ఆశాకార్యకర్తలకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం
జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణపై వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆశాకార్యకర్తలకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం జిల్లా ఉపవైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయంలో నిర్వహించారు. ఈ శిక్షణకు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధికారి డాక్టర్ పి.చంద్రశేఖర్ మాట్లాడుతూ దోమల వల్ల మలేరియా, బోద వ్యాధి, డెంగ్యూ, చికెన్‌గున్యా, మెదడువాపు వ్యాధులు వస్తాయని, వీటి నివారణలో ఆశాకార్యకర్తల పాత్ర చాలా ముఖ్యమైనదని అన్నారు. 2030 సంవత్సరానికి మలేరియాను పూర్తిగా నివారించాలనేది లక్ష్యం అన్నారు. మలేరియా వ్యాధి వ్యాప్తి జూన్ నుండి నవంబర్‌లో ఎక్కువగా ఉంటుందని, అందరం అప్రమత్తంగా ఉండాలన్నారు. మలేరియా వ్యాధి ఒకరి నుండి మరొకరికి ఈ వ్యాధి కారకం ద్వారా వ్యాప్తి చెందుతుందని తెలిపారు. వర్షాకాలంలో దోమలు పెరుగు ప్రదేశాలు ఎక్కువగా వ్యాధి కూడా అదే సమయంలో ఎక్కువ ప్రబలుతుందన్నారు. కొన్ని పరిస్థితుల్లో ఈ వ్యాధి ప్రాణాంతక స్థాయికి చేరుతుందని తెలిపారు. బోధ వ్యాధి, డెంగ్యూ, చికెన్ గున్యా, మెదడు వాపు వ్యాధుల లక్షణాలు, చికిత్స, నివారణ చర్యల గురించి వివరించారు. ముఖ్యంగా ఫ్రైడే డ్రైడేగా పాటించాలని, పరిసరాలలో నీరు నిలవకుండా చూడాలని, ప్రతి ఆశా కార్యకర్త గృహ సందర్శనకు వెళ్లినప్పుడు ఇంటి పరిసరాలలో పరిశుభ్రత, డ్రైడే ప్రాముఖ్యత గురించి తెలిపారు. జిల్లా ఉపవైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.శ్రీ|రాములు మాట్లాడుతూ కీటక జనిత వ్యాధుల లక్షణాలు, నివారణ చర్యల గురించి వివరించారు. శిక్షణ అనంతరం ఆశా కార్యకర్తలకు రక్తపూత పరీక్షలు ఎలా చేయాలనే దానిపై ల్యాబ్ టెక్నిషియన్ శిక్షణను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రొగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ సుమన్ మోహన్‌రావు, డాక్టర్ మహేష్, డాక్టర్ అనిల్‌కుమార్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సంపత్, సిహెచ్‌ఓ శ్రీనివాస్‌రెడ్డి, హెచ్‌ఇఓలు లింగం, ఎల్లంకి శ్రీనివాస్, హెచ్‌ఇలు వెంకటేశం, సంపత్, డిపిఓ ఉమాదేవి, డిపిహెచ్‌ఎన్ దయామని, హెచ్‌ఎస్ సుజాత, భరత్ పాల్గొన్నారు.
…………………………………..