Value Your Vote
ఓటు అనేది కాగితపు ముక్క కాదు…!
అది గ్రామ భవిష్యత్తు కై నాటే మొక్క
తెలంగాణ ప్రోగ్రెస్సివ్ టీచర్స్ ఫెడరేషన్( టి పి టి ఎఫ్ ) కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ ఉద్ధాటన
అభివృద్ధి చేయకపోవడం నాయకుల తప్పు కాదు.. అలాంటి వారిని ఎన్నుకున్న ప్రజలదే తప్పు
ప్రజలు స్వార్థాన్ని, అమాయకత్వాన్ని వీడి చైతన్యంతో ఆలోచించాలి
“దేశానికి గ్రామాలే పట్టుకొమ్మలు, గ్రామ అభివృద్దే దేశ అభివృద్ధి ” అనే గాంధీజీ నానుడిని మరవద్దు
మద్యం,మాంసం,డబ్బు అనే ప్రలోభాలకు ఆశపడితే… ప్రజలు ప్రశ్నించే హక్కును కోల్పోతారు.
ప్రజలు స్వార్ధంగా ఆలోచించి మోసపోయినంతకాలం-నాయకులు మోసం చేస్తూనే ఉంటారు
78 సంవత్సరాల స్వతంత్ర భరతావనిలో జరిగిన గ్రామాల అభివృద్ధి అంతంత మాత్రమే
కేసముద్రం/ నేటి ధాత్రి
గ్రామపంచాయతీ ఎన్నికలు దగ్గరపడుతున్న ఈ సమయంలో, ప్రతి ఓటరు తన చేతిలో ఉన్న ఓటు శక్తిని గుర్తించాలని, నిజాయితీగా గ్రామాన్ని అభివృద్ధి చేసే సమర్థత గల నాయకునికి మాత్రమే ఓటు వేసి గెలిపించుకోవాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టిపిటిఎఫ్) కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టిపిటిఎఫ్ అధ్యక్షులు సురేందర్ మీడియాతో మాట్లాడుతూ ఓటు అంటే ఒక కాగితపు ముక్క కాదని, అది
మన గ్రామ భవిష్యత్తు కై నాటే మొక్క అని, మన అభివృద్ధి దశను నిర్ణయించే శక్తి అని , ఓటు అనేది అమ్ముకునే వస్తువు కాదు- అది మన భవిష్యత్తు కు దిక్సూచి ” అని అన్నారు.
ఎన్నికల సమయంలో కొందరు వ్యక్తులు మద్యం, మాంసం, డబ్బులతో ప్రలోభపెట్టి ఓటర్లను తమ దారిలో నడిపించు కోవాలని చూస్తారని వాళ్ళ ఉచ్చులో పడొద్దని సూచించారు.
వారిచ్చే మద్యం, మాంసం తింటే ఏమి మారుతుంది?
వాళ్ళు ఇచ్చే డబ్బులతోనే మన సమస్యలన్నీ తీరిపోతాయా? అని తమకు తామే ప్రశ్నించుకుంటే అర్థమవుతుందని, మన గ్రామ భవిష్యత్తు మన కళ్ళ ముందు సాకారం అవుతుందని అన్నారు. ఒకవేళ వాళ్ళ ప్రలోభాలకు తలొగ్గి వారికి ఓటేస్తే, ఆ పొరపాటు ఓటు మన గ్రామాన్ని ఐదు సంవత్సరాలు వెనక్కి నెట్టి వేస్తుందని వివరించారు. ఉచితాలకు, తన స్వల్ప కాల ఆనందాలకు అలవాటు పడటం వల్లనే 78 సంవత్సరాల స్వతంత్ర భరతావనిలో జరిగిన గ్రామాల అభివృద్ధి అంతంత మాత్రమేనని దీనికి ప్రజలే పూర్తి బాధ్యత వహించాలని అన్నారు.
మన గ్రామం అభివృద్ధి చెందాలన్నా, రోడ్లు, లైట్లు, తాగునీటి సమస్యలు తీరాలన్నా, యువతకు అవకాశాలు రావాలాన్న, గుడి, బడి సక్రమంగా నడవాలన్నా బాధ్యతగల, సేవాభావం గల, గ్రామాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించాలన్న ఆలోచన గల నాయకుడిని ఎన్నుకోవాలని హితువు పలికారు.
ప్రతి ఓటరు ఆలోచించి బాధ్యతతో ఓటు వేస్తే
గ్రామాలన్నీ అభివృద్ధి పథం వైపు దూసుకెళ్తాయని వివరించారు. “గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు, గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందినట్లు ” అన్న గాంధీజీ నానుడి నిజమవుతుందని అన్నారు.
