కేతకిలో ఘనంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవం
– భారీగా తరలి వచ్చిన భక్తులు – ప్రశాంతంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు
జహీరాబాద్. నేటి ధాత్రి:

మహాశివరాత్రి సందర్భంగా ఝరాసంగం మండల కేంద్రంలోని దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ కేతకి సంగమేశ్వర ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం అగ్నిగుండం ప్రవేశం, స్వామివారికి అభిషేకం, కుంకుమార్చన, రుద్రస్వాహకార హెూమము, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం శివపార్వతులకు కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. సాయంత్రం భక్తజనుల మధ్య స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కనీసం స్వామివారి కళ్యాణానికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించలేదు. ఇవన్నీ ఆలయం తరపున సమకూర్చుకున్నారు. కళ్యాణంలో పాల్గోన్న భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రత్యేకంగా మహిళలకు వాయినాలు అందజేశారు. రాత్రికి స్వామిఅమ్మవారల ఉత్సవ మూర్తులను విమానరథంలో బసవేశ్వర మందిరం వరకు ఊరేగించారు. కళ్యాణోత్సవంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమీషనర్ సులోచన, ఆలయ ఈఓ శివరుద్రప్పస్వామి, ఆలయ అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.