`తెగిన గాలిపటాలైపోయారు
`పిరాయింపు ఎమ్మెల్యేల విచిత్ర వైఖరి?
`జై కాంగ్రెస్ అనలేకపోతున్నారు
`బీఆర్‌ఎస్ ను నోటి నిండా తిట్టలేకపోతున్నారు
`కాంగ్రెస్ లో చేరినా బిఆర్‌ఎస్ పార్టీని ఉతికి ఆరేయలేకపోతున్నారు
`మరి కొందరు చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు
`రెండు వైపులా దారులు మూసుకుపోయే పరిస్థితి తెచ్చుకున్నారు
`అటు ఎన్నికలంటే భయం..ఇటు పదవీ గండం!
`కాంగ్రెస్‌కు దగ్గర కాలేక, దూరంగా వుండలేక సతమతమౌతున్నారు
`నియోజకవర్గాలలో కాంగ్రెస్ నాయకుల ఆదరణ లేదు
`నియోజకవర్గాలకు వెళ్తే జేజేలు కొట్టే వారు లేరు
`అడుగడుగునా అవమానాలు ఎదుర్కొంటున్నారు
`ఉప ఎన్నికలు వస్తే గెలుస్తామన్న విశ్వాసం కనిపించడం లేదు
`రాజీనామా చేసినా వెంటనే ఉప ఎన్నికలు వచ్చే పరిస్థితి లేదు
`ఆరు నెలల పాటు ప్రజల్లో వుంటూ ప్రచారం అంత సులువు కాదు
`ఏ రకంగా చూసినా కష్టకాలమే!
`సుప్రీం కోర్టు ఎమ్మెల్యేలను భర్తరఫ్ చేస్తే కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు ఇవ్వాలని రూలేం లేదు?
`ఇప్పుడు మళ్ళీ యూటర్న్ తీసుకున్నా కారుకే ప్రమాదం
`రెంటికీ చెడ్డ రేవడిగా మిగిలిపోతారు
`భవిష్యత్తు రాజకీయానికి తమకు తామే చరమగీతం పాడుకున్నారు
హైదరాబాద్,నేటిధాత్రి:
పిరాయింపులు ఎమ్మెల్యేలకు ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారింది. నిజానికి ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించలేదు. గతంలో ఎమ్మెల్యేలు పార్టీలు పిరాయించిన సందర్బాలు అనేకం వున్నాయి. అప్పుడు వారికి ఈ పరిస్దితి ఎదురుకాలేదు. కాని ఇప్పుడు ఎదురౌతున్న సమస్యతో పిరాయింపు దారులంతా తలలు పట్టుకుంటున్నారు. ఎరక్కపోయి వచ్చామా? తొందరపడ్డామా? అని మధనపడుతున్నారు. తెగిన గాలిపటాలైపోయే పరిస్దితి ఎదురుకానుందా? అన్న ఆందోళనలో వున్నారు. పైకి గంభీరంగా కనిపిస్తున్నా, లోలోన వారు పడుతున్న ఇబ్బందులు అంతా ఇంతా కాదు. అటు కాంగ్రెస్‌లో వున్నట్లు లేదు. ఇటు గెలిచిన పార్టీకి తిరిగి వెళ్లిపోయే పరిస్ధితి లేదు. రెంటికీ చెడిన రేవడిగా తమ రాజకీయం మారుతుందా? అని ఆందోళన చెందుతున్నారు. మూలుగుతున్న నక్కమీద తాటి పండు పడ్డట్టు సుప్రింకోర్టు నోటీసులు జారీ చేయడంతో వారి ఆందోళన మరింత ముదురుతోంది. ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసకోవాలో అర్ధం కాని పరిస్ధితి ఎదురౌతోంది. ఒక వేళ సుప్రింకోర్టులో ఊరట లభిస్తే అన్న చిరు ఆశతో వున్నారు. స్పీకర్ నిర్ణయంపై సుప్రింకోర్టు ఇప్పటికే కొన్ని ప్రశ్నలు సంధించింది. ఇంకా స్పీకర్‌కు సమయం ఇవ్వకపోవచ్చు. ఆ లోపు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే పరిస్ధితి ఎలా వుంటుందా? అన్న ఆలోచన కూడా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒక వేళ సుప్రింకోర్టు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తే ఆ ఎమ్మెల్యేలపై ప్రజల్లో మరింత తీవ్రత పెరుగుతుందని చెప్పడంలో సందేహం లేదు. కండువాలు మార్చినా జై కాంగ్రెస్ అనలేకపోతున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలకు దగ్గర కాలేకపోతున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు కొంత మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఆదరించడం లేదు. ముఖ్యంగా పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేగా అంగీకరించడానికి ఇష్టపడడం లేదు. అభివృద్ది పనులపై ఎమ్మెల్యే ఎక్కడికి వెళ్లినా కాంగ్రెస్ నాయకులే ఆయనను అడ్డుకుంటున్నారు. అలాంటి ఎమ్మెల్యే మీద అనర్హత వేటు పడితే ఇక కాంగ్రెస్ కూడా ఆయనను ఆదరించదు. ఆయనకు టికెట్ ఇవ్వదు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీచేసినా సరే కాంగ్రెస్ నాయకులు వినే పరిస్దితి వుండదు. ఎందుకంటే గెలిపించాల్సింది ప్రజలు, నాయకులు, కార్యకర్తలే. వారిని ఒత్తిడి తెచ్చి గూడెంకు మళ్లీ టికెట్ ఇచ్చి గెలిపించుకోవడం కుదిరేపని కాదు. కచ్చితంగా ఆయన స్ధానంలో మరొకరికి టికెట్ ఇవ్వకతప్పదు. కార్యకర్తలే తిరుగుబాటు చేస్తుంటే జై కాంగ్రెస్ అనలేకపోతున్నాడు. అలా అని బిఆర్‌ఎస్ మీద విమర్శలు చేయలేకపోతున్నాడు. సహజంగా పార్టీ మారిన తర్వాత ప్రత్యర్ధి పార్టీని టార్గెట్ చేయకుండా రాజకీయాలు చేస్తే ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సహించరు. గుంపులో చేరిన తర్వాత ఆ పార్టీ నినాదాలను అందుకోవాలి. కాని పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరూ అటు కేసిఆర్‌ను గాని, ఇటు ఇతర నాయకులపై గాని ఎలాంటి ఆరోపణలు చేయడం లేదు. పార్టీ మారడానికి తొలి అడుగు వేసిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే తొలి రోజుల్లో కొంత దూకుడు ప్రదర్శించాడు. సాక్ష్యాత్తు అసెంబ్లీలోనే బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై నోరు పారేసుకున్నారు. తర్వాత ఆయన కూడా బిఆర్‌ఎస్ మీద మాట్లాడేందుకు ముందుకు రావడం లేదు. అంతే కాదు ఇటీవల కాలంలో కేసిఆర్ గొప్ప నాయకుడు. భోళా శంకరుడు అంటూ కితాబిస్తున్నారు. బిఆర్‌ఎస్ నాయకులనేద్దేశించిన వ్యాఖ్యలపై కేటిఆర్‌ను కలిసి వివరణ కూడా దానం నాగేందర్ ఇచ్చుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇక హైడ్రా విషయంలో దానం నాగేందర్ తీవ్ర అసంతృప్తితో వున్నారు. కాంగ్రెస్‌లో చేరినా తన మాట చెల్లుబాటు కావడం లేదని మధనపడుతున్నాడు. బిఆర్‌ఎస్ నుంచి వచ్చి, సికింద్రాబాద్ ఎంపిగా పోటీ చేసి కాంగ్రెస్ కోసం త్యాగం చేస్తే తనను గుర్తించేవారు లేకుండాపోయారని అనుకుంటున్నారట. ఇదిలా వుంటే సుప్రింకోర్టు ఒక వేళ దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవిని భర్తరఫ్ చేస్తే రాజకీయ జీవితానికి పుల్ స్టాప్ పడినట్లే అని చెప్పకతప్పదు. పది మంది ఎమ్మెల్యేల భర్తరఫ్ జరిగితే మాత్రం టికెట్ రాని వారిలో దానం నాగేందరే మొదటి వ్యక్తి అవుతారని చెప్పడంలో సందేహం లేదు. సరే మంచో చెడో పార్టీ మారడం జరిగింది. పరిరిస్దితి చేయి దాటిపోయింది. కాంగ్రెస్ పార్టీలోనైనా పూర్తిగా కలిసిపోతున్నారా? అంటే అదీ లేదు. తమకు ఎలాంటి ప్రాదాన్యత లేకుండాపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నా బిఆర్‌ఎస్‌పై ఇప్పటి వరకు పల్లెత్తు మాట అనని నాయకులు మళ్లీ తమకు కారులో చోటు దక్కుతుందన్న ఆశతో వున్నట్లు కూడా చెప్పుకుంటున్నారు. అదే జరిగితే ప్రజలు కాంగ్రెస్‌కన్నా ముందు బిఆర్‌ఎస్‌నే చీదరించుకుంటారు. ఉప ఎన్నికలే వస్తే బిఆర్‌ఎస్‌కు ఒక్క సీటు కూడా రాదు. అప్పుడు బిజేపికి బంగారు పళ్లెంలో ఎమ్మెల్యేలను అందించినట్లౌవుంది. నిజం చెప్పాలంటే రెండు వైపులా దారులు మూస్తే తప్ప భవిష్యత్తులో ఇలా పార్టీ మారడానికి ఎమ్మెల్యేలు ముందుకు రారు. ప్రజా ప్రభుత్వాలను అసి ్దరపర్చాలనుకోవడం రాజకీయ పార్టీల అనైతిక రాజకీయాలకు పరాకాష్ట. అలాంటి రాజకీయాలను ఎవరూ సహించకూడదు. సమర్ధించకూడదు. పార్టీ మారారు.. కాంగ్రెస్‌లో ప్రాధాన్యత దక్కకపోయినా పదవి ఊడిపోకుండా వుంటే చాలని కోరుకుంటున్నారు. పొరపాటున ఉప ఎన్నికలు వస్తే మాత్రం పార్టీ మారిన ఎమ్మెల్యేలకు చుక్కలు చూడడం తప్పదు. ఎందుకంటే ఇప్పటికప్పుడు సమీపంలో ఎన్నికలు లేవు. ఓ ఆరు నెలల సమయంలో కేరళ రాష్ట్ర ఎన్నికలున్నాయి. అప్పటి వరకు ఉప ఎన్నికలు రాకపోవచ్చు. అప్పటి వరకు పార్టీ మారిన ఎమ్యెల్యేలు ప్రజల్లో వుండాలంటే దూల తీరిపోతుంది. ప్రజలు ఎన్నికల వాగ్ధానాల మీద నిలదీస్తుంటారు. మళ్లీ ఎన్నికల్లో పోటీ అంటూ వెళ్తే అడుగడుగునా సమాధానం చెప్పుకుంటూ పోవాల్సి వస్తుంది. ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పినా మొదటికే మోసం వస్తుంది. ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలే ఆదరించడం లేదు. ఇక ప్రజలు కూడా దూరం కొడితే వారి రాజకీయం శంకగిరి మాన్యాలే. ఆరు నెలల పాటు కార్యకర్తల సాధకబాధకాలు చూసుకోవాలి. ఎమ్మెల్యేగా వున్నప్పుడు నాయకులు, కార్యకర్తలు ఇంటి ముందు వచ్చి వాలుతారు. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేలే పార్టీ కార్యకర్తల ఇంటి ముందుకు వెళ్లాల్సిన పరిస్ధితి ఎదురౌతుంది. సరే ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడైనా మూడు నెలుల వుంటేనే ఊపిరి సలపకుండాపోతుంది. అలాంటిది ఆరు నెలల కాలమంటే ఇక ఎమ్మెల్యే అభ్యర్ధులు ఆస్దులమ్ముకొవాల్సిందే. రాజకీయాలు చేయాల్సిందే. వారి కష్టాలు తీర్చేవారు కూడా ఎవరూ వుండరు. ప్రజల్లో వుంటూ, ప్రజలకు సేవ చూస్తూ, వారి మాటల పడుతూ, అడుగడుగునా అవాంతరాలు ఎదుర్కొంటూ వెళ్లినా, ఆఖరు నిమిషంలో టికెట్ దక్కకపోతే ఆ బాధ ఊహిస్తేనే భయంకరంగా వుంటుంది. ఈ సంగతి వాళ్లకు కూడా తెలుసు. అయినా తప్పదు. తన నాయకత్వాన్ని రుజువు చేసుకోవాల్సి వుంటుంది. ప్రత్యర్ధి పార్టీలు నిత్యం వేసే నిందలను భరించాలి. ప్రజలను రెచ్చగొట్టి చేసే రాజకీయాలను ఎదుర్కొవాలి. ఎటు చూసినా మద్దెల వాయింపు తప్పదు. ఆరు నెలల పాటు కడుపు నిండా తిండి వుండదు. కంటి నిండా నిద్ర వుండదు. ఎప్పుడు ఏ సమస్య వచ్చి నెత్తి మీద పడుతుందో తెలియదు. ప్రజలు కూడా తమ సమస్యల పరిష్కారానికి వస్తే సమయం ఇవ్వకపోతే ప్రజల నుంచి ఎదురయ్యే వ్యతిరేకత మామూలుగా వుండదు. అసలే సోషల్ మీడియా కాలం. ఆ పది మంది ఎమ్మెల్యేల చుట్టూ నిత్యం వందలాది సోషల్ మీడియా ప్రతినిధులు వుంటారు. ఎమ్మెల్యేలను వెంటాడుతుంటారు. వారు ఎక్కడికెళ్లితే అక్కడికి వాలిపోతారు. ఎమ్మెల్యేల ఇంటి వద్ద కూడా కొంత మంది ఎప్పుడూ సిద్దంగా వుంటారు. ప్రతి నిమిషాన్ని వివాదం చేయడానికి సిద్దంగా వుంటారు. పిరాయింపు ఎమ్మెల్యేలు పొరపాటున ఎవరి మీద నైనా అసహనం వ్యక్తం చేసినా, ఆ ఎమ్మెల్యే మీద ప్రజలు ఏవైనా వ్యాఖ్యలు చేసినా ఇక సోషల్ మీడియాలో కనిపించే వాయింపు ఓ రేంజ్‌లో వుంటుంది. ఇన్ని రకాల అవరోధాలును ఎదుర్కొని, సమస్యల వలయాన్ని చేధించుకొని నిలిచేదెవరో..గెలిచేదెవరో.. చూడాలి.