https://epaper.netidhatri.com/view/448/netidhathri-e-paper-4th-dec-2024
ఉద్యోగులా…వ్యవస్థకు పట్టిన చీడ పురుగులా?
పరాన్న బుక్కులై సమాజాన్ని పీల్చి పిప్పిచేస్తారా?
వ్యవస్థకు పట్టిన గ్రహణాలు..ప్రజల పాలిట శని గ్రహాలు.
పదేళ్లలలో పది తరాలకు సరిపడ ఆస్థులా!
ఉద్యోగంలో చేరి పదేళ్లు కూడా కాని వారి ఆస్థులు వందల కోట్లా!
కింది స్థాయి అధికారుల సంతకాల విలువ వందల కోట్లా!
వారికి సహకరించిన పై స్థాయి వాళ్లు వేల కోట్లు వెనకేసుకున్నట్లేనా!
ఏఈఈ సంపాదనే వందల కోట్లు దాటితే!
అతనికి సహకరించిన పై స్థాయి అధికారుల ఆస్థులు ఎన్ని కావాలి!
కింది నుంచి పై స్థాయి వరకు ఈ పంపకాలు ఎన్ని వేల కోట్లు దాటి వుండాలి!
తెలంగాణ రాష్ట్రములోని అవినీతి ఉన్నతాధికారుల ఆస్థులు ఎన్ని లక్షల కోట్లు కావాలి!
ఏఈఈ నటేష్ తోనే విచారణతో వదిలేస్తారా!
అన్ని స్థాయిలలో అధికారుల ఆస్థులును ఆరాతీస్తారా!
రెరా విషయంలో అదే చేశారు!
బాలకృష్ణ తర్వాత ఇంత వరకు ఎవరి ఆస్థులు బయటకు రాలేదు!
ఇరిగేషన్ లోనూ అదే కొనసాగిస్తారా!
రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల అవినీతి కనిపించడం లేదా!
వందల కోట్ల భూ బదలాయింపుల లావాదేవీలు చూడడం లేదా!
రంగారెడ్డి జిల్లాలో ఇటీవల వందల కోట్ల రూపాయల భూములు చేతులు మారలేదా!
పై స్థాయి వాళ్లను విచారించాల్సిన అవసరం లేదా?
పదేళ్లలో రిజిస్ట్రేషన్ శాఖలో జరుగిన అవినీతి వెలికితీయరా?
జిహెచ్ఎంసి లో అవినీతి అధికారులపై చర్యలు వుండవా?
వారి ఆస్థులు జప్తు చేయరా?
శివారు మున్సిపాలిటీ ఇంజనీరింగ్ విభాగాల అవినీతి కనిపించడం లేదా?
హైదరాబాద్,నేటిధాత్రి:
అధికారులా…రాబందులా!? లంచాలకు అలవాటు పడి మనుషులమే అన్న సంగతి మర్చిపోతున్నారా! రాబందులు ఆకలి తీర్చుకోవడం కోసమే వాలిపోతాయి. కళేబరాలను మాత్రమే పీక్కుతింటాయి. కానీ అధికారల అవతారంలో వున్న కొంతమంది అధికారులు లంచాల రూపంలో ప్రజలను పీక్కుతింటున్నారు. ప్రభుత్వానికి ప్రజలు చెల్లించే పన్నులతో జీతాలు తీసుకుంటూ, అదే ప్రజలను పీక్కుతింటున్నారు. ప్రజలకు సేవ చేయాల్సిన ఉద్యోగులు సమాజం మీద పెత్తనం చేస్తున్నారు. ప్రజలను పీడిరచుకుతింటున్నారు. రూపాయి కోసం దిగజారి బతుకుతున్నారు. ప్రజల కన్నీళ్లకు కూడా తాగుతున్నారు. వారి శాపనార్థాలను కూడా లెక్క చేయకుండా సొమ్ము చేసుకుంటున్నారు. మానవ సమాజంలో పరాన్న జీవులౌతున్నారు. అవినీతి వైరస్లు మారి ప్రజల రక్తం తాగుతున్నారు. అలాంటి వాళ్లు ఉద్యోగుల ముసుగులో వుండి, వ్యవస్థకు పట్టిన చీడ పురుగుల్లా మారిపోయారు. పెండల పురుగుల్లా అవినీతి సంపాదన కోసం బతుకుతున్నారు. సమాజమంతా చీ చీ అంటున్నా! తల తిప్పుకుంటూ పోతున్నారు! తూ తూ అని తిడుతున్నా తుడుచుకుంటున్నారు. ఎంగిలి మెతుకులకు ఆశపడి బతుకుతున్నారు. ఎంగికి కూడు కోసం ఎంతకైనా దిగజారిపోతున్నారు. కాసుల కోసం లాలూచి పడిపోయి, మనుషులమన్నది మర్చిపోతున్నారు. పరాన్న బుక్కులై సమాజాన్ని పీల్చి పిప్పిచేస్తున్నారు. వ్యవస్థకు పట్టిన గ్రహణాలౌతున్నారు..ప్రజల పాలిట శని గ్రహాలుగా తయారౌతున్నారు. ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఒక సగటు ఉద్యోగి పదేళ్లలలో పది తరాలకు సరిపడ ఆస్థులు సంపాదించుకోవడమా? ఒక వ్యాపారి నిద్రాహారాలు మాని, ఎప్పుడు తింటున్నామో! ఎక్కడ నిద్ర పోతున్నామో! తెలియక కంటి మీద కునుకులేని జీవితాలు గడుపుతున్నారు. కష్టపడి సంపాదించాలని జీవిత పోరాటం చేస్తున్నారు. బతకడానికి ఒక రైతు ఆరుగాలం శ్రమిస్తున్నాడు. నోట్లోకి నాలుగు వేళ్లు పోవడానికి నానా యాతన పడుతున్నాడు.
పెట్టుబడి పెట్టి ప్రకృతికి ఎదురెళ్లుతున్నాడు. బతకులీడుస్తున్నాడు. నిత్యం కష్టం చేస్తున్నాడు. ఇలా సమాజంలో ఎవరి పని వారు చేసుకుంటున్నారు. కానీ ఒక్క ఉద్యోగులు మాత్రమే వీళ్లందరి పొట్టగొట్టి బతుకుతున్నారు. ఒక ఇరిగేషన్ శాఖ ఏఈఈ స్థాయి అధికారి ఉద్యోగంలో చేరి పదేళ్లు కూడా కాని వారి ఆస్థులు వందల కోట్లు సంపాదించడం అంటే ఏమిటి? జీతం ఎప్పుడు పడుతుందా? అని ఎదురుచూడాల్సిన ఉద్యోగి, జీతానికి వందల రెట్లు నెల రోజుల్లో సంపాదిస్తున్నాడా? ఒక్క సంతకంతో లక్షలు, కోట్లు కొల్లగొడుతున్నాడా! ఏ ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయాలో వాటి ఉల్లంఘనలకు పాల్పడడం ఏమిటి? ప్రభుత్వ భూములు కాపాడాల్సిన వ్యక్తి ఇతరులకు అప్పనంగా దోచి పెట్టడమేమిటి! హైదరాబాదు లో ఇరిగేషన్ శాఖలో ఏఈఈ నటేష్ సంపాదనే వెయ్యి కోట్లుగా తేలుతుంటే, పై స్థాయి అధికారుల సంపాదన ఎంత వుండాలి? వారికి ఎంత ముట్టి వుండాలి! వాళ్ల ఆస్థులు ఎవరు గుర్తించాలి! కింది స్థాయి అధికారుల సంతకాల విలువ వందల కోట్లా! వారికి సహకరించిన పై స్థాయి వాళ్లు చేసిన సంతకాలతో వేల కోట్లు వెనకేసుకున్నట్లేనా!? ఏఈఈ సంపాదనే వందల కోట్లు దాటినట్లు లెక్కలు తేలుతుంటే, అతనికి సహకరించిన పై స్థాయి అధికారుల ఆస్థుల విలువ ఎన్ని వేల కోట్లు అవుతాయి! కింది నుంచి పై స్థాయి వరకు ఈ పంపకాలు ఎన్ని వేల కోట్లు దాటి వుండాలి! మొత్తంగా తెలంగాణ రాష్ట్రములోని అవినీతి ఉన్నతాధికారుల ఆస్థులు ఎన్ని లక్షల కోట్లు కావాలి! ఈ లెక్కలు వేయడానికి, అవినీతి వాధికారుల భరతం పట్టడానికి పాలకులకు తీరిక వుండదు? ఒక రకంగా చెప్పాలంటే చేతకాదు! అయితే కనీసం అడ్డంగా దొరికిన నటేష్ ను అవినీతికి ప్రోత్సాహించిన శాఖ పెద్దలెవరు? ఎంత మంది వున్నారు. వాళ్లకెంతెంత ఏఏ సమయాల్లో ముడుపులు ముట్టాయన్నది తేల్చుతారా? లేక ఏఈఈ నటేష్ తోనే విచారణతో వదిలేస్తారా! అన్న ప్రశ్నలకు సమాధానాలు ఎవరు చెప్పాలి. ఇరిగేషన్ శాఖలో అన్ని స్థాయిలలో అధికారుల ఆస్థులును ఆరాతీస్తారా! ఇక్కడితో వదిలేస్తారా? అన్నది చూడాలి. ఎందుకంటే గతంలో రెరా విషయంలో అదే చేశారు! బాలకృష్ణ తర్వాత ఇంత వరకు ఎవరి ఆస్థులు బయటకు రాలేదు! అసలు హెచ్‌ఎండిలో ఏం జరిగిందనేదానిపై మళ్ళీ ఎలాంటి హడావుడి లేదు. ఇతర ఉద్యోగుల విషయంలో ఎలాంటి విషయాలు బయటకు రాలేదు. ఇరిగేషన్ లోనూ అదే కొనసాగిస్తారా! అన్న అనుమానాలే వ్యక్తమౌతున్నాయి.
ఇదిలా వుంటే రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల అవినీతి విచ్చలవిడిగా జరుగుతోంది? వందల కోట్ల భూ బదలాయింపుల లావాదేవీలు వెలుగు చూస్తూనే వున్నాయి. రంగారెడ్డి జిల్లాలో ఇటీవల వందల కోట్ల రూపాయల భూములు చేతులు మారిన సందర్భాలున్నాయి. కింది స్థాయి అధికారులను అరెస్టు చేసి చేతులు దులుపున్నారు. పై స్థాయి వాళ్లను విచారించాల్సిన అంశాన్ని విస్మరించారు. రంగారెడ్డి జిల్లా డిఆర్‌పై అనేక అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఆ శాఖ పెద్దలే ఆయనను తప్పించారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. రిజిస్ట్రేషన్ల శాఖలో గత పదేళ్ల కాలంలో అంతులేని అవినీతి చోటు చేసుకున్నదన్న సంగతి అందరికీ తెలిసిందే. పదేళ్లలో రిజిస్ట్రేషన్ శాఖలో జరుగిన అవినీతి వెలికితీస్తారా? ఇక జిహెచ్ఎంసిలో జరిగిన అవినీతి బాగోతాల చిట్టా చాంతాడంత వుంది. కానీ పట్టించుకున్న వాళ్లు లేరు. జిహెచ్ఎంసి లో అవినీతి అధికారులపై చర్యలు వుండవా? వారి చర్యలు పెద్దగా లేవు. శివారు మున్సిపాలిటీల మాయా జాలం అంతా ఇంతా కాదు. ఏసిబికి చిక్కిన ఇంజనీరింగ్ అధికారులు మళ్ళీ పోస్టింగ్లలోకి రావడం పరిపాటి అయింది. పైగా ఎక్కడ ఉద్యోగం పోగొట్టుకున్నారో అక్కడికే ప్రమోషన్ల మీద వచ్చి ఉద్యోగాలు వెలగబెడుతున్నారు. గతం కన్నా ఎక్కువగా మరింత అవినీతికి పాల్పడుతున్నారు.
ఒకప్పుడు ఎమ్మార్వో స్థాయి అధికారులు ఓ స్కూటర్ మీద కార్యాలయానికి వస్తే అదే గొప్ప. ఇప్పుడు అత్యంత ఖరీదైన కార్లలో షికార్లు చేస్తున్నారు. జిల్లాలలో ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా హైదరాబాద్‌లో విలాసవంతమైన, అతి ఖరీదైన విల్లాలు కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలలో సగటు ఉద్యోగులు కూడా హైదరాబాద్‌లో సొంత ఇల్లు, నగర శివార్లలో ఫామ్ హౌజ్‌లు కొనుగోలు చేస్తున్నారు. ఉద్యోగం వచ్చే వరకు ఉద్యోగం వస్తే చాలు. జీవితం హాయిగా గడిస్తే చాలు. లైఫ్ సెటిలైనట్లే అనుకునే కాలం పోయింది. ఉద్యోగం సంపాదించుకుంటే చాలు. తరతరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్థులు సంపాదించుకోవచ్చే దోరణి పెరుగుతోంది. గతంలో ఉద్యోగం చేసుకోవడమా! వ్యాపారం చేసుకోవడమా!! అన్న ఆలోచన వచ్చినప్పుడు లగ్జరీగా బతకాలంటే వ్యాపారమే మేలు అనుకునే వారు. గొర్రె తోక బెత్తెడు జీతంతో మధ్య తరగతి జీవితం తప్ప ఏ ముంటుంది అనుకునే వారు. కానీ ఇప్పుడు ఎంతటి కోటీశ్వరుడైనా, వేల కోట్ల సంపాదనా పరుడైనా మన ముందు చేతులు కట్టుకొని నిలబడే ఉద్యోగం వుంటే చాలు. కనుసైగతో కాలం గడుస్తుంది. ఒక్క సంతకంతో జీవితం మారిపోతుంది అనుకుంటున్నారు. ఒకప్పుడు రాజకీయ నాయకుల సంపాదనల మీద లెక్కలు కడుతుండే వారు. ఇప్పుడు కొన్ని డిపార్ట్మెంట్లలో పని చేసే కింది స్థాయి ఉద్యోగుల సంపాదన ముందు నాయకుల ఆస్థులు ఈకలు కూడా కాలేకపోతున్నాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో వచ్చిన ఊపు ఉద్యోగులను తోపులను చేశాయి. అందుకు ఆ శాఖ, ఈ శాఖ అన్న తేడా లేదు. చైన్ సిస్టంలా ఒక శాఖ నుంచి మరో శాఖ అనుమతుల పుణ్యమా అని శాఖలన్నింటి ఉద్యోగులకు లంచాలు కల్పతరువుగా మారిపోయాయి. వ్యాపారులు ఉద్యోగులకు మహా రాజపోషకులుగా మారిపోయారు. అధికారులను ఎప్పటికప్పుడు ప్రసన్నం చేసుకోవడానికి ఉద్యోగులకు ఏటియం లుగా మారిపోయారు. ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగి అంటే సాదా సీదాగా వుండేవారు. ఇప్పుడు అధికారం, దర్పం, దర్జా వెలగబెడుతున్నారు. వారి ఆహార్యాన్ని చూపించి కూడా లంచాల విలువ పెంచుకుంటున్నారు.