మీ పిల్లల చేతికి బండి ఇస్తున్నారా? జైలుకు వెళ్తారు జాగ్రత్త.
మైనర్ డ్రైవింగ్‌పై కోదాడ పోలీసుల ఉక్కుపాదం
పట్టణ సీఐ శివశంకర్
కోదాడ, నేటి ధాత్రి:
మైనర్ల చేతుల్లో వాహనాలు పెడితే ప్రమాదాలు తప్పవని, అలాంటి వారిని ప్రోత్సహించే తల్లిదండ్రులు కూడా చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కోదాడ పట్టణ సీఐ శివశంకర్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.బుధవారం కోదాడ పట్టణంలోని ప్రధాన రహదారులపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించిన పోలీసులు మైనర్ డ్రైవింగ్‌కు పాల్పడుతున్న 10 మంది బాలురను గుర్తించి వారి తల్లిదండ్రులతో కలిసి పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.ఇటీవల మైనర్లు ద్విచక్ర వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వాహనం నడపడానికి సరైన వయస్సు, చట్టబద్ధమైన డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి అని స్పష్టం చేశారు. మైనర్లకు బైక్‌లు, స్కూటీలు ఇవ్వడం తల్లిదండ్రుల నిర్లక్ష్యానికి నిదర్శనమని, ప్రమాదం జరిగితే కుటుంబాలే తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు.ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని. వాహనం నడిపే సమయంలో డ్రైవింగ్ లైసెన్స్, సి-బుక్, ఇన్సూరెన్స్ పత్రాలు వెంట ఉంచుకోవాలని తెలిపారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, హెల్మెట్ వినియోగంతో రోడ్డు ప్రమాదాల్లో 90 శాతం వరకు ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశం ఉంటుందని వివరించారు.డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన సీఐ.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కుటుంబ సభ్యుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్సై బైరెడ్డి అంజిరెడ్డి, హెడ్ కానిస్టేబుళ్లు బాల్తు శ్రీనివాస్, నరహరి తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
