్దింటి అశోక్ కుమార్
కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు
సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని గీతానగర్ పాఠశాలలో సాహిత్యాభిరుచి పెంపొందించేందుకు తెలంగాణ సారస్వతి పరిషత్ , హైదరాబాద్ ఆధ్వర్యంలో శాంత ట్రస్ట్ సౌజన్యం తో విద్యార్థినీ విద్యార్థుల కోసం కథల రచనపై ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విషయనిపుణులు గా ప్రముఖ కథా రచయిత పెద్దింటి అశోక్ కుమార్ హాజరై విద్యార్థులకు మార్గదర్శనం చేశారు.ఈ సందర్భంగా ఆయన కథల రచనలో ఉండాల్సిన ముఖ్యాంశాలను సులభంగా అర్థమయ్యే విధంగా వివరించారు. కథ అంటే కేవలం ఊహ కాదు, మన చుట్టూ జరుగుతున్న సంఘటనలను, మనసులను తాకే నిజాలను, సమాజంలో ఉన్న సమస్యలను గమనించి వాటిని భావోద్వేగంతో వ్యక్తపరచడం అని చెప్పారు. మంచి కథ రాయాలంటే పరిశీలనా శక్తి, ఊహాశక్తి, భావప్రకటన నైపుణ్యం అవసరమని సూచించారు.
అలాగే విద్యార్థులకు కథల నిర్మాణం, పాత్రల రూపకల్పన, ప్రారంభం–మధ్య–ముగింపు వంటి అంశాలపై అవగాహన కల్పించారు. చిన్న చిన్న అనుభవాలు, పాఠశాల జీవితం, కుటుంబ పరిస్థితులు, గ్రామీణ జీవన శైలులు వంటి అంశాలపై కూడా మంచి కథలు రాయవచ్చని ప్రోత్సహించారు.70 మంది విద్యార్థులు ఆసక్తిగా పాల్గొని తమ సందేహాలను అడిగి నివృత్తి చేసుకున్నారు. ఈ వర్క్‌షాప్ ద్వారా వారిలో రచనా పట్ల ఆసక్తి పెరిగిందని ఈ కార్యక్రమం కు సమన్వయకర్త గా ఉపాధ్యాయులు ఎలగొండ రవి వ్యవహారించారు తెలిపారు. పిల్లలు రాసిన కథలు పుస్తక రూపం లో త్వరలో కథ సంపుటి తీసుకొస్తామని చెప్పారు
బాలసాహితి వేత్త గర్రిపల్లి అశోక్ కుమార్ సారస్వత పరిషత్ హైదరాబాద్ నుండి ప్రతినిధిగా పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా పిల్లల డాక్టర్ సురేంద్రబాబు పాల్గొన్నారు. విద్యార్థులకు ప్రశంశా పత్రాలు అందజేశారు. రచయితకు,
ఉపాధ్యాయులకు సన్మానం చేసారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు లొకిని శారదా మాట్లాడుతు సారస్వతి పరిషత్ సభ్యులకు మరియు రచయితకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ తరహా కార్యక్రమాలు విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు ఎంతో ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు. తెలుగు ఉపాధ్యాయులు సతీష్ బాబు, జయంతి ప్రభాకర్, మంజుల పాల్గొన్నారు.
