అర్ధరాత్రి వేళ.. ఆకతాయిల హల్చల్!
రాత్రి వేళల్లో పోలీస్ నిఘా పెంచాలని ప్రజల డిమాండ్
మంచిర్యాల,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా నస్పూర్ మండల పరిధిలోని పలు కాలనీల్లో అర్ధరాత్రి వేళల్లో ఆకతాయిల హంగామా మితిమీరిపోతోంది.యువకులు గుంపులుగా చేరుతూ మద్యం సేవించడం,ఒకే బైక్ పై మితిమీరిన వేగంతో ముగ్గురేసి చొప్పున,కేకలు వేస్తూ తిరగడం నిత్యకృత్యంగా మారింది.గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగం పెరుగుతుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.అర్ధరాత్రి దాటినా కొన్ని దుకాణాలు తెరిచి ఉంచడం ఆకతాయిల ఆగడాలకు మరింత ఆజ్యం పోస్తోంది.ఇప్పటికైనా పోలీసులు స్పందించి రాత్రి వేళల్లో పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని, కాలనీల్లో నిఘా పెంచి శాంతిభద్రతలను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.
