నేడు ఏపీ పర్యటనకు రానున్న ప్రధాని నరేంద్రమోదీ
ఒడిషాలో ప్రవాసీ భారతీ దివస్‌ను ప్రారంభించనున్న ప్రధాని
విశాఖ వాసులకు నెరవేరిన రైల్వేజోన్ కల
స్టీల్ ప్లాంట్ రాజకీయాలు కనుమరుగు కాక తప్పదా?
ఇవన్నీ ఒకప్పుడు జగన్ ప్రభుత్వం సాధించినవే అంటున్న వైఎస్సార్సీపీ
సొమ్మొకడిది సోకొకడిది అంటూ విమర్శలు
ఇక ‘శంకుస్థాపన’ రాజకీయాలు షురూ!
కొత్త ప్రాజెక్టులతో ఆంధ్రులకు ఊరట
మూడోసారి ప్రధాని అయ్యాక నరేంద్రమోదీ మొదటిసారి బుధవారం (జనవరి 8)న విశాఖపట్ట ణం సందర్శించనున్నారు. నిజానికి ఆయన 8,9 తేదీల్లో ఆంధ్రప్రదేశ్, ఒరిస్సాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గంటారు. 9వ తేదీ ఉదయం భువనేశ్వర్‌లో ప్రధాని 18వ ప్రవాసీ భారతీయ దివస్‌ను ప్రారంభించనున్నారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లో ఆయన ఈసారి మౌలిక సదుపాయాలు, పారి శ్రామికాభివృద్ధి, సుస్థిరాభివృద్ధికి సంబంధించిన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో ప్రధానంగా చెప్పుకోవలసింది ఎన్.టి.పి.సి. గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్‌కు సంబంధించిన గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన. రూ.1,85,000 కోట్లతో ఈ ప్రాజెక్టును నిర్మాణం చేపడతారు. 20 గిగావాట్ల పునరుత్సాదక ఇంధన ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టు దేశంలోనే అతిపెద్దది. ముఖ్యంగా సమీకృత గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో ఇది దేశంలోనే అ గ్రస్థానం లో వుండగలదు. దీన్నుంచి 1500 టి.పి.డి. గ్రీన్ హైడ్రోజన్, 7500 గ్రీన్ హైడ్రోజన్ అనుబంధ ఉత్పాదకాలు ముఖ్యంగా గ్రీన్ మెథనాల్, గ్రీన్ యూరియా, సుస్థిరమైన ఏవియేషన్ ఇంధనంవంటివి కూడా ఉత్పత్తి అవుతాయి. ఈ ఉత్పత్తులన్నీ ఎగుమతుల మార్కెట్‌కు సంబంధించినవి కావడం విశేషం. 2030 నాటికి శిలాజేతర ఇంధన ఉత్పత్తి 500 గిగావాట్ల సామర్థ్యానికి చేరాలన్నది భారత్ సుస్థిరాభివృద్ధి లక్ష్యం. అంతేకాకుండా ప్రధాని నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్‌లో రూ.19500 కోట్ల విలువైన రైలు రోడ్లు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తా రు. సౌత్ కోస్ట్ రైల్వే హెడ్ క్వార్టర్స్‌కు విశాఖపట్టణంలో ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఆయన ప్రారంభించ బోయే ప్రాజెక్టులు ప్రధానంగా కిక్కిరిసినట్టు వున్న ఈ ప్రాంతాలను సువిశా లం చేయడం, ఇతర ప్రాంతాలతో దీనికి మరింత అనుసంధాన కల్పించడం, ప్రాంతీయ సామాజిక, ఆర్థికాభివృద్ధికి దోహదపడేవిగా ఈ ప్రాజెక్టులు వుండనున్నాయి.
అనకాపల్లి జిల్లాకు చెందిన నక్కపల్లి గ్రామంలో బల్క్ డ్రగ్ పార్క్‌ను కూడా ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఆరోగ్య సేవల్లో భాగంగా సామాన్యులకు అందుబాటు ధరల్లో ఔషధాలు అందు బాటులోకి తీసుకొని రావడం దీని ప్రధాన లక్ష్యం. అంతేకాదు ఈ పార్క్ ఏర్పాటు వల్ల ఈప్రాం తానికి చెందిన వేలాదిమందికి ఉపాధి కల్పన జరుగుతుంది. విశాఖపట్నం`చెన్నై పారిశ్రామిక నడవాకు సమీపంలో వుండటం వల్ల ఈ ప్రాంత ఆర్థికాభివృద్ధికి కూడా ఈ పార్క్ దోహదం చేయగలదు. అంతేకాదు విశాఖపట్నం`కాకినాడ పెట్రోలియం, రసాయనాలు మరియు పెట్రోరసాయన పెట్టుబడుల ప్రాంతానికి కూడా ఈ పార్క్ సమీపంలో వుండటం విశేషం. ఇన్ని సానుకూలతల దృష్ట్యా నక్కపల్లి ప్రాంతాన్ని బల్క్ డ్రగ్ ప్రాజెక్టు నిర్మాణానికి ఎంపిక చేసారు. వీటితో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, చెన్నై`బెంగళూరు పారిశ్రామిక కారిడార్ కింద తిరుపతి జిల్లాలో కృష్ణపట్నం పారిశ్రామిక ప్రాంతానికి (క్రిస్ సిటీ) కూడా శంకుస్థాపన చేయనున్నారు. జాతీయ పారి శ్రామిక కారిడార్ అభివృద్ధి కార్యక్రమం కింద, క్రిస్ సిటీ కీలక ప్రాజెక్టుగా రూపొందనుంది. ఈ ప్రాజెక్టు కింద దాదాపు రూ.10500 కోట్ల మేర తయారీ రంగ పెట్టుబడులను ఆకర్షించే అవకాశముందని అంచనా. ఈ ప్రాజెక్టు పూర్తయితే లక్షమందికి ప్రత్యక్ష ఉపాధి లభించడమే కాదు, ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి అవకాశాలు మరింతగా పెరిగి, ఆర్థికాభివృద్ధి సాధ్యం కాగలదు.
జనవరి 9న ప్రధాని నరేంద్రమోదీ, ఒడిషా రాజధాని భువనేశ్వర్‌లో 18వ ప్రవాస భారతీయ దివస్‌ను ప్రారంభించనున్నారు. ఇక్కడ జనవరి 8,9 తేదీల్లో ఒడిషా ప్రభుత్వ భాగస్వామ్యంతో రెండు రోజులపాటు ఈ సదస్సు జరుగనుంది. విదేశాల్లో వున్న భారతీయులు ఈ వేదిక వద్ద కలు సుకొని పరస్పరం పరిచయాలను, స్నేహసంబంధాలను పెంపొందించుకోవాలన్నది ఈ సదస్సు ప్రధాన లక్ష్యం. అంతేకాదు ఈ సదస్సు ఇతివృత్తం ‘వికసిత్ భారత్‌కు విదేశాల్లోని భారతీయుల సహకారం’. దాదాపు 50 దేశాల్లోని భారతీయులు ఈ సదస్సులో పాల్గనడానికి తమ పేర్లను నమోదు చేసుకోవడం విశేషం. ఇదే సమయంలో ప్రధాని నరేంద్రమోదీ ప్రవాస భారతీయులకో సం ఏర్పాటు చేసిన ప్రత్యేక పర్యాటక రైలు ‘ప్రవాసీ భారతీయ ఎక్స్‌ప్రెస్’ ను వర్చువల్ విధానం లో ప్రారంభించనున్నారు. ఈ రైలు హజరత్ నిజాముద్దీన్‌లో బయలుదేరి మూడు వారాలపాటు దేశంలోని వివిధ పర్యాటక ప్రదేశాలను చుట్టి వస్తుంది. ‘ప్రవాసీ తీర్థ దర్శన్ యోజన’ కింద ఈ ప్రవాసీ భారతీయ ఎక్స్‌ప్రెస్‌ను ప్రభుత్వం నడుపుతోంది.
వైఎస్‌ఆర్‌సీపీ విమర్శలు
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ చైతన్యం ఎక్కువ. ఒక్కొక్కసారి ఇది మితిమీరడం వల్ల రాష్ట్ర ప్రజలు నష్టపోయే సందర్భాలు కూడా ఎదురవుతాయి. ప్రధాని శంకుస్థాపనలు చేయనున్న విశాఖ రైల్వే జోన్, నక్కపల్లి బల్క్ డ్రగ్ ప్రాజెక్టు, ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్టులన్నీ వై.ఎస్.ఆర్.సి.పి. హయాంలో సాధించినవేనని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్‌పై నాటి ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో ప్రత్యేకంగా చర్చించి ఒప్పందానికి వచ్చేలా చూశారని, ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం దీన్ని తమ ఘనతగా చెప్పుకో వడం ‘సొమ్కొకడిది సోకొకడిది’ అన్న చందంగా వున్నదంటూ వారు విమర్శిస్తున్నారు. నిజానికి గత ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లోనే వీటికి శంకుస్థాపనలు చేయాల్సి వుండిరదని, ప్రధానికి సమయం కుదరలేదని, తర్వాత ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఇవేవీ సాధ్యంకాలేదని వా రు చెప్పే మాట! బల్క్ డ్రగ్ ప్రాజెక్టుకోసం 17 రాష్ట్రాలు పోటీపడితే దక్షిణ భారతదేశం నుంచి దీన్ని ఆంధ్రప్రదేశ్ సాధించిందన్న సంగతి వారు గుర్తుచేస్తున్నారు. రైల్వే జోన్‌కు వై.ఎస్.ఆర్.సి.పి ప్రభుత్వం భూములు ఇవ్వలేదనేది కూడా దుష్ప్రచారమేనని, 52 ఎకరాలు కేటాయిస్తూ గత ఏడాది జనవరిలోనే జీవీఎంసీ కమిషనర్ ఉత్తర్వులు ఇచ్చిన సంగతిని వారు ప్రస్తావిస్తున్నారు. మరి ఈ గొప్పంతా తమదేనని ప్రచారం చేసుకుంటున్న కూటమి ప్రభుత్వం, విశాఖ స్టీల్ ప్లాంట్ కు కర్ణాటక తరహాలో రూ.15వేల కోట్లు తేగలరా? అని ప్రశ్నిస్తున్నారు. ఇన్ని లక్షల కోట్ల విలు వైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయించగలగడం తమ ఘనతేనని అనుకున్నప్పుడు, స్టీల్ ప్లాంట్ విషయంలో మౌనమెందుకని వారు ప్రశ్నించారు. ప్రధాని నరేంద్రమోదీ చేసే శంకుస్థాపనల పుణ్యమాని స్టీల్ ప్లాంట్ రాజకీయం మరుగున పడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యం గా విశాఖ వాసుల రైల్వేజోన్ కల నెరవేరుతుండటంతో, ఈ ఉత్సాహంలో స్టీల్‌ప్లాంట్ వ్యవహారం ప్రజల మదిలోనుంచి క్రమంగా కనుమరుగైపోతుంది. స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రభుత్వంపై నెలకొన్న వ్యతిరేకతను కనుమరుగు చేయడానికి చంద్రబాబు ఈ శంకుస్థాపనల పర్వానికి తెరతీ శారని వాదించే వారి అభిప్రాయాన్ని వారికే వదిలేయడం మంచిది. ఇక ఈ శంకుస్థాపనల హోరులో స్టీల్ ప్లాంట్‌ను ఇక ఆంధ్రులు పట్టించుకోకపోవచ్చు.
నరేంద్రమోదీ రాష్ట్రానికి వచ్చి ఇన్ని మెగా ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తున్నారంటే అందుకు పవన్ కళ్యాణే కారణమని వాదించేవారు లేకపోలేదు. ఇక లోకేష్ విశాఖపట్నంలోనే మకాం వేసి ప్రధాని పర్యటనను నభూతో నభవిష్యతి అన్న రీతిలో విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నారు. బహుశా గతంలో తెలంగాణలో భారాసా ప్రభుత్వ హయాంలో ప్రధాని హైదరాబద్‌కు వచ్చి మెట్రోరైలు ప్రారంభించిన సమయంలో కేటీఆర్ హైలైట్‌గా నిలిచారు. అదేమాదిరిగా ఇప్పుడు ప్రధాని పర్యటనను తన ఎలివేషన్‌కు ఉపయోగించుకోవాలని లోకేష్ భావిస్తుండవచ్చు. ఇందులో తప్పు లేదు.ఇకపోతే మరో గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే ఇంతటి మెగా ప్రాజెక్టులు ఆకస్మికంగా మంజూరు కావనేది ప్రతి ఒక్కరికీ తెలిసిన సత్యమే. ఇందుకోసం ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల కృషి అపరిమితంగా వుంటుంది. అంతేకాదు ఇందుకోసం ఎన్నో చర్చలు, అనుమానాల నివృత్తులు, పెట్టుబడి అంచనాలు, ఒప్పందాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారం వంటి అనేక అంశా లు ఇమిడి వుంటాయి. ఒక ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమాలు చేపట్టి మధ్యలో వుండగానే, ఎన్నికల్లో ఓటమి పాలైతే, ఈ ప్రాజెక్టులను తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లక తప్పదు. హైదరాబాద్‌కు ఐ.టి. క్యారిడార్‌ను పి.వి. నరసింహారావు హయాంలో కేటా యిస్తే హైటెక్ సిటీ డిజైన్ రూపొందించి, శంకుస్థాపన చేసింది నేదురుమిల్లి జనార్థన రెడ్డి ముఖ్య మంత్రిగా వున్న కాంగ్రెస్ ప్రభుత్వం. తర్వాత ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలై, తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. ఈ ప్రాజెక్టును కొనసాగించి తెలుగుదేశం ప్రభుత్వం మరింత ముందుకు తీసుకెళ్లింది. ఘనత చంద్రబాబుకు దక్కింది. నిజానికి ప్రాజెక్టును ప్రారంభించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రచారహోరులో కాంగ్రెస్‌కు ఆ క్రెడిట్ దక్కలేదు! ఇప్పుడు కూడా అంతే!