వన్డే ప్రపంచకప్‍లో టీమిండియా అద్భుత ప్రదర్శన కొనసాగింది. హైవోల్టేజ్ మ్యాచ్‍లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‍ను భారత్ చిత్తుచిత్తుగా ఓడించింది. వరల్డ్ కప్ 2023లో వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసుకుంది రోహిత్ సేన. ప్రపంచకప్ పాయింట్ల పట్టికలో టాప్‍కు చేరింది. వన్డే ప్రపంచకప్‍లో భాగంగా అహ్మదాబాద్‍లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‍లో భారత్ 7 వికెట్ల తేడాతో పాకిస్థాన్‍పై అలవోక విజయం సాధించింది.
స్వల్ప లక్ష్యఛేదనలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ మెరుపు హాఫ్ సెంచరీతో దుమ్మురేపాడు. దీంతో భారత్ 30.3 ఓవర్లలోనే 3 వికెట్లకు 192 పరుగులు చేసి గెలిచింది. 117 బంతులను మిగిల్చి మరీ పాక్‍ను టీమిండియా చిత్తు చేసింది. శ్రేయస్ అయ్యర్ అర్ధ శతకంతో రాణించాడు. పాకిస్థాన్ బౌలర్లలో షహిన్ షా అఫ్రిది రెండు, హసన్ అలీ ఓ వికెట్ తీశాడు. అంతకు ముందు తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 42.5 ఓవర్లలో 191 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లు జస్‍ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యా, కుల్‍దీప్ యాదవ్, రవీంద్ర జడేజా చెరో రెండు వికెట్లు తీసి పాక్‍ను కూల్చారు. పాక్ బ్యాటర్లలో కెప్టెన్ బాబర్ ఆజమ్ (50), మహమ్మద్ రిజ్వాన్ (49) మాత్రమే రాణించారు.
వన్డే ప్రపంచకప్ చరిత్రలో పాకిస్థాన్‍పై అజేయ రికార్డును టీమిండియా మరింత పదిలం చేసుకుంది. ఈ మ్యాచ్ కిందటి వరకు వన్డే ప్రపంచ కప్ టోర్నీల్లో పాక్‍తో తలపడిన ఏడుసార్లు భారత జట్టే గెలిచింది. ఇప్పుడు ఎనిమిదోసారి కూడా విజయం సాధించి వన్డే ప్రపంచకప్‍ల్లో పాక్‍పై 8-0తో రికార్డును భారత్ కంటిన్యూ చేసింది.