ప్రజా సంక్షేమానికే మా ప్రథమ ప్రాధాన్యం…
శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తున్న పోలీసు శాఖకు అండగా ఉంటాం హోం మంత్రి మహమూద్ అలీ…
*ప్రజల రక్షణ కోసం, ప్రజా సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అహర్నిశలు పాటుపడుతోందని తెలంగాణ హోం మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ పేర్కొన్నారు.
ఈరోజు మేడిపల్లిలోని రాచకొండ కమిషనర్ నూతన భవన నిర్మాణ సముదాయానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో హోం మంత్రి మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత శాంతి భద్రత విషయంలో ఎన్నో సందేహాలు ఉండేవని, ముఖ్యమంత్రి కెసిఆర్ దార్శనికత వల్ల, వారు తీసుకున్న చర్యల వల్ల ఇప్పుడు తెలంగాణ ప్రశాంతంగా ఉందని పేర్కొన్నారు. రాచకొండ కమిషనరేట్ దేశంలోనే విస్తీర్ణపరంగా అతిపెద్ద కమిషనరేట్ అని, నగర పరిధినే కాక ఇతర సమీప జిల్లాలను కూడా కలుపుకొని పనిచేస్తూ జంట నగరాల శాంతిభద్రతల పరిరక్షణలో ప్రముఖ పాత్ర పోషిస్తుందని తెలిపారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత పోలీసు శాఖకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం అధిక బడ్జెట్ కేటాయించడం నూతన పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయడం ద్వారా శాంతిభద్రతల వ్యవస్థను బలోపేతం చేశామని తెలిపారు. ఈరోజు సీసీటీవీలో కెమెరాల సంఖ్యలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని పోలీస్ పెట్రోలింగ్ కోసం ఇన్నోవాలను ఇచ్చిన ప్రథమ రాష్ట్రం తెలంగాణ అని హోమ్ మంత్రి పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్న పోలీస్ శాఖకు అన్నివేళలా ప్రభుత్వం అండగా ఉంటుందని, వారికి అవసరమైన అన్ని రకాల తోడ్పాటును అందిస్తామని హోమంత్రి పేర్కొన్నారు.
కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ రాచకొండ కమిషనరేట్ యొక్క నూతన భవన సముదాయ నిర్మాణాన్ని తమ నియోజకవర్గ పరిధిలో ఉన్న మేడిపల్లిలో ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రాచకొండ పరిధిలో ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయని, నగరం విస్తరిస్తోందని తద్వారా నేరాలు కూడా పెరిగే అవకాశం ఉందని కానీ రాచకొండ పోలీసుల సమర్థవంతమైన పనితీరు, కృషి వల్ల నేరాలు జరగకుండా ప్రశాంతంగా ఉందని పేర్కొన్నారు.
రాచకొండ కమిషనర్ డి ఎస్ చౌహన్ ఐపీఎస్ మాట్లాడుతూ… విస్తీర్ణపరంగా రాచకొండ కమిషనరేట్ దేశంలోనే అతి పెద్దదని, నగరంలోని కొన్ని ప్రాంతాలతో పాటు పక్కనే ఉన్న జిల్లాలోని ప్రాంతాలను కూడా కలుపుకొని రాచకొండ కమిషనరేట్ ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ప్రజలకు సమర్థవంతంగా సేవలు అందించడానికి తోడ్పడేలా కేటాయించిన స్థలంలో సువిశాల ప్రాంగణంలో నూతన కమిషనరేట్ భవన సముదాయ నిర్మాణం జరగడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న వివిధ రకాల పోలీసు విభాగాల అధికారులు మరియు సిబ్బందికి సంబంధించిన భవనాలు అన్ని ఈ ప్రాంగణంలో ఉంటాయని కమిషనర్ పేర్కొన్నారు.
రాచకొండ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతలను అదుపులో ఉంచడానికి నేరశాతం తగ్గించడానికి మహిళల పట్ల నేరాలను హింసను తగ్గించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల నుండి నగరంలోకి వస్తున్న అక్రమ మాదకద్రవ్యాల ముఠాలను పట్టుకొని ఎన్నో కేసులు నమోదు చేశామని తెలిపారు. మానవ అక్రమ రవాణా అరికట్టడానికి ప్రత్యేక టీములు ఏర్పాటు చేసి అటువంటి ముఠాల మీద ఉక్కు పాదం మోపుతున్నామన్నారు. ప్రజా సంక్షేమం కోసం శాంతి భద్రత పరిరక్షణ కోసం రాచకొండ కమిషనర్ ఎల్లవేళలా పాటుపడుతుందని కమిషనర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ ట్రాఫిక్ అభిషేక్ మహంతి ఐపిఎస్, డీసీపీ మల్కాజ్గిరి జానకి ఐపిఎస్, ఎల్బీనగర్ డిసిపి సాయి శ్రీ, డీసీపీ సైబర్ క్రైం అనురాధ, ఐపీఎస్ SOT- 1 డిసిపి గిరిధర్ ఐపీఎస్, SOT- డీసీపీ మురళీధర్, రోడ్ సేఫ్టీ డీసీపీ శ్రీబాలా, అడిషనల్ డీసీపీలూ, ఏసిపిలు
పీర్జాదిగూడా మరియు బోడుప్పల్ మేయర్లు జక్క వెంకటరెడ్డి & సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్లు, గ్రంధాలయ సంస్థ చైర్మన్ దర్గా దయాకర్ రెడ్డి, రెండు కార్పొరేషన్ల మున్సిపల్ కమిషనర్లు,స్థానిక MRO, ఇతర వివిధ సంస్థల అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు, అన్ని మీడియా ప్రతినిధులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.