మోటార్ వాహనాల చట్టాన్ని ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాటించాలి. రోడ్డు ప్రమాదాలను నివారించడమే లక్ష్యం
-ఎస్ఐ బోరగాల అశోక్
రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా చేపట్టిన రోడ్డు భద్రత కార్యక్రమాన్ని మొగుళ్ళపల్లి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో గల గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మొగుళ్ళపల్లి ఎస్ఐ బోరగాల అశోక్, సర్పంచ్ చాట్ల విజయ-రవీందర్ దంపతులు, ఉప సర్పంచ్ ఎర్రబెల్లి హిమబిందు-కోటేశ్వర్ రావు దంపతులు, పంచాయతీ సెక్రెటరీ నరేష్ లు పాల్గొన్నారు. రోడ్డు భద్రతపై నిర్వహించిన అవగాహన సదస్సుకు హాజరైన ప్రజలు, యువకులనుద్దేశించి ఎస్ఐ బోరగాల అశోక్ మాట్లాడారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యతన్నారు. అతివేగం, మద్యం సేవించి వాహనాలను నడపడం వలన విలువైన ప్రాణాలను కోల్పోతున్నామన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. మైనర్ పిల్లలకు వాహనాలను అప్పగిస్తే తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ట్రాఫిక్ నియమాలు, మోటర్ వాహనాల చట్టాన్ని ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించినప్పుడే రోడ్డు ప్రమాద రహిత రాష్ట్రాన్ని నిర్మించగలమన్నారు. రోడ్డు భద్రతను ఒక ప్రజా ఉద్యమంగా మార్చాల్సిన అవసరం ఉందని, ప్రజల భద్రతే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
