
రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారమే ప్రమోషన్లు
లాభాల వాటా దీపావళి బోనస్ గతం కంటే పెరిగే విధంగా కృషి.
ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్
భూపాలపల్లి నేటిధాత్రి
రాజకీయంగా మిత్రపక్షంగా ఉన్నప్పటికైనా కార్మిక అభ్యున్నతే లక్ష్యంగా ఏఐటీయూసీ పనిచేస్తుందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ అన్నారు. శుక్రవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఏఐటీయూసీ కొమురయ్య భవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రాజ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. సింగరేణిలో రాజకీయ జోక్యం గత ప్రభుత్వంలో ఎక్కువైందని ఎన్నికల విషయంలో కోర్టుకు వెళ్లి సింగరేణిలో ఎన్నికలు పెట్టే విధంగా ఏఐటీయూసీ కృషి చేసిందని పేర్కొన్నారు. గుర్తింపు సంఘంగా గెలిచి కార్మికుల సమస్యలు దృష్టిలో ఉంచుకొని రెండు సంవత్సరాల గుర్తింపు సంఘంగా ఈనెల తొమ్మిదిన హైదరాబాదులో అగ్రిమెంట్ పత్రం తీసుకోవడం జరిగిందని, దాన్ని యాజమాన్యంతో మాట్లాడి నాలుగు సంవత్సరాలకు పెంచే విధంగా చూస్తామని తెలిపారు. కార్మిక సమస్యలు పరిష్కరించడానికి రెండేళ్ల కాల పరిమితి సరిపోదని ఆ కాలం పరిమితిని పెంచే విధంగా చర్యలు చేపడతామని అన్నారు. మిత్రపక్షాల సంఘాలు గతంలో టీబీజీకేఎస్ 13 సంవత్సరాలు పాలించిందని అప్పుడు గుర్తుకు రాలేదా అని సూటిగా ప్రశ్నించారు. గుర్తింపు పత్రం అందజేయడంలో యాజమాన్యం తప్పిదమేనని గుర్తింపు సంఘం పత్రం లేకపోవడం వల్ల స్ట్రక్చర్ మీటింగ్ లు జరగకుండా కార్మిక సమస్యలు అనేకం పెండింగ్ లో ఉన్నాయని వాటిని పరిష్కరించడమే ధ్యేయంగా ముందుకు పోతామని తెలిపారు. అదేవిధంగా లాభాల వాటా దసరా దీపావళి బోనసులపై మారుపేర్ల ను వన్ టైం సెటిల్మెంట్ గా సరిచేయడం కోసం త్వరలోనే సింగరేణి యాజమాన్యాన్ని కలిసి గతం కంటే మెరుగైన లాభాల బాట వచ్చే విధంగా ముఖ్యమంత్రిని కలవడం జరుగుతుందని వివరించారు. గుర్తింపు సంఘంగా గెలిచిన నుండి రెండు సమస్యలను ఇప్పటికే పరిష్కారం చేయడం జరిగిందని అందులో సింగరేణి స్కూల్లలో సిబిఎస్ సిలబస్, బదిలీ వర్కర్స్ ప్రమోషన్ లను అమలు సాధించడం జరిగిందని తెలిపారు. భూపాలపల్లి ఏరియాలో 693 ప్రమోషన్లు వచ్చాయని ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం అమలు చేస్తామని వివరించారు. అన్ని రకాల కులాలకు న్యాయం జరిగే విధంగా చట్ట ప్రకారం అమలు చేస్తామని పేర్కొన్నారు. సింగరేణి కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచే విధంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని పేర్కొన్నారు. కార్మికులకు ఇచ్చిన మాట ప్రకారం వారి సంక్షేమమే ధ్యేయంగా గుర్తింపు సంఘం గా పని చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ భూపాలపల్లి బ్రాంచ్ కార్యదర్శి మోట పలుకుల రమేష్, అసిస్టెంట్ బ్రాంచ్ కార్యదర్శి మాతంగి రామచందర్, నూకల చంద్రమౌళి, చంద్రయ్య, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.