కామారెడ్డి జిల్లా ప్రతినిధి నేటి ధాత్రి :
కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం బ్రహ్మాజీవాడ గ్రామంలో బుధవారం ప్రజా పాలన గ్రామసభ నిర్వహించారు. ఇందులో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు పథకాల కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. గత ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నవారు ఈ గ్రామ సభల్లోనూ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అర్హులైన వారి పేర్లు రానివారు ఆయా కౌంటర్లలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులు తీసుకోవడం నిరంతర ప్రక్రియ అని, గ్రామ సభల్లోనే కాకుండా ఎంపీడీవో కార్యాలయంలోని ప్రజాపాలన కౌంటర్ లో కూడా దరఖాస్తులు సమర్పించవచ్చని తెలిపారు. ఇప్పుడు సమర్పిస్తున్న దరఖాస్తులను పరిశీలించి, తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. గ్రామ సభల్లో చదివిన జాబితాలపై అభ్యంతరాలు, ఆక్షేపణలు, చేర్పులు ఉంటే పూర్తి వివరాలు గ్రామ సభలో తెలియజేయవచ్చని పేర్కొన్నారు. ఈ గ్రామసభలో మండల ప్రత్యేక అధికారి రాజారాం, మండల పరిషత్ అభివృద్ధి అధికారి సయ్యద్ సాజిద్ అలీ, పంచాయతీ కార్యదర్శి రేణుక, వ్యవసాయ అధికారి నర్సింలు, గ్రామస్తులు పాల్గొన్నారు.