సాంకేతిక వ్యవస్థలపై పూర్తి పరిజ్ఞానం ఉండాలి
జిల్లాలోని పోలీస్‌స్టేషన్‌లలో విధులు నిర్వహించే కానిస్టేబుల్, సిసి టిఎన్‌ఎస్ రైటర్లు, రిసెప్షనిస్టులకు సాంకేతిక వ్యవస్థలపై పూర్తి పరిజ్ఞానం ఉండాలని సిరిసిల్ల రాజన్న జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీస్‌స్టేషన్‌లలోని సిబ్బందికి ఒకరోజు శిక్షణా శిబిరం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సిసిటిఎన్‌ఎస్ రైటర్లు, రిసెప్షనిస్టులకు, పోలీస్‌స్టేషన్ టెక్ టీమ్ సిబ్బందికి సిసిటిఎన్‌ఎస్, టెక్ డాటమ్, రిసెప్షన్ సెంటర్, 07 ఇంటిగ్రేటెడ్ ఫార్మ్స్ ఎంట్రీ, పోలీస్‌స్టేషన్ సంబంధిత రికార్డుల ఆన్‌లైన్ ఎంట్రీ అంశాలపై కొనసాగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…ప్రస్తుత ఆధునికయుగంలో మారుతున్న, దూసుకుపోతున్న టెక్నాలజీని మనకు అందుబాటులో ఉన్న అంశాలు విరివిగా వాడుకుంటూ మోడరన్ పోలీసింగ్ చేయాలని తెలిపారు. ప్రతిఒక్కరు విధుల్లో ఉపయోగించే అన్ని సాంకేతిక వ్యవస్థలపై పూర్తి పరిజ్ఞానం కలిగి ఉండాలని అన్నారు. జిల్లా పోలీసు సిబ్బంది అందరికి పలు దఫాలలో శిక్షణ శిబిరాలు నిర్వహిస్తామని, ఈ శిక్షణ శిబిరాలలో నేర్చుకున్న అంశాలు రోజువారీ విధుల్లో ఉపయోగిస్తూ వేగవంతమైన ఫలితాలు రాబట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతోపాటు సిరిసిల్ల రూరల్ సీఐ అనిల్‌కుమార్, ఎస్సై రాజశేఖర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.