రాష్ట్ర ప్రభుత్వం వద్ద రైతు సమాచారం పూర్తిస్థాయిలో లేదు
రాష్ట్ర ప్రభుత్వం వద్ద రైతుల పూర్తి సమాచారం అందుబాటులో లేదని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు సమగ్ర సమాచార సర్వేలో పాల్గొని పూర్తిస్థాయిలో సహకరించి విజయవంతం చేయాలని నర్సంపేట వ్యవసాయ శాఖ ఏడిఏ శ్రీనివాసరావు అన్నారు. బుధవారం నర్సంపేట డివిజన్‌లోని దుగ్గొండి మండలకేంద్రంతోపాటు రేకంపల్లి, లక్ష్మీపురం, తిమ్మంపేట గ్రామాలలో రైతు సమగ్ర సమాచార సర్వేను మండల వ్యవసాయ శాఖ అధికారి చిలువేరు దయాకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామాలలో నిర్వహించిన రైతు సమగ్ర సమాచార సర్వే కార్యక్రమానికి ఏడీఏ శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలోని రైతులు పండించే పంటలు, పంటల గిట్టుబాటు ధరలు, భూములు ఉన్నప్పటికీ రైతు బంధు చెక్కులకు సంబంధించిన వివరాలు, పంట భూములకు సంబంధించిన వివరాల పట్ల రెవెన్యూ శాఖలో అనేక ఇబ్బందులు పెడుతున్న విధానం పట్ల వ్యవసాయశాఖ అధికారులతో విన్నవించుకున్నారు. రైతు సమగ్ర సమాచార సర్వేలో ప్రతి రైతు పాల్గొని తమ పట్టా పాసు పుస్తకాలు, ఆధార్ కార్డు, బ్యాంక్ పాసుబుక్ జిరాక్సులను అందించాలన్నారు. రెవెన్యూ శాఖలో పలు అంశాలు త్వరలో పరిష్కారం కానున్నాయని తెలిపారు. రైతులు పండించే వివిధ పంటలకు నష్టం వాటిల్లకుండా వాతావరణ బీమా పథకంలో ప్రతి రైతు చేరాలన్నారు. మండల వ్యవసాయ శాఖ అధికారి దయాకర్ మాట్లాడుతూ రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెడుతున్నదని తెలిపారు. రైతుల అభివద్ధి కోసం మండల శాఖ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయశాఖ విస్తీర్ణ అధికారులు రాజేష్, మాలోతు హనుమంతునాయక్, మోడెం విశ్వశాంతి గౌడ్, మధు, సర్పంచ్‌లు మోడీ విద్యాసాగర్ గౌడ్, తోకల మంజుల, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ తోకల నర్సింహారెడ్డిలతోపాటు ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.