రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం దేశరాజుపల్లి గ్రామానికి చెందిన గజ్జల రవి మొదటగా తనకి ఊహ తెలియని వయసులోనే తండ్రి మల్లయ్యను కోల్పోయాడు. అప్పటి నుండి వాళ్ల అమ్మ గజ్జల రాజమణి అన్నీ తానే అయ్యి కుటుంబ బారాన్ని మోస్తూ తన కూతురిని ఇద్దరు కొడుకులను పోషించేది. కూతురికి కష్టపడి పెళ్లి చేసి అత్తవారింటికి పంపగా, కుటుంబ ఆర్థిక స్థోమత లేక అల్లాడుతున్న సమయంలో పెద్ద కొడుకు రాజు తల్లికి సహాయంగా వుంటూ జీవనోపాధి కోసం ఎడారి దేశానికి వెళ్లగా కాలం కాటు వేసి ప్రమాదవశాత్తు నాలుగు అంతస్తుల భవనంపై నుండి పడిపోయి వెన్నెముక విరిగిపోవడంతో మంచానికే పరిమితమై సంవత్సరం తరువాత కన్నుమూశాడు. అప్పటి నుండి కష్టాలలో ఉన్న కుటుంబంను రవి కూలీ నాలి చేసుకుంటూ, నెట్టుకొస్తున్న సమయంలో విధి మళ్ళీ తనని చిన్నచూపు చూసింది. రెండు సంవత్సరాల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదం తన కాళ్ళకి తీవ్ర గాయాలై ఒక కాలు పూర్తిగా పని చేయకుండా విరిగిపోయింది. ఉన్న కాస్త భూమి అమ్మి రెండు మూడు ఆపరేషన్లు చేసిన ఫలితం లేకుండా పోయింది. ఇక మంచానికే పరిమితమైపోయి ఉండగా వయసు మీద పడినా అతని తల్లి అంతా తానై సేవలు చేస్తుండగా జూన్2న తన తల్లి అనారోగ్యంతో కొడుకుని ఒదిలి అనంత లోకాలలో కలిసిపోయింది. కడుపేద దుస్థితిలో, కదలలేని పరిస్థితి, కనీసం ఓదార్చే వారు లేక, ఒంటరిగా మిగిలిపోయి శూన్యంలోకి నెట్టివేయబడ్డ తన జీవితాన్ని ఎలా గడపాలో తెలియక దయనీయమైన స్థితిలో వున్న విషయాన్ని స్థానికులు రుద్రారం ఎంపిటీసి గుఱ్ఱం దేవిక రాజశేఖర్ కు తెలుపగా దాతల సహకారంతో సమకూర్చిన 42000 రూ.లను గజ్జెల రవికి అందజేయడం జరిగినది. ఈకార్యక్రమంలో చిలుమల శ్రీను, నాగం మోహన్, చిలుముల లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.