జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో శనివారం రోజున ప్రత్యేక అధికారి సురేష్ తో పాటు ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్ వేసవి కాల పరిణామాలపై,తీసుకోవలసిన జాగ్రత్తలపై జైపూర్ మండల పరిధిలోని గ్రామపంచాయతీ కార్యదర్శులతో అవగాహన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి సురేష్ గ్రామపంచాయతీ కార్యదర్శులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రస్తుత ఎండ తీవ్రతని దృష్టిలో పెట్టుకొని గ్రామలలోని ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వారికి అవగాహన కల్పించాలని, రైతులకు,కూలీలకు ఏ ఏ సమయాలలో పనులు పూర్తి చేసుకొని ఇంటికి చేరు కోవాలో, ఏ సమయాల్లో ఇంటి నుండి బయటకు రాకూడదో అర్థం అయ్యేవిధంగా తెలియజేయాలని, పనులకు వెళ్లే వారికి ,ప్రయాణాలకు వెళ్లే వారికి, చిన్న పిల్లలను కలిగి ఉన్నవారికి, వడగల్పుల నుండి తమను ఎలా రక్షించుకోవాలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలో సూచించాలని తెలియజేశారు. అలాగే ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ ఈ వేసవి కాలంలో గ్రామాలలో మంచినీటి సౌకర్యానికి ఎలాంటి అంతరాయం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారి సహాయం తీసుకొని మంచినీటి బోర్లు, మోటర్లు పనిచేయని స్థితిలో ఉంటే వెంటనే మరమ్మతులు చేపించి వాటిని బాగు చేసి ఉపయోగించాలని,వాటర్ ట్యాంకులు, పైపులైన్లు ఇంకా ఇతర సమస్యలు ఏమైనా ఉన్న సత్వరమే పరిష్కరించాలని, ఉపాధి హామీ పనులు జరిగే చోట కూలీలకు అన్ని సదుపాయాలు సక్రమంగా ఉండేలా చూసుకోవాలని, వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి గ్రామసభలు నిర్వహించి ప్రజలందరికీ తెలిసేలా అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి సురేష్, ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్, తహసిల్దార్ వనజ రెడ్డి మండల స్థాయి అధికారులు మరియు గ్రామపంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.