మాజీ మంత్రి “జువ్వాడి” ఇకలేరు

చికిత్స పొందుతూ ఆస్పత్రిలో
“‘రత్నాకర్ రావు”‘ మృతి

ఆరిన బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి

జగిత్యాల జిల్లా ప్రతినిధి (నేటి ధాత్రి): బడుగు బలహీన వర్గాలు, పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసి, నిత్యం ప్రజాసేవలో నిమగ్నమైన మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా బుగ్గారం పాత అసెంబ్లీ నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు, మాజీ దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు (92) ఇకలేరనే వార్త ఆయన అభిమానులు, కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

కరీంనగర్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం రత్నాకర్ రావు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు.

రాజకీయ దురంధరుడు, అజాత శత్రవు, అన్నివర్గాల ప్రజలకు ఆరాధ్యుడైన రత్నాకర్ రావు మృతి కాంగ్రెస్ పార్టీ కే కాకుండా యావత్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విషాదాన్ని నింపింది.
తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని స్వగ్రామమైన తిమ్మాపూర్ నుండి సర్పంచ్ గా రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టి రాజకీయ రంగంలో అంచెలంచెలుగా ఎదిగి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాటి “‘బుగ్గారం”‘ అసెంబ్లీ నియోజకవర్గానికి చివరి ఎమ్మెల్యే గా ఉండి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి గా పదవిని అలంకరించారు. ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిచే రత్నాకర్ రావు ప్రశంసలు అందుకున్నారు.

మన భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కి రత్నాకర్ రావు అత్యంత సన్నిహితంగా ఉన్నారు. ఆయన జగిత్యాల పంచాయతీ సమితి ప్రెసిడెంట్ గా పని చేశారు.
సమితి ప్రెసిడెంట్ గా గ్రామాలాభివృద్దికి పాటుపడ్డారు. బుగ్గారం నియోజకవర్గం ప్రజలు ఎమ్మెల్యే గా గెలిపించి రాష్ట్ర స్థాయిలో రత్నాకర్ రావును ప్రజాసేవ కోసం పంపించారు.
బుగ్గారం నుండి మూడు సార్లు ఎమ్మెల్యే గా ఎన్నికై నియోజకవర్గంలో పేదలకు ఇళ్ళ నిర్మాణం, రోడ్లు, తాగు, సాగు నీటి సరఫరా, విద్యుత్ సౌకర్యం కల్పించి గ్రామాలాభివృద్దికి పాటుపడ్డ నిజాయితీ గల గొప్ప నాయకులు రత్నాకర్ రావని అధికారులు, ప్రజలు, పార్టీ శ్రేణులు పేర్కొన్నారు.

ఆయన ఇలవేల్పు ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం అధ్యక్షులు గా పనిచేసి ధర్మపురి ప్రాశస్త్యాన్ని రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లిన మహా నాయకుడు జువ్వాడి రత్నాకర్ రావు. అలాగే ధర్మపురి పట్టణంలో నేటికీ కొనసాగుతున్న సంస్కృతాంధ్ర కళాశాల (ఓరియంటల్ కళాశాల) పాలక మండలికి అధ్యక్షులుగా జువ్వాడి రత్నాకర్ రావు నేటికి కూడా కొనసాగుతున్నారు. ఈ కళాశాల ద్వారా అనేక మంది విద్యనభ్యసించి ప్రభుత్వ, ప్రయివేట్ ఉద్యోగాలు పొందారు. ఈ కళాశాల పాలక మండలి ప్రధాన కార్యదర్శిగా రత్నాకర్ రావుకు నమ్మిన బంటు అయిన సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విద్యావేత్త సంఘనభట్ల రామకిష్టయ్య కూడా నేటికీ కృషి చేస్తున్నారు.

జువ్వాడి రత్నాకర్ రావు అధికారిక, అనధికార కార్యక్రమమైనా ఇచ్చిన సమయానికి రావడం, ప్రొటోకాల్ పాటించడం, ప్రజలను ఆప్యాయంగా పలకరించి వచ్చిన పని అధికారులతో మాట్లాడి చేసి పెట్టే వారనీ అంతేకాకుండా ఆయన క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచారని ప్రజలు కొనియాడుతున్నారు.

నిజాయితీగా, క్రమశిక్షణతో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని ఆనాడు కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కృషి చేశారు.
కాగా జువ్వాడి రత్నాకర్ రావుకు భార్య , ముగ్గురు కుమారులు ఉన్నారు.
రత్నాకర్ రావు మృతి కాంగ్రెస్ పార్టీ కీ ముఖ్యంగా ఆయన అభిమానులకు తీరనిలోటనీ, జువ్వాడి ఆశయాలను ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, అభిమానులు కొనసాగించాల్సిన అవసరముందని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు.

గోదావరినది తీరంలో మంత్రి జువ్వాడి అంత్యక్రియలు

జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తిమ్మాపూర్ వాస్తవ్యులు కాంగ్రేస్ పార్టీ సీనియర్‌ నాయకులు, మాజీ దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి జువ్వాడి రత్నాకర్‌రావు ఆదివారం మరణించారు. వారి స్వగ్రామం తిమ్మాపూర్ లో జువ్వాడి రత్నాకర్ రావు పార్థివ దేహాన్ని పలువురు నేతలు సందర్శించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్ రావు జువ్వాడి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతిమయాత్ర లో మంత్రులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ప్రభుత్వ లాంచనాలతో జరిగిన అంత్యక్రియల్లో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్, ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ గుగులోతు రవి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ నేతలు, వివిధ పార్టీల శ్రేణులు, ప్రజా ప్రతినిధులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఇంత కరోనా కట్టడి సమయంలో కూడా జువ్వాడి రత్నాకర్ రావు అభిమానులు వేలాదిగా తరలివచ్చి ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా ఎస్పీ సింధూశర్మ ఆదేశాలతో ప్రభుత్వ లాంఛనాల ప్రకారం తిమ్మాపూర్ గ్రామ శివారు గోదావరి నది తీరాన ఏర్పాటు చేసిన కాట్నం పైన జాతీయ జెండా ఉంచి, పోలీసులు గౌరవ వందనం తెలిపారు. గాలిలోకి తుపాకులతో కాల్పులు జరిపి జువ్వాడి రత్నాకర్ రావు అంత్యక్రియలు నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!