"Best Center Awards".
డయాలసిస్ లో బెస్ట్.. జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి దక్కిన అరుదైన గౌరవం!
జహీరాబాద్ నేటి ధాత్రి:
డయాలసిస్ సేవల కోసం వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్య చికిత్సలు అందిస్తున్న జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి అరుదైన గౌరవం దక్కింది. జాతీయస్థాయిలో ప్రతి ఏటా నిర్వహించే “బెస్ట్ సెంటర్ అవార్డ్స్” విభాగంలో ఉత్తమ డయాలసిస్ సెంటర్ అవార్డును ఈ ఆసుపత్రికి వరించింది. ఇందులో రోజుకు సగటున 30 మంది పేషంట్లకు డయాలసిస్ చికిత్సలు అక్కడి వైద్యులు అందజేస్తున్నారు. వీరి ఉత్తమ సేవలకు గాను ఈ అవార్డు దక్కడం పట్ల జిల్లా ఇన్చార్జి వైద్యాధికారిని డాక్టర్ గాయత్రి, డీ.సీ.హెచ్.ఎస్ డాక్టర్ సంగారెడ్డిలు హర్షం వ్యక్తం చేశారు.
మూడు షిఫ్టుల్లో 24 గంటల పాటు సేవలు.
జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో 2018లో డయాలసిస్ సెంటర్ ను ప్రారంభించారు. నాటి నుంచి నేటి వరకు సుమారు 600 మంది వరకు ఈ సెంటర్లో చికిత్స పొందారు. ప్రస్తుతం 65 మందికి ఇక్కడ డయాలసిస్ సేవలు అందిస్తున్నారు. ఈ సెంటర్లో ప్రస్తుతం 10 బెడ్స్ ఉండగా రోజుకు 30 మందికి మూడు షిఫ్టుల్లో 24 గంటల పాటు డయాలసిస్ వైద్య సేవలను ఇక్కడి సిబ్బంది కొనసాగిస్తున్నారు.
