ఆరోపణలు నిరూపించకుంటే ఉద్యోగం వదులుకుంటావా…?
కాజీపేట సీఐకి కార్పోరేటర్ బహిరంగ లేఖ
‘ఖాకి ఎంత కఠినం’ శీర్షికన ‘నేటిధాత్రి’ దినపత్రికలో ప్రచురితమైన కథనంపై దుమారం రేగుతోంది. కథనం ప్రచురితం కాగానే కాజీపేట సీఐ అజయ్‌కుమార్ పత్రికకు సంబంధించిన వాట్సాప్ గ్రూప్‌లో ఓ మెసేజ్ పోస్టు చేశారు. ఈ మెసేజ్‌లో పత్రికపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూనే కబ్జా కార్పోరేటర్‌కు సహకరిస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ విషయమై 51వ డివిజన్ కార్పొరేటర్ మిడిదొడ్డి స్వప్న స్పందించారు. సీఐ చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకించారు. చేసిన ఆరోపణలు నిరూపించాలంటూ గురువాంర ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు. భూమి విషయంలో అన్ని అర్హతలు ఉన్న బాధితుడు తనకు వినతిపత్రం ఇచ్చాడని భూమికి సంబంధించిన అన్ని పత్రాలను ‘నేటిధాత్రి’ గ్రూప్‌లో పోస్టు చేశారు. తనపై సీఐ చేసిన ఆరోపణలు నిరూపిస్తే కార్పొరేటర్ పదవికి రాజీనామా చేస్తానని, నిరూపించకుంటే సీఐ తన ఉద్యోగానికి రాజీనామా చేస్తాడా…? అని సవాల్ విసిరారు. కబ్జాదారులకు ఎవరు సహకరిస్తున్నారో అందరికీ తెలుసునని, బాధితుల భూమి సర్వే నెంబర్ 641, సీఐ సహకరిస్తున్న వారి సర్వే నెంబర్ 730, 731లకు కిలోమీటర్ దూరం ఉందని అన్నారు. సీఐ కావాలనే ఈ విషయంలో అనవసర రాద్ధాంతం చేస్తున్నారని సివిల్ విషయంలో తలదూర్చి బాధితుడిని బెదిరింపులకు గురిచేస్తున్నాడని కార్పొరేటర్ సీఐ, బాధితుడిని బెదిరిస్తున్న ఆడియోను విడుదల చేశారు.
చట్టప్రకారం నడుచుకుంటాం
కాజీపేట సీఐ అజయ్‌కుమార్
తాము చట్టప్రకారమే నడుచుకుంటూ ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని కాజీపేట సీఐ అజయ్‌కుమార్ స్పష్టం చేశారు. కార్పొరేటర్ స్వప్న బహిరంగ లేఖపై స్పందించిన ఆయన ఎవరి పక్షం వహించాల్సిన అవసరం తమకు లేదని, చట్టప్రకారం నడుచుకుంటూ న్యాయం పక్షమే తాముంటామని అన్నారు. భూమి ఎవరిదనేది కోర్టు తేల్చుతుందన్నారు.