#ప్రతీ రైతుకు పంట రుణాలు ఇవ్వాలి.
# చెరువు శిఖాలు ప్రభుత్వ భూములను రక్షించి పేదలకు పంచాలి.
# ప్రైవేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజుల దోపిడిని అరికట్టాలి
# ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్
#ఎంసిపిఐ(యు) ఆధ్వర్యంలో ఆర్డీవో ఆఫీస్ వద్ద ధర్నా.
నర్సంపేట,నేటిధాత్రి :
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయకపోతే ప్రజా పోరాటాలు తప్పవని ఈ క్రమంలో గత ప్రభుత్వానికి పట్టిన గతే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి పడుతుందని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ హెచ్చరించారు. సోమవారం భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ (ఐక్య)- ఎంసిపిఐ(యు) ఆధ్వర్యంలో నర్సంపేట ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ హాజరై మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నేటికీ 7 నెలలు గడిచిన ఎన్నికల ముందు ఇచ్చిన ముఖ్యమైన హామీలను అమలు చేయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రస్తుతం ఖరీఫ్ వ్యవసాయ సీజన్ ప్రారంభమై రైతాంగం విత్తనాలను నాటడానికి ప్రయత్నిస్తుండగా ఇప్పటివరకు రైతులకు అవసరమైన విత్తనాలను ఎరువులను సరఫరా చేయకుండా పరోక్షంగా నకిలీ విత్తనాలను బ్లాక్ మార్కెటింగ్ ను ప్రోత్సహిస్తున్నట్లు కనబడుతున్నదని పేర్కొన్నారు. మరోవైపు పంటల పెట్టుబడి కోసం రుణాల ప్రక్రియ సైతం ప్రారంభించలేదని రెండు లక్షల రుణమాఫీని ఆగస్టు 15 తర్వాత చేస్తామని అనడంతో బ్యాంకర్లు తక్షణమే రైతులకు పంట రుణాలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని అన్నారు. కౌలు రైతులను నేటికీ గుర్తించకుండా తాత్సారం చేయడం తగదన్నారు. పంట పండించే ప్రతి రైతుకు పంట రుణం ప్రభుత్వ పథకాలు వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. అలాగే వ్యవసాయ కూలీలకు 12 వేల రూపాయలను ఎకౌంట్లో జమ చేయాలన్నారు. ఆక్రమణకు గురైన చెరువు శిఖం వివిధ రకాల ప్రభుత్వ భూములను గుర్తించి పేదలకు పెంచాలని డిమాండ్ చేశారు.ఇప్పటికే పేదల స్వాధీనంలో ఉన్న ప్రభుత్వ భూములకు పట్టాలివ్వాలని కోరారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో నైన ప్రైవేటు విద్యాసంస్థల్లో అధిక ఫీజుల దోపిడిని అరికట్టి ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయాలని నిబంధనల విరుద్ధంగా వివరించే ప్రైవేటు విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.అనంతరం స్థానిక ఆర్డిఓ కార్యాలయ అధికారికి మెమోరాండం సమర్పించారు.ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి, ఏఐసిటియు జిల్లా అధ్యక్షులు ఎండి మాశూక్, మండల పట్టణ నాయకులు గజవెల్లి జగపతి, సాయి కుమార్, పాషా, కుక్కల యాకయ్య, జయ, రణధీర్,జరీనా విజయ, సూరయ్య లతోపాటు కార్యకర్తలు పాల్గొన్నారు.