దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఏటా దసరా జరుపుకుంటారు. అయితే విజయ దశమి రోజున అమ్మ వారికి దర్శనం, శమీ పూజ, రావణ దహనంతో పాటు పాలపిట్టను కూడా చూడడం ఆనవాయితీగా వస్తోంది.
దసరా రోజు సాయంత్రం జమ్మీ ఇచ్చిపుచ్చుకున్న తర్వాత పాల పిట్టను చూడడం ఆనవాయితీగా వస్తుంది. సాయంత్రం ప్రజలు ఊరి చివరకు వెళ్లి పొలాల మధ్య పాలపిట్టను చూస్తుంటారు. టెక్నాలజీ ఎంత మారుతున్నా ఇప్పటికే ఈ ఆనవాయితీని పాటిస్తూ వస్తున్నారు ప్రజలు. ఇంతకీ దసరా రోజు పాలపిట్టను ఎందుకు దర్శించుకుంటారు.?
పాలపిట్టను చూస్తే విజయం దక్కుతుందనే నమ్మకం వెనకాల పురాణ గాథ ప్రాచుర్యంలో ఉంది. త్రేతా యుగంలో రావణాసురిడితో శ్రీరాముడు యుద్ధానికి బయలుదేరిన సమయంలో పాలపిట్ట కనిపిస్తుంది. ఆ రోజు విజయదశమి కావడం విశేషం. అయితే అనంతరం జరిగిన యుద్ధంలో రావణ సంహారం జరిగి, రాముడు విజయం సాధిస్తారు. దీంతో పాలపిట్టను చూడడం శుభశకునంగా భావించడం ఆనవాయితీగా వస్తోంది.
ఇక మహాభారతంలోనూ పాలపిట్ట ప్రస్తావన ఉంది. పాండవులు జమ్మి చెట్టు మీద దాచిన ఆయుధాలను ఇంద్రుడు పాలపిట్ట రూపంలో కాపాలా కాశాడని పురాణాలు చెబుతున్నాయి. అలాగే పాండవులు అజ్ఞాత వాసాన్ని ముగించుకొని తిరిగి తమ రాజ్యానికి పయణమైన సమయంలోనూ వారికి పాలపిట్ట దర్శనమిచ్చిందని, దీంతో పాలపిట్ట కనిపించినప్పటి నుంచి పాండవులకు అన్ని విజయాలే దక్కాయని అందుకే పాలపిట్ట విజయానికి సూచికగా భావించడం నమ్మకంగా మారింది.