aa udyogulu bari thegincharu, ఆ ఉద్యోగులు బరి తెగించారు

ఆ ఉద్యోగులు బరి తెగించారు

దొంగే దొంగ…దొంగ…అని అరిచినట్లు ఉంది డిఐఈఓ కార్యాలయంలో కొంతమంది ఉద్యోగుల తీరు. అవుట్‌సోర్సింగ్‌, మరికొంతమంది రెగ్యులర్‌ ఉద్యోగులు ఈ కార్యాలయంలో అనుసరిస్తున్న తీరు, ఇక్కడ కొనసాగుతున్న అవినీతిపై ‘నేటిధాత్రి’ వరుస కథనాలను ప్రచురించింది. అయితే ఈ కథనాలను సమాధానం చెప్పలేక నిఖార్సయిన వార్తలతో ఖంగుతిన్న కొంతమంది ఉద్యోగులు తమకు తెలిసిన వారితో, వారి అవినీతికి కొమ్ముకాసే వారితో ఫోన్‌కాల్స్‌, పైరవీలు చేస్తున్నారు. అయినా ‘నేటిధాత్రి’ డిఐఈఓ కార్యాలయంలో అవినీతిని అంతమొందించే దిశగానే కథనాలను ప్రచురిస్తూ వచ్చింది. దీంతో మింగుడుపడని డిఐఈఓ, అతని వద్ద పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులు ఓ పనికి మాలిన ప్రచారానికి తెరతీశారు. గత 18సంవత్సరాలుగా నిఖార్సయిన వార్తలతో సామాన్యుడి తరపున వకాల్తా పుచ్చుకుని అక్షరసమరం చేస్తున్న ‘నేటిధాత్రి’పై నోటికి వచ్చినట్లు మాట్లాడడం, బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని అనడం మరీ హీనస్థితికి దిగజారిపోయి డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారని వారు చేస్తున్న నీతిమాలిన పనిని ‘నేటిధాత్రి’ ప్రతినిధికి అంటగట్టే ప్రయత్నం చేశారు. ఇష్టారీతిన అవినీతికి కార్యాలయంలోనే ఆజ్యం పోస్తూ, అధికారి అనే పదానికి తలవంపులు తేస్తూ దిగజారిపోయిన మాటలతో భయపెట్టాలనే ప్రయత్నం చేస్తే ‘నేటిధాత్రి’ ఎంతకు భయపడదని ఆ ఉద్యోగులు, అధికారికి మేం స్పష్టం చేయదలుచుకున్నాం. కార్యాలయంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై కమీషన్‌ వేసి విచారణ జరిపి నిజనిజాలని వెలికితీయాలని కోరుతున్నాం. ఇప్పటికే వీరి అవినీతి బాగోతంపై ‘నేటిధాత్రి’ ప్రతినిధి ఆర్జేడికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయగా ఇంటర్‌ బోర్డు కమిషనర్‌కు ఈమెయిల్‌ ద్వారా కథనాలను పోస్టు చేయడం జరిగింది. ఎక్కడ తలొగ్గకుండా ‘నేటిధాత్రి’ అవినీతిపై అక్షర సమరం చేస్తుంటే కొంతమంది పనికిమాలిన తెలివి లేని వారి సూచనలతో ‘నేటిదాత్రి’పై ఆరోపణలు చేయడాన్ని పత్రిక తీవ్రంగా ఖండిస్తుంది. సూర్యుడిపై ఉమ్మేస్తే ఏమవుతుందో తెలుసుకోవాలని కోరుతున్నాం.

అవినీతి చేయనివారికి భయమెందుకు

మేం అసలు అవినీతికి పాల్పడలేదు. మేం సత్యశీలురం ‘నేటిధాత్రి’ కావాలని చేస్తుంది అని సభ్యత లేకుండా గొంతు చించుకుంటున్న కొంతమంది ఉద్యోగులు ఎందుకు అంతలా భయపడిపోతున్నారో అర్థంకాని విషయం వారు నిజాయితిపరులైతే విచారణకు ఎందుకు డిమాండ్‌ చేయట్లేదు. ప్రభుత్వ నిధులను మెక్కేసి విషయం బయటికి పొక్కడంతో నానా హైరానా పడుతున్న ఉద్యోగులు తమ నిజాయితిని ఎందుకు నిరూపించుకోవడం లేదు. అసలు మనుషులే లేకుండా, వారితో పనే జరగకున్న బ్యాంకు ఖాతాలు సేకరించి వాటిలో డబ్బులు జమ చేయించి ఎవరు ఆ డబ్బులను భోం చేశారో స్పష్టం చేయాలి. రిటైర్‌మెంట్‌కు 8నెలల సమయం కూడా లేని అధికారి సాగిస్తున్న లీలలను ప్రశ్నిస్తే అలా కాదని వివరణ ఇచ్చుకునేదిపోయి ఫోన్‌కాల్స్‌ చేయించి అడ్డంగా ఎందుకు దొరికిపోవాల్సి వచ్చిందో చెప్పాలి. కార్యాలయంలో సీసీ కెమెరాలను అప్‌ చేయించి ఇతగాడు వెలగబెడుతున్న రాచకార్యాలు ఏంటో చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఇంటర్‌ బోర్డు వద్దన్న లక్షల్లో డబ్బులు దండుకుని నైట్‌ వాచ్‌మెన్‌ను నియమించి డబ్బులు ఇచ్చిన రోజు హాజరుపట్టికలో సంతకం చేయించి మరుసటిరోజు నుంచి సంతకం చేయకుండా, చేసిన పనికి జీతం ఇవ్వకుండా ఎందుకు సతాయించాల్సి వచ్చిందో డిఐఈఓ ఆ ఉద్యోగికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. తప్పులన్నీ చేసి ఇదేంటని ప్రశ్నిస్తే ఎదురుదాడే సమాధానంగా వేస్తామంటే ఎలా కుదురుతుంది. ‘గురువింద గింజ’ నీతి బోదిస్తామంటే ఇక్కడ వినడానికి ఎవరు సిద్దంగా లేరని గుర్తుంచుకోవాలి. అధికారిలా, అక్కడ పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగుల్లా ‘నేటిధాత్రి’ కాసులకు కక్కుర్తి పడదని తెలుసుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *