అమరజీవి అసెంబ్లీ టైగర్ కామ్రేడ్‌ మద్దికాయల ఓంకార్‌

ఎంసిపిఐ(యు)పార్టీ వ్యవస్థాపకులు, ఓంకార్‌ 16వ వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం..

యంసిపిఐ(య)రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి

నర్సంపేట/హైదారాబాద్,నేటిధాత్రి :

భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ (ఐక్య),యంసిపిఐ(య) వ్యవస్థాపకులు అసెంబ్లీ టైగర్ నర్సంపేట మాజీ శాసన సభ్యులు, వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు, అమరజీవి కామ్రేడ్‌ మద్దికాయల ఓంకార్‌ అమరులై ఈ నెల 17 నాటికి 16 సంవత్సరాలు పూర్తి కానున్నది.కామ్రేడ్‌ ఓంకార్‌ ఉమ్మడి నల్లగొండ ప్రస్తుత సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌ (ఎస్‌) మండలం ఏపూరు గ్రామంలో జన్మించారు. తన 14వ యేటనే గ్రామంలో భూస్వాములు పెత్తందారులు నాటి నైజాం పరిపాలనలో ఖాసీం రజ్వి సేనలు కొనసాగిస్తున్న దోపిడి, వెట్టిచాకిరి, బానిసత్వానికి, మహిళలపై సాగిస్తున్న దారుణ ఆకృత్యాలకు వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభలో చేరి గెరిల్లా శిక్షణ పొందారు.అనంతరం దళ సభ్యుడిగా, దళ నాయకుడిగా, ఏరియా దళ కమాండర్‌గా నైజాం రజాకారు, భూస్వామ్యశక్తుల ఆగడాలపై మడమతిప్పని పోరాటం కొనసాగించారు. ఆ పోరాటంలో భూస్వాముల భూములను పేద ప్రజలకు పంచడంలో ప్రముఖపాత్ర పోషించారు. కామ్రేడ్‌ ఓంకార్‌ ఉద్యమ పోరాటకాలంలో నల్లగొండ, ఖమ్మం, కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాల్లో ముఖ్యంగా గోదావరి ప్రాంత పోరాటాలలో ఆదివాసీలతో మమేకమై నిర్వహించిన పోరాట పాత్ర గణనీయమైనది. పోరాట విరమణ తరువాత పార్టీ నిర్ణయం మేరకు వరంగల్‌ జిల్లాలో నాటి ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ, 1964లో మార్క్సిస్టు పార్టి నిర్మాణంలో,1984 నుండి పార్టి వ్యవస్థాపకనేతగా అమరత్వం పొందేవరకు యంసిపిఐ(యు) పార్టీ నిర్మాణంలో ఓంకార్‌ ప్రధాన భూమిక పోషించారు. 1972లో నర్సంపేట శాసనసభ స్థానం నుండి 1994 వరకు వరుసగా ఐదు సార్లు గెలుపొందారు. 22 సంవత్సరాలు శాసనసభ్యునిగా బడుగు, బలహీన, పీడిత ప్రజల గొంతుక అయినందుకు ప్రజలే కామ్రేడ్‌ ఓంకార్‌ ను ‘‘అసెంబ్లీ టైగర్‌’’ అని సంబోధించారు.ఇది సహించలేని భూస్వామ్య గూండాలు, నాటి కాంగ్రేస్‌, పీపుల్స్‌ వార్‌ నక్సలైట్లు అనేక సార్లు హత్యాప్రయత్నం కావించారు. 1979 ఆగష్టు 14 వ తేదీన మానుకోటలో రాత్రి బహిరంగసభలో మాట్లాడి బోజనం చేయటానికి ఒక కామ్రేడ్ ఇంటికి వెలుతున్న ఓంకార్ ను భూస్వామ్య గుండాలు కత్తితో పొత్తికడుపులో పొడిచారు. ఓల్డ్ యం యల్ ఎ క్వార్టర్స్ లో తనపై బాంబులు విసిరారు. సాదిరెడ్డిపల్లిలో మాటు కాసిన విషయం బయటకు రావడంతో ఓంకార్ క్షేమంగా బయటపడ్డారు. 1984 డిసెంబర్ 19 వ తేదీన పార్లమెంటు ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా రాత్రి బహిరంగ సభలో అన్నారం షరీఫ్ గ్రామంలో మాట్లాడుతున్న సమయంలో స్టెన్ గన్ తో కాల్పులు జరుపుతున్న సమయంలో అప్పుడే ఓంకార్ కు పూల మాల వేయడానికి వచ్చిన 10 సంవత్సరాల బాలునికి బుల్లెట్ తగిలింది. స్టెన్ గన్ కాల్పుల్లో తీవ్రంగా గాయాలు తగిలి వెన్నుపూసలో బుల్లెట్ దిగి ప్రాణాపాయం నుంచి ఓంకార్ బయటపడి రష్యా దేశానికి వెళ్లి వైద్యం చేయించుకున్నారు. అప్పటి బుల్లెట్ వెన్నుపూసలో ఉండి తీయలేని పరిస్థితి నుంచి వారు మరణించే వరకు బుల్లెట్ ఆ మహనీయుని శరీరంలోనే ఉండి పోయింది.1989 డిసెంబర్ 25 న దుగ్గొండి మండలం రేబల్లె గ్రామంలో రాత్రి బహిరంగ సభలో మాట్లాడుతున్న ఓంకార్ పై ఏకె 47 ధరించిన గుండాలు ( పీపుల్స్ వార్) ఆకస్మికంగా జరిపిన కాల్పుల్లో తృటిలో ఓంకార్ తల తిప్పటంతో వెంట్రుక వాసి కుడి చెవి వెంబడి బుల్లెట్ దూసుకుపోగా తమ నాయకున్ని రక్షించుకోవాలని గుండాలను ప్రతిఘటన చేసిన కామ్రేడ్ కత్తి సాంబయ్య, సిరి బొమ్మల లక్ష్మినారాయణలు బుల్లెట్ దెబ్బలకు అక్కడికక్కడే మరణించారు.
కామ్రేడ్‌ ఓంకార్‌ మృత్యుంజయుడిగా ప్రజల పక్షాన నిల్చారు. అంతటి మహత్తర పోరాట చరిత్ర కలిగిన కామ్రేడ్ ఓంకార్‌ 4వ తరగతి వరకు చదివిన తన జైలు జీవితంలో రహస్య జీవితంలో ఇంగ్లీషు, ఉర్దూ,హిందీ తదితర బాషలపై పట్టు సాధించారు.
భారతదేశ వ్యవస్థను, కమ్యూనిస్టు ఉద్యమ స్థితిగతులను సమగ్రంగా అధ్యయనం చేసిన కామ్రేడ్‌ ఓంకార్‌ దేశంలో కమ్యూనిస్టులు ఐక్యం కావాలని, నూటికి 93 శాతం ఉన్న బహుజనులు రాజ్యాధికారంలోకి రావాలని, ఏ బూర్జువ పార్టీ, ప్రజలకు ప్రత్యామ్నాయం కాదు కమ్యూనిస్టు-సామాజిక శక్తుల ఐక్యతే సరైన ప్రత్యామ్నాయ మార్గమని భావించారు. మార్క్సిజం ద్వారా వర్గ నిర్మూలనను సాధించాలని,అంబేద్కర్‌ ఆలోచన విధానంతో అసమానతను రూపుమాపాలని, బహుజనులకు రాజ్యాధికారం రావాలని 1984 నుండి అనేక ప్రయత్నాలు కొనసాగించారు. వర్గ వ్యవస్థలో భాగమే కుల వ్యవస్థ ఉందని, ఆదివాసి గిరిజనులకు స్వయంపాలన కల్పించాలని తను జీవించి ఉన్నంత కాలం పోరాడారు.
78 సంవత్సరాల స్వతంత్ర భారత దేశంలో ఆకలి, దారిద్య్రం, నిరుద్యోగం, ఆత్మహత్యలు, హత్యాచారాలు, హింసతో పాటు కుల`మత బేధాలు, ప్రాంతీయ తత్వాలను పాలకవర్గాల అనైతిక రాజకీయ విధానాలతో పెంచి పోషిస్తున్నారు. సెక్యులరిజం పేరుతో కాంగ్రేస్‌ పార్టీ దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన ప్రైవేటీకరణ సరళీకరణ ఆర్ధిక దోపిడితో పాటు కుల-మత తత్వాలను పెంచి పోషించింది. ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలంతో మూడవసారి కేంద్రాన్ని పాలిస్తున్న బిజెపి కూడ తన మతభావజాలాన్ని పెంపొందించుకుంటూ మైనార్టి మతాలపై,దళిత,గిరిజన,అట్టడుగు వర్గాలపై మనువాద పాలన పేరుతో దాడులకు పూనుకుంటూ వస్తుంది. గత పాలకవర్గం లాగానే కార్పోరేట్‌, పెట్టుబడిదారి వర్గాలకు దేశ సంపదను ఆదాని, అంబానీలకు కట్టబెట్టింది. తన మతోన్మాద, పెట్టుబడిదారి ఆర్థిక విధానాలను ప్రశ్నించిన వారిపై ఫాసిజంతో దురహాంకరపూరితమైన ఉన్మాద చర్యలకు పూనుకుంటుంది. ఎన్నికల కమీషన్‌, న్యాయ వ్యవస్థ, ఈడి, సిబిఐ లాంటి స్వతంత్ర వ్యవస్థలను తన గుప్పిట్లో పెట్టుకొని దేశ రాజకీయ వ్యవస్థలను కలుషితం చేస్తుంది మానవ హక్కులను హరిస్తున్న శక్తులకు అండగా ఉంటుంది దానిలో భాగంగా నే ఆదివాసీ హక్కుల నేత ఫాథర్ స్టాన్ స్వామిని పౌర హక్కుల నేత ప్రొఫెసర్ సాయిబాబాలపై చేయని కుట్రకేసుల్లో ఇరికించి వారి మరణానికి కారణం అయింది. ఒకే బాష, ఒకే మతం, ఒకే దేశం అంటూ ఒకే ఎన్నికల పేరుతో జమిలి ఎన్నికలు విధానానికి ఒడిగట్టి ప్రజాస్వామ్య విలువలను, రాజ్యాంగ విలువలను సమాధి చేస్తుంది. అనేక ఆంక్షల నేపధ్యంలో సాధించుకున్న మన తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన గత బిఆర్‌ఎస్‌, ప్రస్తుత కాంగ్రేస్‌లు కూడ రాష్ట్ర అభివృద్ధి పేరుతో కేంద్రంలోని బిజెపి చేసిన తప్పుడు చట్టాలను, ప్రజావ్యతిరేక విధానాలను బలపరుస్తున్నాయి. కేంద్రంలోని బిజెపి అనుసరిస్తున్న ఫాసిస్టు, మనువాద విధానాలకు, సెక్యూలర్‌ ముసుగులో ఉన్న కాంగ్రేస్‌ విధానాలకు వ్యతిరేకంగా కార్పోరేట్‌, పెట్టుబడిదారి ఆర్థిక విధానాలను కొనసాగిస్తున్న దోపిడి పాలకవర్గాల పాలనలో సమస్త హక్కులు కోల్పోతున్న శ్రామిక వర్గ ఐక్య పోరాటాల బలోపేతానికి మార్క్సిజమే మార్గదర్శిగా, తరతరాలుగా అసమానలతో అణిగి మనిగి ఉన్న భారత సమాజాన్ని అంబేద్కర్‌ ఆలోచన విధానంతో రాజకీయ, ఆర్ధిక, సామాజిక సమానత్వాన్ని, బహుజనులకు రాజ్యాధికారాన్ని సాధించాలని కాంక్షిస్తూ అమరజీవి కామ్రేడ్‌ మద్దికాయల ఓంకార్‌ 16 వర్ధంతి కార్యాక్రమాన్ని యంసిపిఐ(యు) రాష్ట్ర వ్యాప్తంగా 2024 అక్టోబర్‌ 17నుండి 31 వరకు “‘ప్రస్తుత రాజకీయాలు మార్క్సిజం ` అంబేద్కర్‌ ఆలోచన విధానం” అనే అంశంపై జరుపుతున్న కార్యక్రమాలను జయప్రదం చేయాలని అన్ని వర్గాల ప్రజలకు యంసిపిఐ(యు) తెలంగాణ రాష్ట్ర కమిటి పిలుపునిస్తుంది.
ప్రారంభ సభ:
ఈ నెల 17 న, ఉదయం 11 గం॥లకు వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలం మచ్చాపురం గ్రామం కామ్రేడ్ ఓంకార్‌ 125 అడుగుల స్థూపం వద్ద నిర్వహణ జరుగుతుంది.

రచయిత..
*గాదగోని రవి
రాష్ట్ర కార్యదర్శి
సెల్ నెంబర్ 7396072718*

*భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టి (ఐక్య),యంసిపిఐ(య) తెలంగాణ రాష్ట్ర కమిటి.
1-8-742/2/ఎ, ఓంకార్‌ భవన్‌, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్‌*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!