కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా ,కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టాలి.
పలమనేరు(నేటి ధాత్రి) ఫిబ్రవరి 27:
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా ,కార్మిక వ్యతిరేక విధానాలను ప్రజలతోపాటు అన్ని కార్మిక సంఘాలు ఎండగట్టి వ్యతిరేకించాలని ఐఎఫ్టియు ఏపీ రాష్ట్ర అధ్యక్షులు పి. ప్రసాద్ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా గురు వారం పలమనేరు పట్టణములో అంబేద్కర్ సర్కిల్ నందు రెండు ఐ ఎఫ్ టి యు విప్లవ కార్మిక సంఘాలు రాష్ట్రస్థాయి విలీన సభకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించడానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైనారు.
ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలై స్కీం వర్కర్లు, అంగన్వాడి, మధ్యాహ్న భోజనం, ఆశా వర్కర్స్, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, కార్మికులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రపంచకరణ ప్రైవేటీకరణ పేరుతో దేశంలోని ప్రజలు, కార్మికుల కష్టార్జితాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఫాసిస్తూ రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పడానికి దేశంలోని అన్ని కార్మిక సంఘాలు ఐక్యం కావాల్సిన అవసరం ఉందన్నారు. అదేవిధంగా అనేక మంది కార్మికుల ప్రాణాలు పణంగా పెట్టి సాధించుకున్న కార్మిక హక్కులను హరిస్తూ, పనిగంటలను పెంచి కార్మికుల నడ్డి విరిచి కార్పొరేట్ శక్తులను కోటీశ్వరులు చేస్తున్నదని విమర్శించారు. ప్రపంచ బ్యాంకు షరతులకు తలోగ్గి కేంద్ర ప్రభుత్వం దేశ సంపదను తాకట్టు పెట్టి ,ప్రజల రక్తాన్ని రాబందుల్లాగా పీల్చి విదేశాల్లో దాచి పెట్టుకుంటున్నారని ఆరోపించారు. మార్చి 2 వ తేదీ రాజమండ్రి వేదికగా పుష్కరాల రేవు వద్ద చందన సత్రం నందు 2 ఐఎఫ్టియు సంఘాలు విలీన సభను నిర్వహిస్తున్నామని తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రజలు, కార్మికుల బలం కన్నా పాలకులు, కార్పొరేట్ శక్తులు బలం ఎక్కువ కావడంతో చట్టాలను శాసిస్తూ హక్కులను అరిస్తున్నారన్నారు ఘాటుగా విమర్శించారు. ఐఎఫ్టియు చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి సుబ్రహ్మణ్యం, రాష్ట్ర ఉపాధ్యక్షులు రాయపనేని హరికృష్ణ, చిత్తూరు జిల్లా అధ్యక్షురాలు వి. ఆర్. జ్యోతి, జిల్లా ఉపాధ్యక్షులు వెంకటరత్నం మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతూ విభజించు పాలించే విధానాన్ని పాటిస్తున్నదని విమర్శించారు. పాలక పార్టీలు చేస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ దేశంలోని రెండు బలమైన ఐ ఎఫ్ టి సంఘాలు విలీనం అవుతున్నాయని వాటిని ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని పేర్కొన్నారు. మార్చి 2న రాజమండ్రిలో జరగనున్న రెండు సంఘాల విలీన సభను జయప్రదం చేయడానికి రాష్ట్రంలోని ప్రజలు, అన్ని సంఘాల కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో యోగేష్ బాబు, వెంకటరమణ, వెంకటరమణారెడ్డి, ఆనంద్, వెంకటేష్ పాల్గొన్నారు..