https://epaper.netidhatri.com/view/290/netidhathri-e-paper-11th-june-2024%09/2
వైద్యం… పేదల సొమ్ము హారతి కర్పూరం!
`‘‘ప్రజల రక్తం’’…ఆసుపత్రులకు నైవేద్యం
`వైద్యమంటే హైదరాబాదేనా!
`సర్వరోగ నివారిణి హైదరాబాద్‌లోనేనా!
`జిల్లాలనుంచి నిత్యం ఎన్ని వందల మంది అత్యవసర చికిత్స కోసం వస్తున్నారో తెలుసా?
`నిత్యం వైద్యం పేరుతో ఎన్ని కోట్ల వ్యాపారం జరుగుతుందో అర్థమౌతుందా!
`అన్నింటికీ హైదరాబాదేనా!
`జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఏం చేస్తున్నట్లు?
`ఉమ్మడి జిల్లాల్లో వున్న వందల ఆసుపత్రుల్లో ఏం వైద్యం చేస్తున్నట్లు?
`జిల్లాకో మెడికల్ కాలేజీ ఎందుకు పెట్టినట్లు!
`వరంగల్ లాంటి నగరాలలో కూడా మెరుగైన వైద్యం ఎందుకు అందడం లేదు!
`సరైన వైద్యం అందకున్నా జిల్లాల్లో లక్షలకు లక్షలు ఎందుకు వసూలు చేస్తున్నట్లు!
`ప్రభుత్వాసుపత్రులు ఎందుకు?
`ప్రైవేటు మెడికల్ కాలేజీలు వున్నదెందుకు?
`నిమ్స్ వుండగా ప్రైవేటులెందుకు?
`ఎలాంటి సమస్యకైనా యశోదలే ఎందుకు?
`ప్రజల ఆరోగ్యాలతో ఆటలెందుకు?
`ఆరోగ్యశ్రీల పథకాలతో ప్రైవేటుకు దోచిపెట్టడమెందుకు?
`అదే చదువు…అదే వైద్యం… ప్రభుత్వాసుపత్రుల్లో ఎందుకు జరగదు!
`ప్రభుత్వ వైద్యం బలోపేతం చేయరెందుకు!
`ప్రభుత్వాసుత్రుల్లో నాయకులు వైద్యమెందుకు చేయించుకోరు!
`ప్రైవేటు హెల్త్ ఇన్యూరెన్సుల మోసాలపై ప్రభుత్వాలు స్పందించవెందుకు?
హైదరాబాద్ వైద్యంలో సర్వరోగ నివారిణా!
తెలంగాణలోని ఏ మారుమూల ప్రాంతం నుంచైనా వైద్యం కోసం హైదరాబాద్ రావాల్సిందేనా! తెలంగాణలోని ఉమ్మడి జిల్లాలలో కొన్ని వందల ఆసుపత్రులున్నాయి. కొత్తగా ఏర్పడిన జిల్లాలలోనూ పదుల సంఖ్యలో ప్రైవేటు ఆసుపత్రులున్నాయి. ఉమ్మడి జిల్లాలే కాకుండా, కొత్త జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులున్నాయి. వీటికి తోడు కొత్త జిల్లా కేంద్రాలలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలున్నాయి. ప్రైవేటు మెడికల్ కాలేజీలు అదనం. ఇన్ని ఆసుపత్రులు తెలంగాణ వ్యాప్తంగా వున్నప్పటికి ఆక్సిడెంట్లు జరిగి ప్రభుత్వాసుపత్రులకు వెళ్లిన వారిని వెంటనే హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికో, ఉస్మానియాకో, పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులకో రిఫర్ చేసి చేతులు దులుపుకుంటారు. ఇక అత్యవసర కేసుల విషయంలో జిల్లా ఆసుపత్రులలో గంటలో హైదరాబాద్ తీసుకెళ్తేనే ప్రాణాలు నిలుస్తాయని భయపెట్టిస్తారు. నిత్యం తెలంగాణ జిల్లాల నుంచి కుయ్ కుయ్ అంటూ కొన్ని వందల అంబులెన్స్‌లు హైదరాబాద్ వస్తాయి.
వరంగల్ జిల్లా కేంద్రంలో ఎంజిఎం ఆసుపత్రి వుంది. మెడికల్ కాలేజ్ వుంది. ప్రైవేటు మెడికల్ కాలేజీలున్నాయి. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అనేకం వున్నాయి. అయినా అనారోగ్యంతో వచ్చే వారి ప్రాణాలకు గ్యారెంటీ లేదు.
వైద్యమా..కాసుల పైత్యమా! ప్రైవేటు వైద్యమంటేనే ప్రజలు హడలెత్తిపోతున్నారు. రోగమొస్తే వైద్యమెలా? అని కంగారుపడుతున్నారు. ఆందోళన చెందుతున్నారు. ఎన్నికలెప్పుడొచ్చినా రాజకీయ పార్టీలు ముందుగా చెప్పే మాటలు విచిత్రంగా వుంటాయి. ఎప్పుడూ ప్రజలను మోసం చేస్తూనే వుంటాయి. దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా హెల్త్ పాలసీలు తీసుకుంటారు. రకరకాల ప్రైవేటు కంపెనీలు కూడా పాలసీలు అమలు చేస్తున్నాయి. కానీ గ్రామీణ ప్రాంతాల ప్రజలు హెల్త్ పాలసీలు చెల్లించుకోలేరు. అది ఆ ప్రజల్లో చైతన్యం లేకనో, వారికి అవగాహన లేకనో కాదు. కానీ ఆ సమయానికి వారికి అర్థిక స్థోమత చాలక…వేల రూపాయలు పాలసీ కంపెనీలకు చెల్లించలేక సతమతమౌతుంటారు. అందుకే ఎల్ఐసీ లాంటి జీవత భీమాలను చెల్లించే ప్రజలు హెల్త్ స్కీములు చెల్లించుకోలేరు. అది వారి బలహీనత కాదు, జీవితం మీద భరోసా లేక..ఎందుకంటే ఎల్ఐసీ లాంటి పాలసీల వల్ల ఆఖరుకు లాభమే…తమ కుటుంబాలకు అర్థిక తోడ్పాటు వుంటుందన్న నమ్మకం. అదే హెల్త్ ఇన్సూరెన్స్‌లు చెల్లించడం వారికి తలకు మించిన భారం. ఇదిలా వుంటే విద్య, వైద్యం గురించి ఎన్నికల సమయంలో ఊక దంపుడు ముచ్చట్లు చెప్పే రాజకీయ పార్టీలు గెలిచాక ప్రజల ఆరోగ్యాలను గాలికి వదిలేయడం అలవాటు చేసుకున్నారు. ప్రజలు కూడా ప్రశ్నించడం మానేశారు. ప్రభుత్వాల అలసత్వం, నిర్లక్ష్యం, ప్రైవేటు ఆసుపత్రులకు దాచిపెట్టడం అలవాటు చేసుకున్నారు. ప్రభుత్వాలను ప్రైవేటు ఆసుపత్రులు బ్లాక్ మెయిల్ చేయడం నేర్చుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భవ అంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య శ్రీ అంటోంది. గత ఇరవై సంవత్సరాలుగా ఆరోగ్య శ్రీ అమలౌతోంది. ప్రజల ఆరోగ్యాలు మెరుగౌతున్నాయా? ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యం ఉచితంగా పూర్తి స్థాయిలో అందుతోందా? ప్రైవేటు ఆసుపత్రులు ఆరోగ్య శ్రీ కాకుండా లక్షల రూపాయలు అదనంగా వసూలు చేయడం లేదా? అయినా ప్రజలు ప్రాణాలు తోడేయ్యడం లేదా? ప్రజల సొమ్ము పోయి, ప్రభుత్వ సొమ్ము తీసుకొని ఎంత మంది ప్రాణాలు కాపాడుతున్నారు. లెక్కలు చూస్తే భయంకరమైన నిజాలు వెలుగులోకి వస్తాయి.
వైద్యం… పేదల సొమ్ము హారతి కర్పూరం!
వైద్యం కోసం ఆసుపత్రికి వస్తే చాలు ప్రజల సొమ్ము హరతి కర్పూరమే. ప్రజల రక్తం తాగుతున్నారు. అయినా ప్రభుత్వాలు స్పందచడం లేదు. ఎందుకంటే రాజకీయ పార్టీలకు కూడా కార్పొరేట్ ఆసుపత్రులు కోట్లాది రూపాయలు ఫండ్స్ ఇస్తున్నాయి.
ప్రైవేటు ఆసుపత్రులు ప్రజల రక్తం తాగుతున్నాయి. ప్రజలు కష్టపడి సంపాదించుకున్న సొమ్ము చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో వచ్చిన వారిని కూడా టెస్టుల పేరుతో సగం దోచేస్తున్నారు. వైద్యం పేరుతో..ఆసుపత్రులు ప్రజల సొమ్మును నైవేద్యం చేసుకుంటున్నారు. నిత్యం వైద్యం పేరుతో నియోజకవర్గ స్థాయి నుంచి హైదరాబాద్ కార్పొరేట్ ఆసుపత్రుల దాకా ఎన్ని కోట్ల వ్యాపారం జరుగుతుందో అర్థమౌతుందా!
ప్రభుత్వాలు ఆరా తీస్తున్నాయా?
జిల్లాకో మెడికల్ కాలేజీ ఎందుకు పెట్టినట్లు! అసలు మెడికల్ కాలేజీ అంటే అర్థం ఏమిటి! విద్యార్థులను వైద్యులుగా తయారు చేసే కాలేజీలోలలో కూడా అధునాతన వైద్యం అందుబాటులో లేకపోతే వారికి ఏం నేర్పుతున్నట్లు. వైద్య విద్య ఎలా భోదిస్తున్నట్లు. వరంగల్ లాంటి నగరాలలో కూడా మెరుగైన వైద్యం ఎందుకు అందడం లేదు! ఇంతకన్నా దౌర్భాగ్యమేమైనా వుంటుందా! ఈ వ్యవస్థలను ఎవరూ పట్టించుకోరా! నిజాం కాలం నాటి ఆసుపత్రులు తప్ప కొత్తగా ఇన్నేళ్ల కాలంలో పాలకులు వైద్య విధానంలో తెచ్చిన మార్పులేవి. ఉత్తర తెలంగాణకే తలమానికమైన వరంగల్ లో నాణ్యమైన వైద్యం అందకపోవడం శోచనీయం. వరంగల్, కరీంనగర్ లాంటి ఉమ్మడి జిల్లా కేంద్రాలలో ఇప్పటికీ అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి రాకపోవడానికి కారణాలేమిటి? జనం సొమ్ము లాగేయడం తప్ప ఆసుపత్రులు చేస్తున్నదేమిటి? వరంగల్ జిల్లా నుంచి నిత్యం పదుల సంఖ్యలో అత్యవస వైద్య చికిత్స కోసం ఎందుకు వెళ్లాల్సివస్తుంది. పైగా వరంగల్ లో వైద్యం మీద నమ్మకం లేక చాలా మంది హైదరాబాద్ కే ఎందుకు వెళ్తున్నారు. ఆరోగ్య శ్రీ అమలు చేస్తున్నామని పాలకులు చేతులు దులుపుకుంటే సరిపోతుందా? మహారాష్ట్రతో పాటు ఉత్తర భారతదేశంలో ప్రభుత్వప్రైవేటు భాగస్వామ్యంతో ఆసుపత్రులు నిర్వహిస్తారు. పూర్తి స్థాయి ప్రైవేటు వైద్యాన్ని అక్కడ అమలుచేయడం లేదు. ప్రభుత్వాలు అనుమతించడం లేదు. దాంతో వైద్యులకు, ఆసుపత్రుల నిర్వాహకులకు, ప్రభుత్వానికి కూడా భయం వుంటుంది. ప్రభుత్వం వెచ్చిస్తున్న నిధుల మీద స్పష్టమైన లెక్కలుంటాయి. ఆధారాలుంటాయి. వైద్యం అందుతున్న విధానం మీద స్పష్టమైన అవగాహన పాలకులకు వుంటుంది. పొరపాట్లు జరక్కుండా నియంత్రణ వుంటుంది. కానీ మన దగ్గర అలాంటి వ్యవస్థ లేదు. అయితే ప్రైవేటు ఆసుపత్రులు. లేకుంటే ప్రభుత్వాసుపత్రులు. ప్రభుత్వాసుపత్రులలో పని చేసే వైద్యులకు ప్రత్యేకంగా ఆసుపత్రులు. మరీ విచిత్రమేమిటంటే జిల్లా వైద్యాధికారులుగా పెద్ద ఎత్తున ప్రభుత్వ జీతాలు అందుకునే వారికి కూడా ఆసుపత్రులు ఉన్నాయి. నిజానికి జిల్లా వైద్యాధికారులు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల నిర్వహణపై నియంత్రణ కోసం కొలువు చేయాలి. కానీ ఆ కర్తవ్యం మర్చిపోయారు. వైద్యులుగా బాధ్యతలను ఎప్పుడో విస్మరించారు. వ్యవస్థను మొత్తం చెడగొడుతున్నారు. పేదలకు ప్రభుత్వ వైద్యం అందకుండా చేస్తున్నారు. ప్రభుత్వ ఆరోగ్య శ్రీ నిధులను దోచేయడానికి, ప్రైవేటు ఆసుపత్రులలో కమీషన్లు వసూలు చేయడానికి విలువైన సమయాన్ని వెచ్చిస్తున్నారు. హైదరాబాద్ లాంటి నగరంలోనే దొంగ డాక్టర్లు, నకిలీ ఆసుపత్రులు వెలుస్తున్నాయంటే నిఘా వ్యవస్థ ఏం చేస్తోంది? ఇలా చెప్పుకుంటూ పోతే
సర్వ దరిద్రాలకు వైద్య శాఖ నిలయమైపోయింది. పేదలకు వైద్యం అందకుండా పోతోంది. ప్రభుత్వ నిధుల ఖర్చు తప్పడం లేదు. ప్రజల జేబులు ఖాళీ కావడం ఆగడం లేదు. అయినా వైద్యంలో ఎక్కడ లోపం జరుగుతోంది.
ప్రజల ఆరోగ్యాలతో ఆటలెందుకు? ఆరోగ్యశ్రీ పథకాలతో ప్రైవేటుకు దోచిపెట్టడమెందుకు?
అదే చదువు…అదే వైద్యం… ప్రభుత్వాసుపత్రుల్లో ఎందుకు జరగదు! ప్రభుత్వ వైద్యం బలోపేతం చేయరెందుకు? ప్రభుత్వాసుత్రుల్లో నాయకులు వైద్యమెందుకు చేయించుకోరు?.. ప్రైవేటు హెల్త్ ఇన్యూరెన్సుల మోసాలపై ప్రభుత్వాలు స్పందించవెందుకు?