
మందమర్రి, నేటిధాత్రి:-
సింగరేణి యాజమాన్యం ఏరియాలో గతంలో మాదిరి ప్రథమ చికిత్స శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) బ్రాంచ్ అధ్యక్షుడు ఎస్ వెంకటస్వామి, ఏరియా కార్యదర్శి అల్లి రాజేందర్ లు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఏరియా జిఎం ఏ మనోహర్ కు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, గతంలో మహిళల కోసం ఏరియాలోని సిమ్టార్స్ లో ప్రథమ చికిత్స శిక్షణ తరగతులు నిర్వహించి, దృవీకరణ పత్రాలు అందజేయడం జరిగిందని, ప్రస్తుతం అదే విధంగా పురుష అభ్యర్థులకు, కొత్తగా చేరుతున్న మహిళలకు స్థానికంగా ప్రథమ చికిత్స శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే, ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుందని తెలిపారు. ప్రథమ చికిత్స శిక్షణ తీసుకోవాలనే ఉద్యోగులు విధుల అనంతరం సుమారు 40కిలోమీటర్ల దూరంలోని గోదావరిలోని నిమ్ లో ఏర్పాటు చేసిన ప్రథమ చికిత్స శిక్షణ కేంద్రానికి వెళ్లి రావడం ఇబ్బందికరంగా ఉంటుందని, విధులు నిర్వహించి రెండు, మూడు గంటలు వ్యయ ప్రయాసలకు ఓర్చి ప్రయాణం చేసి, రావడం చాలా కష్టమని వివరించారు. శ్రీరాంపూర్, బెల్లంపల్లి, మందమర్రి లోని కార్మికుల కొరకు ప్రథమ చికిత్స శిక్షణ కేంద్రాన్ని ఏరియాలో ఏర్పాటు చేస్తే మరి కొంత మంది శిక్షణ పొందేందుకు అవకాశం కలుగుతుందని తెలిపారు. నిర్ణయాత్మక సమావేశాల్లో సిఐటియు చేసిన విజ్ఞప్తి మేరకు సర్దార్ ట్రేనింగ్ ఇస్తున్న యాజమాన్యం, ఆ అభ్యర్థులకు సైతం ఈ ప్రథమ చికిత్స సర్టిఫికెట్ ఎంతగానో ఉపయోగపడే అవకాశం ఉందని, దీనిపై యాజమాన్యం చొరవ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ కేకే 5గని పిట్ కార్యదర్శి సంకె వెంకటేష్, నాయకులు సందీప్, అల్వాల సంజీవ్, చైతన్య రెడ్డి, కలువల శ్రీనివాస్, దుర్గం రాంబాబు, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.