
Advance Bathukamma Celebrations at Tavakkal & St. John's Schools
తవక్కల్ పాఠశాల, సెయింట్ జాన్స్ పాఠశాల ల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు…
రామకృష్ణాపూర్, నేటిధాత్రి :
రామకృష్ణాపూర్ పట్టణంలోని తవక్కల్ పాఠశాల, సెయింట్ జాన్స్ పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందస్తు బతుకమ్మ వేడుకలకు తవక్కల్ పాఠశాలలో విద్యాసంస్థల అధినేత అబ్దుల్ అజీజ్ , పట్టణ ఎస్ఐ రాజశేఖర్, ట్రస్మా స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెత్తుల రాజేంద్రపాణి లు హాజరయ్యారు. సెయింట్ జాన్స్ పాఠశాలలో ప్రిన్సిపాల్ పొన్నాల సుమన్ లు ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థినీ విద్యార్థులతో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు తీరొక్క పువ్వులతో బతుకమ్మలను పేర్చారు. పాఠశాలల ఆవరణలో విద్యార్థులు రంగురంగుల దుస్తులు ధరించి బతకమ్మ ఆటా పాటలో భాగంగా డీజే పాటలతో నృత్యాలు చేశారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా విద్యార్థినిలు నృత్యాలు చేస్తూ బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహిస్తున్న సందర్భంగా రాష్ట్ర సాంప్రదాయాన్ని గౌరవిస్తూ పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తున్నామని తవక్కల్ పాఠశాల అధినేత అబ్దుల్ అజీజ్, సెయింట్ జాన్స్ పాఠశాల ప్రిన్సిపాల్ పొన్నాల సుమన్ లు తెలిపారు. కులమతాలకతీతంగా బతుకమ్మ వేడుకలను పాఠశాలల్లో నిర్వహించుకోవడం జరిగిందని విద్యార్థులకు అన్ని పండుగల పైన అవగాహన కల్పించడమే ముఖ్య ఉద్దేశమని తెలిపారు. పట్టణ ప్రజలందరికీ ముందస్తుగా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమాలలో పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.