అవినీతికి… సూత్రధారి…?
వరంగల్ ఇంటర్మీడియట్ అర్బన్ కార్యాలయంలో అవినీతి భాగోతాలు రోజురోజుకు వెలుగులోకి వస్తున్నాయి. ‘నేటిధాత్రి’లో గత నాలుగురోజులుగా ఇంటర్మీడియట్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి లీలలపై వరుసగా కథనాలను ప్రచురించిన విషయం పాఠకులకు తెలిసిందే. కార్యాలయంలో తీగ లాగితే ఢొంక కదిలిన చందంగా మరిన్ని విషయాలు బయటికొస్తున్నాయి. ఇంటర్మీడియట్ పరీక్షల అనంతరం మార్చి-ఏప్రిల్ నెలలో నిర్వహించిన పేపర్ వాల్యుయేషన్ క్యాంపులో పెద్ద మొత్తంలో అవినీతి జరిగినట్లుగా తెలుస్తున్నది. ఇదంతా కార్యాలయంలో ఓ సీనియర్ ఉద్యోగితో పాటు మరికొంత మంది కలిసి చేసినట్లుగా విశ్వసనీయ సమాచారం.
అపరిచితుల అకౌంట్లలో డబ్బులు జమ
పేపర్ వాల్యుయేషన్ క్యాంపులో పేపర్ కట్టల మూటలు మోయడానికి, వాటిని అందించడానికి రోజువారి కూలీలను నియమించుకుంటారు. వీరు పనిచేసినట్లుగా సంతకాలు చేయడం కోసం ఓ ప్రత్యేక రిజిస్టర్‌ను ఏర్పాటు చేస్తారు. అందులో ప్రతిరోజు సంతకాలు పెట్టాల్సి వుంటుంది. వీటి ప్రకారమే ఎన్ని రోజులు పనిచేశారో లెక్కకట్టి డబ్బులు చెల్లిస్తారు. దీంతో ఎవరెన్ని రోజులు పని చేశారు, ఎవరికెంత చెల్లించాలనేది తెలిసిపోతుంది. కాని ఇందుకు భిన్నంగా క్యాంపు ఆఫీస్‌లో పనిచేసిన వారికంటే ఎక్కువమంది పనిచేసినట్లుగా (ఉదా: 206మంది పనిచేస్తే 296మంది చేశారని చూపడం) తప్పుడు లెక్కలు రాసి డబ్బులు నొక్కేశారని క్యాంపు కార్యాలయంలో ప్రచారం జరుగుతున్నది.
లెక్కకు మించి బిల్లులు పెట్టిన వైనం
పేపర్ వాల్యుయేషన్ చేసిన లెక్చరర్స్ విషయంలో కూడా పేపర్ వాల్యుయేషన్ చేసిన వారికటే ఎక్కువమంది చేసినట్లు బిల్లులు తయారుచేశారనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఒక్కో టేబుల్‌లో ఉన్న వారికంటే ఎక్కువమందిని చూపెట్టారని బలంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏకంగా క్యాంపు ఆఫీస్ అధికారుల సంతకాలు లేకుండానే ఈ బిల్లులు తయారుచేశారని పలువురు గుసగుసలాడుతున్నారు.
కార్యాలయంలో సీసీ కెమెరాల నిలిపివేత
ఇదిలా ఉండగా డిఐఈవో కార్యాలయంలో బిల్లులు తయారుచేసే సమయంలో సీసీ కెమెరాలను కార్యాలయంలోని కొంతమంది నిలిపివేసినట్లు తెలుస్తున్నది. సీసీ కెమరాలను గతనెల ఏప్రిల్ నుండి నిలిపివేయడంతో అవినీతి జరిగిందన్న ఆరోపణలకు మరింత బలం చేకూరుతున్నది.
(సూత్రధారి ఎవరు, పాత్రదారులు ఎవరు…వివరాలు త్వరలో)