SC Loan Applications Invited
ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి నేటిధాత్రి
తెలంగాణ షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి సంఘం ద్వారా 2025-26 ఎస్సీ యాక్షన్ ప్లాన్ కింద జిల్లాలోని అర్హులైన అభ్యర్ధుల నుండి వివిధ ఆర్ధిక సహాయ పథకాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంఘం చైర్మన్ ఒక ప్రకటనలో తెలిపారు. బ్యాంకు అనుసంధానంతో రవాణా రంగం కింద ఈవీ టూ వీలర్ ఈవీ త్రీ వీలర్ వాహనాలకు, అలాగే వ్యవసాయ పథకాల కింద సోలార్ యూనివర్సల్ పంప్ కంట్రోల్ యూనిట్లకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ పథకాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు వ్యవసాయేతర పథకాలకు 21 నుండి 50 ఏళ్ల వరకు, వ్యవసాయ ఆధారిత పథకాలకు 21 నుండి 60 ఏళ్ల లోపు ఉండాలి. వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1,50,000 పట్టణ ప్రాంతాల వారికి రూ.2,00,000 మించకూడదు. సోలార్ పంప్ సెట్ల కోసం కనీసం రెండు ఎకరాల భూమి కలిగి ఉండాలి. ఈవీ ద్విచక్ర వాహనాల కోసం జొమాటో, స్విగ్గీ, రాపిడో వంటి సంస్థల్లో పనిచేసే గిగ్ కార్మికులకు ప్రాధాన్యత ఉంటుందని, వారు సంబంధిత సర్టిఫికేట్లు సమర్పించాలని సూచించారు. అర్హులైన అభ్యర్థులు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మీసేవ ద్వారా పొందిన కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు, శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో మరియు దివ్యాంగులైతే సదరం సర్టిఫికేట్లతో ఈ నెల 17 నుండి 24 వరకు ఆన్లైన్ వెబ్సైట్ tsobmms.cgg.gov.in ద్వారా లేదా మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అన్ని మండలాలు మున్సిపాలిటీ పరిధిలోని ఎస్సీ అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
