ఉద్యమ కారులకు పెద్ద పీట!

`మళ్లీ రంగంలోకి రాములమ్మ!

`ఎమ్మెల్సీగా కాంగ్రెస్‌ పార్టీ ఎంపిక!

`పార్టీకి చేసిన సేవలకు ఎట్టకేలకు గుర్తింపు.

`గల్లీ నుంచి డిల్లీ దాకా తెలంగాణ కోసం కొట్లాడిన ఏకైక మహిళా నాయకురాలు.

`కోట్ల రూపాయల సంపాదన వదులుకొని తెలంగాణ కోసం రంగంలోకి దిగారు.

`తల్లి తెలంగాణ పార్టీ పెట్టి ఉద్యమానికి ఊపిరిపోశారు.

`పార్లమెంటు సభ్యురాలిగా తన గళం వినిపించారు.

`తెలంగాణ కోసం పార్లమెంటును గడగడలాడిరచారు.

`ఒంటరిగా కొన్నేళ్ల పాటు లోక్‌సభ సాగుకుండా అడ్డుకున్నారు.

`తెలంగాణ తెచ్చి రాజకీయంగా కుట్రకు బలయ్యారు.

`కల నెరవేరింది!

`అద్దంకి అడ్డేముంది!!

`నల్గొండ ఉమ్మడి జిల్లా రాజకీయాలకు ఊపిరి వచ్చింది.

`అణగారిన వర్గాల గొంతుకు బలమొచ్చింది.

`కాంగ్రెస్‌ పార్టీకి మరో పదునైన గళం పదునుపెట్టినట్లైంది.

`ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పాలన ప్రజల్లోకి తీసుకెళ్లే గొంతుక వచ్చింది.

`కాంగ్రెస్‌పై మాట్లాడాలంటే ప్రత్యర్థులు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి.

`ఉద్యమ కాలం నాటి సింహం నిద్ర లేచింది.

`కాంగ్రెస్‌ కు రక్షణ కవచం తొడిగినట్లైంది.

`ఇచ్చిన మాట నిలబెట్డుకున్న సిఎం రేవంత్‌ రెడ్డి.

`కాంగ్రెస్‌ కు కంచుకోట లాంటి నాయకత్వం మరొకటి చట్ట సభకు చేరింది.

……………

`కంచు కంఠం దాసోజు!

`పాయింట్‌ లేవదీస్తే ప్రత్యర్థులకు మాటరాదు.

`తెలంగాణ ఉద్యమ కారుడు.

`గతంలోనే దక్కాల్సిన అవకాశం.

`లేట్‌గా వచ్చినా లెటెస్ట్‌ గానే వుంది.

`ఎట్టకేలకు దాసోజును ఎమ్మెల్సీ వరించింది.

రాజకీయాలలో అవకాశాలు వెత్తుక్కుంటూ కొంత మందికి వస్తాయి. కొంత మందికి జీవితాంతం ఎదురుచూసినా రావు. రాజకీయాల్లో ఎంత కష్టపడినా, ఆవ గింజంత అదృష్టంకూడా వుండాలని అంటారు. అదే నిజమని కూడా చాలా సార్లు రుజువైంది. ఈసారి ఎమ్మెల్సీల ఎంపికలో అలాంటి సంకేతాలు కనిపించాయి. ఎందుకంటే అటు కాంగ్రెస్‌, ఇటు బిఆర్‌ఎస్‌ ఎంపిక చేసిన అభ్యర్ధులను చూస్తే అర్ధమౌతుంది. ఎంత కష్టపడినా, ఎన్ని త్యాగాలు చేసినా కొన్ని సార్లు వారికి పదవులు చాలా అలస్యమౌతుంటాయి. ప్రజలనుంచి కూడా వారికి సానుభూతి ఎంత వున్నా, సరే కొన్ని సార్లు అవకాశాలు దక్కవు. అయినా పట్టువదలని విక్రమార్కుల్లా వారి పోరాటం నిజంగానే స్పూర్తిదాయమే..కాని అలాంటి వారికి పదవులు అందకపోతే మిగిలేది నైరాశ్యమే..ఓపికకు కూడా ఒక హద్దు వుంటుంది. ఏడాదో, రెండేళ్లో కాదు. దశాబ్దాల పాటు ప్రజా సేవ, రాజకీయ సేవలు చేసిన వారికి పదవులు దక్కకపోతే రాజకీయాలలో కొనసాగడం అంత సులువు కాదు. అయినా పదవులో,తమ పరిశ్రమో చూద్దామని కంకణం కట్టుకున్నవారికి మాత్రం ఎప్పటికైనా మళ్లీ గుర్తింపు వస్తుందని చెప్పడానికి ఈసారి ఎమ్మెల్సీ పదవులు పంపకమే నిదర్శనమని చెప్పకతప్పదు. ముందుగా తెలంగాణ ఉద్యమనాయకురాలు, సినీ నటి విజయశాంతి. తెలంగాణ సమాజమే కాదు, దేశ వ్యాప్తంగా వున్న ఆమె అభిమానులు రాములమ్మ అంటూ గొప్పగా పిలుచుకుంటారు. సినీ కేరిర్‌ ఉచ్చదశలో వున్నప్పుడు ఎవరూ వదులుకోవాలని అనుకోరు. కాని దేశంలోనే ఏ మహిళా నటి తీసుకోనంత రెమ్యునరేషన్‌తో సినిమాల్లో విజయశాంతి నటించారు. జాతీయ స్దాయిలో ఆమె ఊర్వశి అవార్డును సొంతం చేసుకున్నారు. లేడీ సూపర్‌ స్టార్‌ అనిపించుకున్నారు. సినిమా అంటే హీరోయిజం. అలాంటి దశలో హీరో లేకుండా హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు కోట్లు ఖర్చు పెట్టి తీసేంత ఇమేజ్‌ వున్న నటి విజయశాంతి. అలాంటి విజయశాంతి తెలంగాణ కోసం తన జీవితం త్యాగం చేశారు. తన కేరిర్‌ వదులుకున్నారు. కోట్ల రూపాయల సంపాదన కాదనుకున్నారు. నా తెలంగాణ ప్రజలు సంతోషంగా జీవించే కాలం రావాలని కోరుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించాలనుకున్నారు. తెలంగాణ సాదన కోసం ఆమె తల్లి తెలంగాణ అనే పార్టీని స్దాపించి తెలంగాణ వ్యాప్తంగా అనేక సభలు, సమావేశాలు నిర్వహించారు. తెలంగాణ ప్రజల్లో ప్రత్యేక రాష్ట్ర్ర ఆకాంక్షను బలపర్చారు. మరింతగా తెలంగాణలో చైతన్యం నింపారు. తెలంగాణ సమాజమంతా ఉద్యమంలో పాలు పంచుకునేలా చేశారు. బిఆర్‌ఎస్‌ అప్పటి టిఆర్‌ఎస్‌కు ధీటుగా తెలంగాణ వాదం వినిపించారు. కేసిఆర్‌ కోరిక మేరకు ఉద్యమ సంస్దలన్నీ ఒకే వేదిక మీదకు వస్తే తెలంగాణ ఉద్యమానికి మరింత బలం పెరుగుతుందని నమ్మారు. కేసిఆర్‌ మాటను మన్నించారు. తల్లి తెలంగాణ పార్టీని భేషరుతుగా టిఆర్‌ఎస్‌లో విలీనం చేశారు. ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో ఆమె మెదక్‌ నుంచి పోటీచేసి గెలిచారు. పార్లమెంటులో అడుగు పెట్టారు. అప్పటి నుంచి ఇక నిరంతరం ఆమె ఇటు గల్లీలోనూ, అటు డిల్లీలోనూ తెలంగాణ గళం వినిపించిన ఏకైక నాయకురాలు విజయశాంతి. అయితే డిసెంబర్‌ 9 తెలంగాణ ప్రకటన వచ్చినా, తర్వాత కాంగ్రెస్‌ పార్టీ వెనక్కి తీసుకోవడాన్ని ఆమె పార్లమెంటు సాక్షిగా నిలదీశారు. నాలుగేళ్లపాటు ఆమె నిరంతరం పార్లమెంటులో తన గళం వినిపించారు. ఆ సమయంలో టిఆర్‌ఎస్‌ నుంచి కేవలం రెండు సీట్లు మాత్రమే గెలిచారు. ఒకరు కేసిఆర్‌, మరొకరు విజయశాంతి. కేసిఆర్‌ పార్లమెంటు సమావేశాలకు హజరు కాకపోయినా, ఆమె మాత్రం పార్లమెంటు వేదికగా సభ జరిగినన్ని రోజులు స్పీకర్‌ పోడియం వద్ద నిలబడి నిరసన తెలియజేసేవారు. ఆ సమయంలో కాంగ్రెస్‌ ఎంపిలు పార్లమెంటు బైట నిరసన చేస్తే, విజయశాంతి ఏకంగా స్వీకర్‌ పోడియం ముందే నిరసన తెలియజేసిన సందర్భాలు కోకొల్లలు. పార్లమెంటు జరిగినన్ని రోజులు, సభ సాగినంత సమయం ఆమె అయితే వెల్‌లోకి వెళ్లి నిరసన తెలియజేసేవారు. లేకుంటే తన సీట వద్దనే నిలబడి ఉద్యమ ఆకాంక్షను నినాదాల ద్వారా తెలియజేసేవారు. 2014కు ముందు ఆమెను కేసిఆర్‌ పక్కన పెట్టే రాజకీయం చేశారు. తెలంగాణ వస్తే విజయశాంతికి క్రెడిట్‌ పోవడం ఆయన ఇష్టం లేదు. అందుకే ఆమెను పార్టీలో ప్రాధాన్యత తగ్గిసూ వచ్చారు. అయినా ఆమె ఉక్కు మహిళ. పదవుల కోసం ఆమె తెలంగాణ ఉద్యమం చేయలేదు. తెలంగాణ వస్తే చాలనుకున్నారు. తెలంగాణ సాధనలో ముందు వరసలో వున్నారు. తెలంగాణ రావడంలో తన పాత్రను చరిత్రలో లిఖించుకున్నారు. తర్వాత కాలంలో ఆమె కాంగ్రెస్‌ లో చేరారు. ఆ పార్టీలో కూడా తగిన ప్రాదాన్యత లభించలేదు. తర్వాత బిజేపిలోకి వెళ్లారు. అక్కడ కూడా ఆమెకు ఆదరణ కనిపంచలేదు. తిరిగి గత ఎన్నికల ముందు తిరిగి కాంగ్రెస్‌ గూటికి చేరుకున్నారు. వర్కింగ్‌ ప్రెసిడెంటుగా పదవిని కూడా పొందారు. కాని సరిగ్గా ఎన్నికల సమయంలో ఆమె సహాకారం ఎవరూ కోరకపోయినా, తన కర్తవ్యాన్ని ఆమె నెరవేర్చారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చింది. కాని ఆమె పదవులకోసం ఏనాడు ప్రయత్నం చేయలేదు. తాజాగా ఎమ్మెల్యే కోటాలో కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం ఎమ్మెల్సీ ఇచ్చారు. గతంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరినప్పుడే పార్టీ అధిష్టానం హమీ ఇచ్చింది. ఆ హమీని పార్టీ నిలబెట్టుకున్నది. ఏది ఏమైనా రాములమ్మ లాంటి చైతన్య కిరణం కాంగ్రెస్‌కు ఎంతో అవసరం. ఆ పార్టీ అధికారంలోకి రావడంలో రాములమ్మ ప్రయత్నం కూడా వుంది. అందుకే పార్టీ ఆమెకు ప్రాధాన్యత కల్పించింది.

క అద్దంకి దయాకర్‌. ఆయనకు పదవి రాకపోతే తెలంగాణ సమాజమే తిరగబడేంత పరిస్దితి కనిపించింది. ఎందుకంటే కాంగ్రెస్‌పార్టీ కోసం ఆయన చేసిన సేవను తెలంగాణ సమాజం మొత్తం గమనిస్తూనే వుంది. అడుగడుగునా ఆయనకు అన్యాయం జరుగుతుంటే సానుభూతి పెరుగుతూనే వుంది. తెలంగాణ ఉద్యమంలో అద్దంకి దయకర్‌ కీలకభూమిక పోషించారు. అటు మాలమహానాడురాష్ట్ర అధ్యక్షుడుగా ఎస్సీలకు జరుగుతున్న అన్యాయాలపై పోరాటం చేశారు. ఇటు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరంతరం ఉద్యమానికి అంకితయ్యారు. జేఏసి ఏర్పాటులో కీలక భూమిక పోషించారు. జేఏసి సమావేశాలకు ఆ సమయంలో హజరు కావాలంటే కొంత మంది ముందూ వెనకు ఆలోచించేవారు. కాని జేఏసి ఏర్పాటు చేసే ప్రతి సమావేశానికి, సభలకు ఆయన క్రమం తప్పకుండా హజరౌతూ వచ్చేవారు. తెలంగాణ గళం వినిపించేవారు. తెలంగాణ వ్యతిరేకులను తన వాక్చాతుర్యంతో చీల్చి చెండాడేవారు. ఉన్నత విద్యావంతుడు కావడం వల్ల తెలంగాణ మీద పూర్తి పట్టు వుంది. అవగాహన వుంది. గత చరిత్ర తెలుసు. వర్తమానంలో తెలంగాణ సమజానికి ఏం కావాలో తెలుసు. ప్రతి అంశంపై సునిశితన జ్ఞానం వుంది. ఆయా సమస్యల మీద పూర్తిగా పట్టు వుంది. తెలంగాణ ప్రజలు ఎప్పుడు ఎలా మోసపోయారు. ఎంత మోసపోయారు. మోసపోడానికి ప్రేరేపించిన అంశాలపై ఆయన అనర్గళంగా లెక్కలతో సహా చెప్పడంతో దిట్ట. అందుకే ఆయనకు పార్టీలకు అతీతంగా ఉద్యమ సమయంలో పేరొచ్చింది. అంత గౌరవం కూడా దక్కింది. అందుకే తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్‌ పార్టీ ఆయనను ఆహ్వానించింది. పార్టీలో చేర్చుకున్నది. నిజానికి ఆయన ఆ సమయంలో బిఆర్‌ఎస్‌లో చేరితే ఇప్పటికే అనేక రాజకీయ అవకాశాలు,పదవులు అందుకునేవారేమో! కాని కష్టపడడమే ఆయన తత్వం. ఏటికి ఎదురీడడం ఆయన నైజం. ఏదైనా సరే, కష్టపడిసాధించున్నదానిలో వుండే ఆత్మ సంతృప్తి మరెందులోనూ వుండదని నమ్ముతారు. ఎందుకంటే అద్దంకిదయకర్‌కు పదవీ కాంక్ష అప్పుడు లేదు. ఇప్పుడూ లేదు. కాని సమాజ దిశా నిర్ధేకులైన కొంత మందికి పదవులు అవసరం. సామాన్య వ్యక్తిగానే సమాజాన్ని ఎంతో చైతన్య పర్చిన అద్దంకి దయాకర్‌ లాంటి వారు చట్టసభల్లో వుంటే ఆ సమాజానికే ఎంతో మేలు కలుగుతుంది. అద్దంకి దయాకర్‌ అంటే ఒక ప్రశ్న. స్పందించే గళం. ఎదిరించే నైజం. పాలకులను నిలదీసే గుణం ఆయన సొంతం. అలాంటి నాయకుడు చట్టసభలో వుంటే పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. నిజానికి ఆయన 2014లోనే ఎమ్మెల్యే కావాలి. ఆ ఎన్నికల్లో పోటీ చేసినా తక్కువ మెజార్టీతో ఓడిపోయారు. తర్వాత 2019 ఎన్నికల్లోనూ గెలుపు తీరం చేరుకుంటున్న దశలో ఫలిత ంత తారు మారైంది. తక్కువ మెజార్టీతో ఓడిపోయారు. ఆయనను లాక్కోవాలిన బిఆర్‌ఎస్‌ అనేక సార్లు ప్రయత్నం చేసింది. కాని అద్దంకి దయకర్‌ గాలి వాటం నాయకుడు కాదు. అంతెందుకు కాంగ్రెస్‌ పార్టీలోనే ఆయన ఎదుర్కొన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. గత ఎన్నికల్లో చిరునవ్వుతో సీటు త్యాగం చేశారు. తన సొంత నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీకి గెలుపుకు కృషిచేశారు. ఆఖరు దశదాకా టికెట్‌ అద్దంకికే అని ప్రచారం జరిగినా, ఆఖరు నిమిషంలో ఆయనకు టికెట్‌ ద్కక్కపోయినా ఇబ్బంది పడలేదు. పార్టీ మీద అలగలేదు. నిరసన తెలియజేయలేదు. పైగా తెలంగాణ మొత్తం తిరిగి ఎన్నికల ప్రచారం చేశాడు. పార్టీని గెలిపించడంలో కీలకభూమిక పోషించారు. తర్వాత ఎమ్మెల్సీ వచ్చినట్లే వచ్చి చేజారి పోయింది. గత పార్లమెంటు ఎన్నికల్లో వరంగల్‌ నుంచి టికెట్‌ వస్తుందని ఆశించారు. టికెట్‌ కన్‌ఫర్మ్‌ అనుకునే క్షణంలో మళ్లీ నిరాశే ఎదురైంది. అయినా ఆయన కలత చెందలేదు. పార్టీ కోసం పనిచేస్తానని చెప్పాడు. తనకు ఇప్పటికే రెండుసార్లు పోటీ చేసే అవకాశం పార్టీ కల్పించింది. ఆ కృతజ్ఞత వుంది. తనకు పార్టీ ఎలాంటి పదవులు ఇవ్వకపోయినా పక్కకు జరిగేదిలేదు. పార్టీ మారే ప్రసక్తిలేదని పలుమార్లు చెప్పారు. ఆయనను అడుగడుగునా ఎవరు అడ్డుకుంటున్నారో ఆయనకుతెలుసు. ఎందుకు అడ్డుకుంటున్నారో తెలుసు. అయినా ఆయన ఏనాడు సహనం కోల్పోలేదు. ఆత్మవిశ్వాసం సన్నగిల్లలేదు. రాసి పెట్టి వుంటే అదే వస్తుందని నమ్మిన నాయకుడు. అవకాశం వచ్చినప్పుడు ప్రజలు ఆదరించేలేదు. ప్రజలు కూడా సానుభూతితో కోరుకుంటున్నప్పుడు పార్టీ సహకరించలేదు. ఎప్పటికైనా తనకు న్యాయం జరుగుతుందని నమ్మిన వ్యక్తి అద్దంకి దయకర్‌. అంతే కాకుండా ఒక్కసారి మాట ఇస్తే తప్పని నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. సమయం చూసి అద్దంకికి పదవి ఇప్పిస్తానని చెప్పారు. చెప్పినట్లే పదవి ఇప్పించారు.

ఇక బిఆర్‌ఎస్‌లో 2008 నుంచి బిఆర్‌ఎస్‌ పార్టీకి సేవలు చేస్తున్న నాయకుడు దాసోజు శ్రవణ్‌. మేదావి వర్గంలో ఒకడుగా పేరుపొందిన దాసోజు శ్రవణ్‌ తన రాజకీయాన్ని ప్రజారాజ్యాంతో మొదలు పెట్టారు. చిరంజీవి ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటుచేసిన ఆ పార్టీలో కీలక భూమిక పోషిస్తూ వచ్చారు. చిరంజీవి ముందు చెప్పిన సామాజిక న్యాయం, సామాజిక తెలంగాణ అనే నినాదంతో ఆ పార్టీలో చేరారు. అయితే 2009లో తెలంగాణ ప్రకటన వచ్చిన వెంటనే చిరంజీవి తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. తెలంగాణను వ్యతిరేకించారు. సమైక్య రాష్ట్రనినాదం అందుకున్నారు. ఆ సమయంలో దాసోజు శ్రవణ్‌ పార్టీని వదులుకున్నారు. అయితే ప్రజా రాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తున్న సందర్భంలో శ్రవణ్‌కు పదవి కల్పిస్తానని చిరంజీవి మాటిచ్చారు. దాసోజు రాజకీయ భవిష్యత్తు తాను చూసుకుంటానని చిరంజీవి చెప్పారు. కాని శ్రవణ్‌కు నచ్చలేదు. అయితే ఇక్కడ మరో విషయం వుంది. దాసోజు ప్రజారాజ్యంపార్టీలో చేరినప్పటికీ ఆయన మనసంతా కేసిఆర్‌ చుట్టే వుంది. కేసిఆర్‌ ప్రసంగాలు వింటూ ప్రభావితమయ్యారు. ఎలాగైనా తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకోవాలన్న ఆలోచనతోనే మొదటి నుంచి వున్నారు. కాకపోతే చిరంజీవి సామాజిక తెలంగాణ నినాదాన్ని శ్రవణ్‌ నమ్మారు. అందుకే ఆ పార్టీలో చేరారు. ఎప్పుడైతే చిరంజీవి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేయాలనుకున్నాడో అప్పుడే ఆయన బిఆర్‌ఎస్‌లో చేరారు. ఆయన చేరినప్పటి నుంచి కేసిఆర్‌కు ఎంతో సన్నిహితులయ్యారు. ఎక్కెగడప, దిగే గడప అన్నట్లు కేసిఆర్‌ డల్లీ వెళ్లిన ప్రతి సందర్భంలోనూ దాసోజు ఆయనతో వుండేవారు. ఇలా కేసిఆర్‌కు అంత్యంత సన్నిహితులలో ఒకడుగా మారారు. 2009 ఎన్నికల్లో సికింద్రాబాద్‌ పార్లమెంటు ఎన్నికల్లో ప్రజా రాజ్యం పార్టీతరుపున పోటీ చేసి ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో ఖైరతాబాద్‌ నుంచి పోటీచేయాలని అనుకున్నారు. కాని ఆయనకు టికెట్‌ దక్కలేదు. దాంతో ఆయన కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్‌లోనూ క్రియాశీలకంగా పనిచేశారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిపిసి అధ్యక్షుడయ్యాక శ్రవణ్‌ను దూరం పెడుతూ వచ్చారు. రేవంత్‌రెడ్డితో రాజకీయ విభేదాల కారణంగా ఆయన బిజేపిలో చేరారు. అక్కడి రాజకీయం ఆయనకు నచ్చలేదు. దాంతో తిరిగి బిఆర్‌ఎస్‌ గూటికి చేరుకున్నారు. 2023లోనే ఆయనకు కేసిఆర్‌ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. కాని అప్పటి గవర్నర్‌ తమిళ సై ఆ ఫైలు మీద సంకతం చేయకపోవడంతో ఆ ఎంపిక ప్రక్రియ ఆగిపోయింది. ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ ఓడిపోయింది. అప్పడు దక్కాల్సిన ఎమ్మెల్సీ పదవి వాయిదా పడిరది. ఆ సమయంలో అందాల్సిన ఎమ్మెల్సీలు ప్రభుత్వం మారడంతో కాంగ్రెస్‌ ఖాతాలోకి వెళ్లిపోయాయి. ఇప్పుడు మళ్లీ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా బిఆర్‌ఎస్‌ ఒకరిని ఎంపిక చేసే అవకాశం వచ్చింది. ఆ ఒక్కటి దాసోజు శ్రవన్‌ను వరించింది. నిజానికి 2014 వరకు కేసిఆర్‌తో వున్న దాసోజు ఎన్నికల ముందు పార్టీని వీడడం ఆయన చేసిన తొందరపాటు చర్య. ఎందుకంటే దాసోజు కన్నాముందు నుంచి బిఆర్‌ఎస్‌లో వున్న వారున్నారు. దాసోజుకన్నా ముందు నుంచి ఉద్యమం చేస్తున్నవారు అనేక మంది వున్నారు. 2001 నుంచి కేసిఆర్‌తో కొనసాగుతున్న వాళ్లున్నారు. అయినా దాసోజు బిఆర్‌ఎస్‌లో చేరినప్పటినుంచి కేసిఆర్‌ ఎంతో ప్రాదాన్యత కల్పించారు. ఆ నాడు దాసోజు తొందరపడకపోతే ఇప్పటికే ఆయన రాజకీయ భవిష్యత్తు మరోలా వుండేది. అటూ ఇటు తిరిగి వచ్చిన దాసోజుకు సత్వర న్యాయమే జరిగింది. ఎందుకంటే ఎర్రోళ్ల శ్రీనివాస్‌ లాంటి వారు పదవులు రాకుండా బిఆర్‌ఎస్‌లో దాసోజు కన్నా ముందునుంచే వున్నారు. అయినా దాసోజు అదృష్టవంతుడే అని చెప్పాలి. బిఆర్‌ఎస్‌ గొంతు వినిపించడంతో అందరికన్నా దాసోజు వుంటారని చెప్పడంలో సందేహం లేదు. ఎంత పెద్ద సమస్య అయినా సరే రాజకీయంగా ఎదుర్కొవడంలో, పార్టీకి అండగా వుండడంలో దాసోజు ముందుంటారని చెప్పడంలో అతిశయోక్తికాదు. ఆల్‌దిబెస్ట్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!